హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒకటి బిర్యానీ అయితే మరొకటి ఇరానీ చాయ్.. సాయంత్రం అయ్యిందంటే చాలు.. నలుగురూ ఒకచోట చేరి చాయ్ తాగుతూ ముచ్చట్లు పెడుతుంటారు. ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టి సాయంత్రం కాస్త సేదతీరుతుంటారు. ఓ కప్పు టీ తాగితే ఉంటుంది భయ్యా.. శిరోభారం హుష్ కాకి అన్నట్టే.. అయితే..చాయ్ మాత్రమే కాదు.. చాలా మంది కాఫీ ప్రియులు కూడా ఉంటారు.. అలా గ్లాసులో కాఫీ పట్టుకొస్తుంటే.. ఆ రంగు.. ఆ అరోమా చూస్తే చాలు ఏదో తెలియని అనుభూతి. అలాంటి కాఫీ కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు.. జస్ట్ అలా అశోక్‌నగర్ వెళ్తే చాలు.
⇒ పర్ఫెక్ట్ ఫిల్టర్ కాఫీకి కేరాఫ్ అడ్రస్..
⇒ ఇద్దరు అభ్యర్థుల వినూత్న ప్రయత్నం
⇒ అశోక్‌నగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా
⇒ మీమ్స్‌తో ఆకట్టుకుంటున్న యువత
దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కాఫీకి ఫ్యాన్స్ ఎక్కువ. ముఖ్యంగా ఫిల్టర్ కాఫీ ప్రియులు చాలా మంది ఉంటారు. మన దగ్గర కూడా ఫిల్టర్ కాఫీ ప్రియులు చాలా మందే ఉన్నారు. కాకపోతే ఫిల్టర్ కాఫీ అంత సులువుగా దొరకదు. చాలా ప్రాంతాల్లో ఇన్‌స్టంట్ కాఫీయే దొరుకుతుంది. అందుకే ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఫిల్టర్ కాఫీ ప్రియుల కోసం కాఫీపురం పేరుతో చిన్న కేఫ్‌ను స్థాపించారు.
అడుగడుగునా మీమ్స్..
ఇప్పుడు ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. యువతను చాలా ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రెండ్‌ను వీరు ఒడిసి పట్టుకున్నారు. కేఫ్‌లో ఎక్కడ చూసినా కామెడీ మీమ్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. పేమెంట్ క్యూఆర్ కోడ్ వద్ద, సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేందుకు కూడా మీమ్స్‌నే వాడుతున్నారు. చిక్కమగళూరు కాఫీ, కూర్గ్ కాఫీ, అరకు కాఫీ, బీఆర్ హిల్స్ కాఫీ వంటి కాఫీ వెరైటీలను ప్రత్యేకంగా గ్రేడింగ్ చేయించి తెప్పిస్తున్నారు. జస్ట్ అలా షాప్‌లోకి అడుగు పెడితే చాలు కాఫీ అరోమాతో ముక్కుపుటాలు అదిరిపోతాయనడంలో అతిశయోక్తి లేదు.
యూపీఎస్సీ అభ్యర్థుల వినూత్న ప్రయత్నం..
వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ.. కిశోర్ సంకీర్త్, కె.అభినయ్ అనే అభ్యర్థులు ఈ కేఫ్‌ను స్థాపించారు. కాస్త వినూత్నంగా ఆలోచించి దీనికి కాఫీపురం అని పెట్టారు. కాఫీ గింజలను ప్రత్యేకంగా పశ్చిమ కనుమలు, అరకు నుంచి తెప్పించి మరీ కాఫీ తయారు చేస్తున్నారు. మరో ప్రత్యేకత ఏమిటంటే కచ్చితంగా అందరికీ స్టీలు గ్లాసుల్లోనే అందిస్తున్నారు. వాడిన గ్లాసులను స్టీమ్ ద్వారా స్టెరిలైజ్ చేస్తారు. పరిశుభ్రతతో పాటు మంచి ఫిల్టర్ కాఫీ అనుభూతిని అందించడమే తమ ప్రథమ లక్ష్యమని చెబుతున్నారు.
అథెంటిక్ కాఫీ ఇవ్వాలని..
హైదరాబాద్‌లో అథెంటిక్ ఫిల్టర్ కాఫీ చాలా అరుదుగా దొరుకుతుంది. పుస్తకాలతో కుస్తీ పట్టి అలా సేదతీరాలనుకునే వారి కోసం ఈ కేఫ్ పెట్టాను. ఫ్రెండ్స్‌తో కలిసి మాట్లాడుతుంటే ఈ ఆలోచన వచి్చంది. – కిశోర్ సంకీర్త్, వ్యవస్థాపకుడు
ఫిల్టర్ కాఫీ కోసమే వస్తాను..
యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఇక్కడికి వచ్చాను. మాది కర్ణాటక. ఎక్కువగా ఫిల్టర్ కాఫీ తాగుతాను. చాలాచోట్ల ఫిల్టర్ కాఫీ కోసం వెతికాను. చివరకు కాఫీపురం గురించి తెలుసుకుని, ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి కాఫీ తాగనిదే రోజు గడవదు.
–స్ఫూర్తి, బెంగళూరు, యూపీఎస్సీ అభ్యర్థి
ప్రభుత్వ ఉద్యోగం నా కల..
కేఫ్ నిర్వహణ నా చదువుకు ఇబ్బంది కాకుండా ప్లాన్ చేసుకుంటాను. పకడ్బందీగా షెడ్యూల్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం నా కల. అలాగే భవిష్యత్తులో కాఫీ షాప్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనేదే నా కోరిక.
– కపాడం అభినయ్, కాఫీపురం కో–ఫౌండర్
Comments
Please login to add a commentAdd a comment