సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక లెక్కలు, విశ్లేషణల్లో కమలదళం తలమునకలైంది. ఈ నియోజకవర్గంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీల వారీగా ఓటింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ముఖ్యనేతలు బీజేపీకి పడిన ఓట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి రెండు, మూడు వేల మెజారిటీతో విజయఢంకా మోగిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ బీసీ వర్గాల ఓట్లతో పాటు హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్, వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఓట్లు కమలానికే పడ్డాయని అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నికలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం రాజగోపాల్‌రెడ్డి గెలుపునకు సూచికగా భావిస్తున్నారు.
గ్రామాలు, పోలింగ్ బూత్‌ల వారీగా ఆయా వర్గాల ఓటింగ్ తీరుపై పోలింగ్ బూత్‌స్థాయి నుంచి ఎన్నికల ప్రకియలో నిమగ్నమైన పార్టీ యంత్రాంగం నుంచి సమాచారాన్ని సరి చూసుకుంటున్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా రాళ్ల దాడితో పాటు భౌతికదాడులకు ప్రయత్నించడం వంటి పరిణామాలు టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేశాయంటున్నారు. అయితే టీఆర్‌ఎస్‌కు వామపక్ష అనుకూల ఓటింగ్‌తో పాటు మైనారిటీల ఓట్లు, ఎస్సీలో కొంతశాతం ఓట్లు పడ్డాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు.
మండలాలు, మున్సిపాలిటీల వారీగా..
చౌటుప్పల్, చండూర్ (గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కలిపి)లో బీజేపీ హవా బాగా కనిపించి, ఇక్కడి నుంచే అధిక శాతం ఓట్లు పడ్డాయని చెబుతున్నారు. మునుగోడు మండలంలోనూ బీజేపీకే మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నారాయణపూర్‌లో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు దాదాపు సమానంగా ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. మర్రిగూడ, నాంపల్లిలో బీజేపీ కంటే టీఆర్‌ఎస్ స్వల్పంగా ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మిగతా చోట్ల కూడా బీజేపీకే మొగ్గు ఉంటుందనే విశ్వాసంలో బీజేపీ నేతలున్నారు.
పొద్దున పోలింగ్ మొదలయ్యాక టీఆర్‌ఎస్‌కు మద్దతుదారులుగా ఉన్న ఆసరా, ఇతర రూపాల్లో పింఛన్లు పొందుతున్న వృద్ధులు, ఇతర వర్గాల వారు ఎక్కువగా ఓటింగ్ రావడంతో భిన్నమైన అంచనాలు వచ్చాయంటున్నారు. మధ్యాహ్నం తర్వాత యువత అధికంగా పోలింగ్ బూత్‌లకు రావడం, హైదరాబాద్ శివార్లలోని ఓటర్లు బూత్‌లకు చేరుకోవడంతో ఒక్కసారిగా ఓటింగ్ శాతం పెరుగుదలతో మొత్తం వ్యవహారంలో మార్పులు చోటుచేసుకుని బీజేపీ వైపు మొగ్గు స్పష్టమైందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment