సాక్షి, హైదరాబాద్: దేశ రాజ్యాంగ నిర్మాత, భావిభారత స్ఫూర్తిప్రదాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల ఎత్తయిన భారీ విగ్రహం ఆవిష్కరణకు దాదాపుగా సిద్ధమైంది. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ విగ్రహానికి కళాకారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు.
దేశ భవిష్యత్తు కోసం దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఎడం చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని కుడి చేతిని ముందుకు చాచి గొప్ప ఆత్మవిశ్వాసంతో చూస్తున్న బాబాసాహెబ్ విగ్రహం నెక్లెస్ రోడ్డులో ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం మరోవైపు కోట్లాది మంది తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల కోసం ప్రాణాలొడ్డిన అమరుల స్మారకం.. అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటుతో నెక్లెస్‌రోడ్డు మరింత చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
ఆరేళ్ల యజ్ఞం..
అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ 2016లో ప్రకటించారు. ఆ ఏడాది అంబేడ్కర్ జయంతి రోజున నెక్లెస్‌రోడ్డులోని ఎన్టీయార్ పార్కు పక్కన 11.4 ఎకరాల స్థలాన్ని కేటాయించి అదేరోజు భూమి పూజ కూడా చేశారు. నిజానికి ఏడాది వ్యవధిలోనే విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అనేక కారణాల వల్ల జాప్యం జరిగింది. ఆరేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు విగ్రహం రూపుదిద్దుకుంది. సుమారు రూ. 146 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.
155 టన్నుల స్టీల్ 111 టన్నుల కంచు
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్, పద్మభూషణ్ రాంవంజి సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్‌లు అంబేడ్కర్ భారీ కళాఖండానికి రూపకర్తలు. బాబాసాహెబ్ గంభీరమైన విగ్రహాన్ని మమ్మూర్తులా రూపొందించడంలో వారి అద్భుతమైన ప్రతిభ కనిపిస్తుంది. ఎలాంటి ప్రతికూల వాతావరణాన్ని అయినా తట్టుకొనేవిధంగా విగ్రహం నిర్మాణం చేపట్టారు. విగ్రహం కోసం 155 టన్నుల స్టీల్‌ను, 111 టన్నుల కంచును వినియోగించారు. విగ్రహం బయటి వైపు లేయర్ కోసమే సుమారు 9 టన్నుల కంచును వాడినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ విగ్రహం వెడల్పు 45 అడుగులు ఉంటుంది. కింద పార్లమెంటు ఆకృతిలో ఏర్పాటు చేసిన పీఠం 50 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. గ్రీనరీ ఏర్పాటు చేయవలసి ఉంది. అలాగే బేస్‌మెంట్‌లోని హాళ్లలో అంబేడ్కర్ జీవితంపై విస్తారమైన సమాచారంతో కూడిన గ్రంథాలయం, ఆయన జీవితవిశేషాలను, రాజ్యాంగ రచనాకాలం నాటి ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. ఆడియో, వీడియో ప్రదర్శనలు కూడా ఉంటాయి. ఈ పనులు ఇంకా పూర్తి చేయవలసి ఉంది. అలాగే విగ్రహం చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయాలి. అన్ని పనులు పూర్తయితే ఆహ్లాదభరితమైన వాతావరణంలో మహనీయుడి అద్భుతమైన విగ్రహాన్ని వీక్షించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment