సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర శనివారం వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ముగిసింది. మూడు విడతలు కలిపి.. సుమారు 90 రోజులపాటు 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,121 కిలోమీటర్ల మేర సంజయ్ పాదయాత్ర చేశారు. అన్ని వర్గాల ప్రజలు కలుసుకుని మాట్లాడారు. ఆయా చోట్ల సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఇందులో మూడో విడతను ఆగస్టు 2న యాదగిరిగుట్టలో ప్రారంభించి 22 రోజుల్లో 316.4 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు.
ఈ విడత యాత్ర పలుచోట్ల ఉద్రిక్తతలు, వివాదాల మధ్య సాగింది. మునుగోడు లో రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, బీజేపీలో చేరిక, ఆ సభకు అమిత్‌షా హాజరవడం, సంజయ్ యాత్రకు పోలీసులు బ్రేక్ వేయడం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు వంటి పరిణామాలతో రాజకీయం వేడెక్కింది. పలుచోట్ల బీజేపీ, టీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య బాహాబాహీ సాగింది. మధ్యలో మూడు రోజులు యాత్రకు బ్రేక్ పడగా.. హైకోర్టు అనుమతితో సంజయ్ యాత్రను పూర్తి చేశారు. ముగింపు కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment