భువనగిరిలో మీడియాతో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి: సీఎం కేసీఆర్ నిజాయితీగా ఉంటే దేశంలో కోల్ ఇండియా మాదిరిగానే సింగరేణిలో కూడా టెండర్లు పిలవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరిలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘పోటీ ఎక్కువగా ఉంటే తక్కువ రేటుకు టెండర్లు ఇవ్వటానికి ముందుకు వస్తారు. ఈ టెండర్‌లో ముగ్గురికే అర్హత ఉందని తేల్చారు. కేసీఆర్ సమీప బంధువుకు చెందిన ప్రతిభ ఇన్ఫ్రా అనే కంపెనీతో లోపాయికారి ఒప్పందం మేరకు టెండర్లు జరిగాయ’ని ఆరోపించారు.
ఈ విషయంలో సుప్రీంకోర్టుకు లెటర్ రాశానని, టెండర్లు తెరవగానే వాటిని సుప్రీంకోర్టు రద్దు చేస్తుందన్నారు. రఫెల్ లాంటి కుంభకోణమే సింగరేణిలో జరుగుతోందని ఆరోపించారు. సత్యహరిశ్చంద్రుడి వారసుడినని చెప్పే కేసీఆర్ కోల్ ఇండియాలో ఉన్న నిబంధనలు, సింగరేణిలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇది ఇరవై వేల కోట్ల రూపాయలు చేతులు మారే టెండర్ అని పేర్కొన్నారు. ఇది సింగరేణి సీఎండీ సొంతంగా తీసుకున్న నిర్ణయమా, లేదంటే, కేసీఆర్ ఆదేశాల మేరకు జరిగిందా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment