సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అధికారాన్ని విస్తరించడం, ఇప్పటికే ఉన్నచోట నిలుపుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ కార్యాచరణను సిద్ధం చేయనుంది. అవసరమైన ప్రణాళికలు, వ్యూహాలపై విస్తృతంగా చర్చించి ఖరారు చేయనుంది. దీనితోపాటు ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా రాబోయే కొన్ని నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణపైనా నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఏడాది, ఏడాదిన్నరలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, తెలంగాణలో సీఎం కేసీఆర్ కూడా ముందస్తుకు వెళ్లవచ్చనే అంచనాల నేపథ్యంలో.. వ్యూహాల అమలును వేగిరం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలనూ ఖరారు చేయనున్నట్టు తెలిసింది.
తెలంగాణపై ప్రత్యేక ఫోకస్
బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నదని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా పకడ్బందీ వ్యూహాన్ని, కార్యాచరణ ప్రణాళికను కార్యవర్గ భేటీలో రూపొందించనున్నారు. ఇందుకోసమే రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ బలాబలాలు, లోటుపాట్లు, టీఆర్‌ఎస్ సర్కార్‌పై వ్యతరేకత, ఏయే అంశాలు ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి, పార్టీ అధికారంలోకి రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై బీజేపీ అధ్యయనం చేపట్టింది. 119 నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, ముఖ్య నేతలను నియోజకవర్గాలకు పంపి పరిశీలన చేయించింది. రెండు, మూడు రోజుల పరిశీలన తర్వాత ఆయా నేతలంతా శనివారం హైదరాబాద్‌కు చేరుకుని కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా తెలంగాణకు సంబంధించిన తీర్మానాలను ఖరారు చేసే అవకాశమున్నట్టు తెలిసింది.
ఎజెండాపై ప్రధాన కార్యదర్శుల చర్చ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. భారీ ర్యాలీగా నోవాటెల్‌కు వచ్చిన ఆయన.. తెలంగాణ చరిత్ర, నిజాం వ్యతిరేక పోరాటం, విమోచన, తెలంగాణ సంస్కృతీ సం›ప్రదాయాలు, కళల ఘనతను చాటేలా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. తర్వాత హెచ్‌ఐసీసీ సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భరత మాత చిత్రపటానికి పూలు వేసి నమస్కరించారు. అనంతరం జేపీ నడ్డా అధ్యక్షతన జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. కార్యవర్గ సమావేశాల్లో నిర్వహించాల్సిన చర్చలు, చేయాల్సిన తీర్మానాల ఎజెండాపై చర్చించారు. ఇందులో తరుణ్ చుగ్, దగ్గుబాటి పురందేశ్వరి, బీఎల్ సంతోష్, శివప్రకాశ్‌జీ, మరికొందరు నేతలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల బీజేపీ శాఖల నుంచి వచ్చిన నివేదికలు, సంస్థాగత సంబంధిత అంశాలను ఇందులో చర్చించినట్టు తెలిసింది.
ఎజెండాను ఖరారు చేయనున్న పదాధికారులు
శనివారం ఉదయం 9 గంటలకు పార్టీ జాతీయ పదాధికారులు సమావేశం కానున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు సమర్పించిన ఎజెండా ముసాయిదాపై చర్చిస్తారు. ఏవైనా మార్పులు, చేర్పులు అవసరమైతే సిద్ధం చేసి.. కార్యవర్గ భేటీలో ఆయా అంశాలపై చర్చించేందుకు సిద్ధం చేస్తారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆయన వచ్చాక మధ్యాహ్నం 3 గంటల సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రారంభించి ప్రసంగిస్తారు. రాత్రి 9 గంటల వరకు సమావేశాలు కొనసాగుతాయి. తిరిగి ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలై.. సాయంత్రం నాలుగు గంటల దాకా జరుగుతాయి. ఆదివారం సాయంత్రం ప్రధాని మోదీ ముగింపు ప్రసంగం చేస్తారు. అయితే సోమవారం కూడా పార్టీ సమావేశాలు కొనసాగుతాయి. అన్ని రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శులు భేటీ అయి.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చర్చిస్తారు. ఆయా రాష్ట్రాల వారీగా ప్రత్యేక సూచనలు చేస్తారు. సోమవారం సాయంత్రానికి బీజేపీ జాతీయ సమావేశాలు పూర్తిగా ముగుస్తాయి.
ఆరు ఆంశాలపై తీర్మానాలు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ప్రధానంగా ఆరు అంశాలపై తీర్మానాలు ఉంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు.. మోదీ ఎనిమిదేళ్ల పాలనను అభినందిస్తూ ధన్యవాద తీర్మానం.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు.. సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతం.. తెలంగాణలో పరిస్థితులు, కేసీఆర్ సర్కార్ తీరు.. వివిధ రాష్ట్రాల్లో పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణ.. తదితరాలపై తీర్మానాలు ఉంటాయని తెలిపాయి. ఇవేగాకుండా మరికొన్ని అంశాలపైనా చర్చ, తీర్మానాలు ఉండవచ్చని పేర్కొన్నాయి.
అంతా వేదిక కిందే..
జాతీయ భేటీలో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, సీఎంలు, ముఖ్య నేతలు అంతా సాధారణ కార్యకర్తలుగా వేదిక కిందే ఆసీనులు కానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ మాత్రమే వేదికపై ఉంటారు. ఆయా అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టేవారు, వాటిని బలపరిచేవారు పైకి వచ్చి మాట్లాడి వెళుతుంటారు.
– సమావేశాల్లో మొత్తం 354 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నారు. వీరిలో 118 పదాధికారులు ఉన్నారు. రాష్ట్రం నుంచి 14 మంది సమావేశాల్లో పాల్గొంటున్నారు.
– ఆదివారం సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ జరిగే ‘విజయ సంకల్ప సభ’లో మోదీ, నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, 18 రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు.
నేటి కార్యక్రమాలివీ..
►ఉదయం 9 గంటలకు బీజేపీ పదాధికారులు భేటీ అవుతారు. కార్యదర్శుల భేటీలో రూపొందించిన ఎజెండాపై చర్చించి ఖరారు చేస్తారు.
►ప్రధాని మోదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు.
►సాయంత్రం 3 గంటలకు జేపీ నడ్డా ప్రసంగంతో కార్యవర్గ భేటీ ప్రారంభం అవుతుంది.
►రాత్రి 9 గంటల వరకు సమావేశాలు కొనసాగుతాయి.
►తిరిగి ఆదివారం ఉదయం 10కి మొదలవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment