
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ, సీపీఐ, ,నిరుద్యోగ సంఘాల నేతలు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కారొపరేషన్‌కు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర అసెంబ్లీ సమావేశమైంది. అయితే, జీహెచ్‌ఎంసీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నప్పటికీ పోటీ చేయవచ్చనే చట్టసవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
రిజర్వేషన్లు చేయకుండా జీహెచ్ఎంసి ఎన్నికలకు వెళ్లకూడదని డిమాండ్ చేశారు. ఇక డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం సీపీఐ, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కూడా అసెంబ్లీ వద్ద నిరసనకు దిగారు. కాషాయ పార్టీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ వద్ద గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఉదయం నుంచే అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.