ఎక్కడైనా మనుషులు సగటున 60–70 ఏళ్లు బతుకుతారు. కొందరైతే వందేళ్లూ పూర్తి చేసుకుంటారు. కానీ భూమ్మీద కొన్ని ప్రాంతాల్లో మాత్రం జనం మిగతా అన్నిచోట్ల కన్నా ఎక్కువ కాలం జీవిస్తారు. అవే ‘బ్లూ జోన్స్’. మరి ప్రాంతాలేవి? ఎక్కువకాలం బతకడానికి కారణాలేమిటి, వారి ఆహార అలవాట్లు ఏమిటో తెలుసుకుందామా..
‘ఆయుర్దాయం’పై అన్వేషణలో..
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వయసున్నవారు, ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవిస్తున్నవారు ఉండే ప్రాంతాలను ‘బ్లూ జోన్’లుగా పిలుస్తున్నారు. అమెరికాకు చెందిన అన్వేషకుడు, రచయిత డాన్ బ్యూట్నర్ ఈ పేరు పెట్టారు. ప్రపంచంలో ఎక్కువ ఆయుర్దాయం ఉన్న జన సమూహాలు, వాటి మధ్య పోలికలను గుర్తించేందుకు నేషనల్ జియోగ్రఫిక్ చానల్, ఇతర నిపుణులు నిర్వహించిన అన్వేషణ కార్యక్రమానికి డాన్ బ్యూట్నర్ నేతృత్వం వహించారు. తమ అధ్యయనంలో పలు ‘బ్లూ జోన్’లను గుర్తించి ఆ వివరాలను నివేదికగా విడుదల చేశారు.
కనీసం.. పదేళ్లు ఎక్కువే..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లోమా లిండా ప్రాంతం బ్లూజోన్లలో ఒకటి. ఇక్కడ నివసించే ‘సెవంత్ డే అడ్వెంటిస్ట్స్’ఆధ్యాతి్మక బృందం సభ్యులు.. సగటు అమెరికన్ల కంటే కనీసం పదేళ్లు ఎక్కువకాలం జీవిస్తారు. పూర్తిగా శాకాహారులు. మద్యపానానికి దూరంగా ఉంటారు.
సింపుల్‌గా.. 90 ఏళ్లు..
కోస్టారికాలోని నికోయా ద్వీపకల్ప ప్రాంత ప్రజల్లో చాలా మంది 90 ఏళ్ల వరకు చలాకీగా బతికేస్తారు. ఆధ్యాతి్మకత, కుటుంబానికి ప్రాధాన్యతనిస్తూ.. శారీరక శ్రమతో కూడిన జీవన శైలిని అనుసరిస్తారు. చికెన్, చేపలు, బీఫ్, బీన్స్, అన్నం ప్రధాన ఆహారం. అయితే రిఫైన్డ్, ప్రాసెస్ చేసిన ఫుడ్‌కు పూర్తి దూరంగా ఉంటారు.
ఆయుష్షులో.. మహిళామణులు
జపాన్‌లోని ఒకినావా ద్వీపం ప్రపంచంలో అత్యధికకాలం జీవించే మహిళలకు (వందేళ్లదాకా) కేంద్రం. జపాన్, అమెరికాలతో పోల్చితే.. ఒకినావా వాసులకు వృద్ధాప్యంతో వచ్చే సమస్యలు, గుండె జబ్బులు, కేన్సర్లు బాగా తక్కువ అని అధ్యయనాల్లో తేలింది.
ఆయుష్షులో.. ‘మగా’నుభావులు..
ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు/ప్రాంతాలతో పోల్చితే.. ఇటలీలోని సార్డీనియా ద్వీపంలో పురుషులు అత్యధిక కాలం (వందేళ్ల దాకా) జీవిస్తారు. చాలా వరకు శాకాహారం, ప్రకృతిలో మమేకమై, శారీరక శ్రమతో కూడిన జీవనశైలిని అనుసరిస్తారు.
సామాజిక జీవనం.. చిన్న కునుకు..
ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించే జనానికి గ్రీస్‌లోని ఇకారియా ద్వీపం కేరాఫ్ అడ్రస్. ఇక్కడ 90ఏళ్లు పైబడిన ప్రతి పది మందిలో ఆరుగురు ఇప్పటికీ వ్యవసాయం, వృత్తి పనులు చేస్తుంటారని అధ్యయనంలో గుర్తించారు. వీరిలోనూ శాకాహారం, శారీరక శ్రమ మామూలే అయినా.. బంధుమిత్రులతో కలసి గడిపే/పనిచేసే సామాజిక జీవనశైలి, మధ్యాహ్నం పూట చిన్నకునుకు తీసే అలవాటు ప్రత్యేకం.
‘బ్లూజోన్’లలో దీర్ఘాయుష్షు వీటితోనే..
►బ్లూజోన్లుగా గుర్తించిన అన్ని ప్రాంతాల్లో కామన్‌గా కనిపించిన లక్షణం.. అంతా ఇంటి పనులు, ఇతర శారీరక శ్రమలో నిమగ్నమై ఉండటం.
►క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయడం.
►కుటుంబ బంధాలు, సామాజిక జీవనానికి, పెద్ద వయసు వారికి తోడుగా నిలవడానికి ప్రాధాన్యత.
►ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం, మత సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం.
చదవండి: ఎకనమిక్ కారిడార్‌కు లైన్‌క్లియర్
Comments
Please login to add a commentAdd a comment