సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మున్నూరు కాపు సామాజికవర్గం ఐక్యతతో ముందుకు రావడం హర్షణీయమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మున్నూరు కాపుల కోసం ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన స్థలంలో ఆత్మగౌరవ భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. ఈనెల 9న ఆ భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో రాష్ట్రంలోని వివిధ మున్నూరు కాపు సంఘాల ప్రతినిధులంతా ఆదివారం సమావేశమయ్యారు. మున్నూరు కాపు సంఘాలన్నీ ఏకమైతే ఉండే ప్రయోజనాలను, ఐక్యతతో ఉండాల్సిన అవశ్యకతను ఈ సందర్భంగా మంత్రి వారికి వివరించారు. ఆత్మగౌరవ భవన నిర్మాణం, ఏకసంఘంగా ఏర్పడే ట్రస్ట్ విధి విధానాలు, భవిష్యత్తులో మున్నూరు కాపుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై చర్చించారు.
అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఆత్మగౌరవ భవనం భూమి పూజకు రాష్ట్రంలోని మున్నూరు కాపు సంఘాలకు చెందిన జిల్లా అధ్యక్షులు, జిల్లా కమిటీలు, మండల అధ్యక్షులు, మండల కమిటీలు, గ్రామ స్థాయి అధ్యక్షులు, అన్ని గ్రామాల కమిటీలు, నియోజకవర్గాల కో–ఆర్డినేషన్ కమిటీలు హాజరవ్వాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కాచిగూడ మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు మానికొండ వెంకటేశ్వరరావు, నాయకులు మంగళారపు లక్ష్మణ్, కొండూరి వినోద్, సునీల్ కుమార్ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment