నాగార్జున సాగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ! | BRS Leader Mannem Ranjit Yadav Join BJP Party | Sakshi
Sakshi News home page

నాగార్జున సాగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ!

Published Mon, Oct 16 2023 12:22 PM | Last Updated on Mon, Oct 16 2023 12:28 PM

BRS Leader Mannem Ranjit Yadav Join BJP Party - Sakshi

నాగార్జున సాగర్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో కీలక నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్‌ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న ఆయన.. కారు దిగేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 500 మందితో కలిసి కాషాయ కండువా కప్పుకొనేందుకు ఇప్పటికే ఏర్పాట్లు సైతం పూర్తయినట్లు సమాచారం.

నియోజకవర్గ, నాయకులతో కలిసి రెండు రోజులు క్రితం బీజేపీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. బీజేపీలోకి రావాలని పార్టీ నాయకులు ఆ యంగ్‌ లీడర్‌ను ఆహ్వానించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కీలక నేతల హామీ మేరకు బీజేపీలో చేరాలని యువ నాయకుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆయన బీజేపీలో అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది.

కొద్ది కాలంగా బీఆర్ఎస్‌లో తనకు లభించే ప్రాధాన్యత మూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. జనాల్లో ఆదరణ ఉన్న బీసీ నాయకుడు విదేశాల నుంచి స్వదేశానికి సేవ చేయాలనే ఆలోచనలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యాదవ్ సామాజికవర్గం నుంచి గట్టి పట్టు ఉన్న నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ బీజేపీలోకి వస్తే పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం అయింది. ఈ యువ నాయకుడితో పాటు పలువురు నాయకులు కూడా తనతో పాటు కమలం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇవ్వనున్నారనే చెప్పవచ్చు. దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి. 

మాజీ ఎమ్మెల్యే మనవడు
గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్‌ఎస్‌ యువనేత మన్నెం రంజిత్ యాదవ్‌కు ఈసారి నాగార్జునసాగర్‌ నియోజకవర్గం టికెట్‌ దక్కే అవకాశం ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్‌కు కలిసి వస్తుందని, ఆయనకు టికెట్‌ కేటాయిస్తే కారు పార్టీకే విజయం వరిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న మన్నెం రంజిత్ యాదవ్‌ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సాగర్ నియోజకవర్గ ప్రజలు తమకు అందుబాటులో ఉండే నేతను ఎమ్మెల్యే అభ్యర్థి నిలిపితే బాగుంటుందని పలువరు స్థానికులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కానీ.. నాగార్జునసాగర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌కు అధిష్టానం టికెట్‌ కేటాయించింది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement