సాక్షి, హైదరాబాద్/ మద్దూరు: మావోయిస్టు పార్టీ కీలక నేత, ఛత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యురాలు రావుల సావిత్రి అలియాస్ మాధవి హెడెమె (46) డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. తొలితరం పీపుల్స్‌వార్ నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసి 2019లో గుండెపోటుతో చనిపోయిన రావుల రామన్న అలి యాస్ శ్రీనివాస్ భార్య సావిత్రి. ఆమె లొంగిపోయిన విషయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. సావిత్రి 13 ఏళ్ల వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరారు. రావుల రామన్న 1992లో మావోయిస్టు పార్టీ (పీపుల్స్‌వార్)లో చేరిన సావిత్రిని 1994లో వివాహం చేసుకున్నారు. జనజీవన స్రవంతిలో కలిసినందుకు సావిత్రికి తక్షణ సాయం కింద రూ.50 వేల నగదును అందించారు. తెలంగాణలో లొంగిపోయిన సావిత్రికి రూ. 5 లక్షల చెక్‌ను అందజేయనున్నట్లు చెప్పారు.
లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు
‘మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మావోయిజానికి ఆదరణ తగ్గింది. మావోయిస్టులు బలవంతపెట్టి కొంతమందిని దళంలో చేర్చుకుంటున్నారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు. నేను ఎవరికి తెలియకుండా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయానని సావిత్రి చెప్పారు’అని డీజీపీ వివరించారు. పోలీసులపై జరిగిన తొమ్మిది దాడుల్లో సావిత్రి పాల్గొన్నారని, ఛత్తీస్‌గఢ్‌లో ఆమెపై రూ. 10లక్షల రివార్డు ఉందని తెలిపారు.
కేంద్ర కమిటీలో 13 మంది తెలుగోళ్లే..
‘మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న 20 మందిలో 13 మంది తెలుగువాళ్లే. అందులో తెలంగాణ వాళ్లు 11 మంది కాగా, ఇద్దరు ఏపీకి చెందినవారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వాళ్లు తెలంగాణలోకి ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉంది. వారు ఎప్పుడు తెలంగాణలోకి వచ్చినా.. వెంటనే పట్టుకుంటాం. లొంగిపోయే వారికి పునరావాసం కల్పిస్తాం. 135 మంది తెలంగాణకు చెందిన వాళ్లు బస్తర్‌లో అజ్ఞాతంలో ఉన్నారు. మహిళా నాయకుల్లో గణపతి భార్య సుజాతక్క, కోటేశ్వర్ రావు భార్యతోపాటు మరో మహిళ మావోయిస్టు రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నారు’అని డీజీపీ వివరించారు. కాగా, పోలీసులకు లొంగిపోయినందున ఎలాంటి ఆంక్షలు లేకుండా సావిత్రిని కుటుంబంలోకి ఆహ్వానిస్తామని రామన్న పెద్దన్నయ్య రావుల చంద్రయ్య పేర్కొన్నారు.
తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ షాక్! రామన్న భార్య.. కామ్రేడ్ సావిత్రి లొంగుబాటు!
Published Wed, Sep 21 2022 11:32 AM | Last Updated on Thu, Sep 22 2022 10:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment