BJP National Executive Meeting In Hyderabad - Sakshi
Sakshi News home page

‘పతాక’ స్థాయి ప్రచారం

Published Sun, Jul 3 2022 1:53 AM | Last Updated on Sun, Jul 3 2022 11:33 AM

BJP National Executive Meeting In Hyderabad - Sakshi

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అనే తేడా ఏదీ లేకుండా.. అన్ని ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లే ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించింది. దీని ద్వారా కేంద్ర సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్తృ తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. పార్టీని బూత్‌ స్థాయిలో పటిష్టం చేయాలని నిర్ణయానికి వచ్చింది. గుజరాత్, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సహా రాబోయే అన్ని ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించేలా ప్రణాళికను అమలు చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకూ ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించింది. 

ప్రజల మధ్యే ఉండేలా..:
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా.. శనివారం ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, ఇతర ముఖ్యనేతల ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యుల భేటీ నిర్వహించారు. నడ్డా ఈ రెండు సమావేశాల్లోనూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ.. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 

‘పన్నా ప్రముఖ్‌’లతో క్షేత్రస్థాయికి.. 
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరిని పార్టీ నేతలు కలవాలని.. జాబితాల్లోని ఒక్కో పేజీలో ఉన్న ఓటర్లను తరచూ కలిసేందుకు ఒకరికి (పన్నా ప్రముఖ్‌) బాధ్యత అప్పగించాలని కార్యవర్గ భేటీలో నిర్ణయించారు. బీజేపీ బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే దీనిని అమలు చేస్తుండగా.. దక్షిణాది రాష్ట్రాలకూ విస్తరించాలని నిర్ణయానికి వచ్చారు. పన్నా ప్రముఖ్‌లతో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి.. వారు పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించేలా చూడాలని తీర్మానించారు. పోలింగ్‌ బూత్‌ స్థాయిలో పార్టీ పటిష్టతపై రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జులు తరచూ సమీక్షించాలని నిర్ణయించారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌ పరిధిలో 200 మంది వరకు కార్యకర్తలతో వాట్సాప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. 


 
సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి 
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా విస్తరించాలని.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యవర్గ భేటీలో నిర్ణయించారు. కింది స్థాయిలో పేద వర్గాలకు ప్రయోజనం చేకూర్చే పథకాలు, కార్యక్రమాలను అమల్లోకి తేవాలని తీర్మానించారు. పేద వర్గాలకు ఆయా పథకాలు కచ్చితంగా చేరేలా చూడాలని, వీలైనంత మెరుగైన పద్ధతుల్లో విస్తరించాలని నిర్ణయానికి వచ్చారు. 
 
ఇంటింటికి త్రివర్ణ పతాకంతో.. 
దేశంలో ప్రతీ ఇంటికి త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లాలని.. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధరా రాజే విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆ దిశగా విస్తృత కార్యచరణ అమలు చేయనున్నామని వెల్లడించారు. కులం, భాష, ప్రాంతాలకు అతీతంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి, ప్రజల్లో దేశభక్తిని నింపడం ద్వారా పార్టీకి ప్రయోజనం కలుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. 
 
ఆర్థిక అంశాలు, పేదల సంక్షేమంపై తొలి తీర్మానం 
బీజేపీ పదాధికారులు, జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా రాజకీయ, ఆర్థిక, పేదల సంక్షేమం, అభివృద్ధి అంశాలపై తీర్మానాలు ప్రతిపాదించారు. ఇందులో ఆర్థిక అంశాలు, పేదల సంక్షేమంపై పెట్టిన తీర్మానాన్ని శనివారం రాత్రి ఆమోదించినట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. పార్టీ కార్యకలాపాలు, ఇతర అంశాలకు సంబంధించి సోషల్‌ మీడియాను మరింతగా ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకోవడంపై క్షేత్రస్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. 


 ఉదయ్‌పూర్‌ ఘటనపై చర్చ! 
రాజకీయ తీర్మానంలో భాగంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ఘటన చర్చకు వచ్చినట్టు సమాచారం. పార్టీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ఉదయ్‌పూర్‌ దర్జీని ఇద్దరు దుండుగులు తల నరికి హత్య చేయడం, తదనంతర పరిణామాలపై పదాధికారులు, జాతీయ కార్యవర్గంలో చర్చించినట్టు తెలిసింది. దీనితోపాటు మహారాష్ట్రలోని అమరావతి, ఔరంగాబాద్‌లలో మరో రెండు ఘటనలూ జరగడం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. దీనిపై విస్తృతంగా చర్చించి పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్నట్టు తెలిసింది. ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా.. చర్చ జరుగుతోందని, గుచ్చిగుచ్చి ప్రశ్నించ వద్దని వసుంధర రాజే, అధికార ప్రతినిధి సంజయ్‌ మయూక్‌ కోరారు. ఇక అగ్నిపథ్‌ పథకాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం ముక్త కంఠంతో ప్రస్తుతించింది. ఈ పథకం కింద వచ్చే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొంది. 
 
తెలంగాణపై ‘ప్రత్యేక’ తీర్మానం! 
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై కార్యవర్గ భేటీలో విస్తృత చర్చ జరిగినట్టు సమాచారం. దీనిపై ఆదివారం మరింత చర్చించాక తెలంగాణలో రాజకీయంగా చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపై జాతీయ కార్యవర్గం ఒక అధికారిక ప్రకటన చేస్తుందని జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజే సింధియా పేర్కొన్నారు. 
 
ప్రతీ నిర్ణయం పేదల కోసమే 
– కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 
తమ ప్రభుత్వానికి పేదలే ప్రధానమని, ప్రధాని మోదీ ప్రతి నిర్ణయాన్ని పేదలను దృష్టిలో పెట్టుకునే తీసుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తొలిరోజు విశేషాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, గరీబ్‌ కల్యాణ్‌ యోజనపై తొలిరోజు సమావేశాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీర్మాన్ని ప్రవేశపెట్టగా.. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్, హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ బలపర్చారని తెలిపారు.

గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద దేశంలోని 80 కోట్ల మంది జనాభాకు లబ్ధి చేకూరుతోందన్నారు. కరోనా సంకట కాలంలో ఈ పథకం పేదలకు ఎంతో మేలు చేసిందని, గత 25 నెలలుగా రూ.2.6 లక్షల కోట్లను పేదలకు అందించామని చెప్పారు. 2014 మేలో అధికారం చేపట్టినప్పుడు ప్రధాని మోదీ తొలిసారి చేసిన ప్రసంగంలో ఇచ్చిన హామీ మేరకు పేదలు, మహిళా, యువత, దళితులు, బడుగు, బలహీనవర్గాల కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, సౌభాగ్య, ప్రతి ఇంటికి నల్లా నీరు, జన్‌ధన్‌ బ్యాంకు ఖతాలు, ముద్ర యోజన వంటి పథకాలు మంచి ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు.

కోవిడ్‌ ప్రభావం ఉన్నా.. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని, అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలు ద్రవ్యోల్బణంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని వివరించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంస్కరణలతో గత 8 ఏళ్లలో విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు పెరిగాయని.. మన దేశం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచంలోనే మహా శక్తిగా దేశాన్ని తీర్చిదిద్దడం ఆత్మ నిర్భర్‌ భారత్‌ లక్ష్యమన్నారు. దేశంలో పోలియో వ్యాక్సినేషన్‌కు 30 ఏళ్ల సమయం పట్టగా.. కోవిడ్‌ సమయంలో కేవలం ఏడాదిన్నరలో దాదాపు మొత్తం జనాభాకు 191 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఇచ్చామని చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement