మంగళవారం సిరిసిల్లలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మినీ ప్లీనరీల పేరిట రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో రెండు రోజుల ముందు జరిగిన ఈ సభలకు వేల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో నియోజకవర్గ కేంద్రాల్లో సందడి నెలకొంది. వీధులన్నీ గులాబీమయం అయ్యాయి.
ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నెల రోజులుగా నియోజకవర్గాల్లో పార్టీ కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న భారత్ రాష్ట్ర సమితి.. మంగళవారం ప్రతినిధుల సభలు నిర్వహించింది. ఒక్కో నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సభకు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు ప్రతినిధులు హాజరైనట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో జరిగిన సభలకు సుమారు నాలుగు లక్షల మంది పార్టీ క్రియాశీల నేతలు హాజరైనట్లు బీఆర్‌ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సందడే సందడి
ప్రతినిధుల సభలు పురస్కరించుకుని సుమారు 19 వేల జనావాసాల్లో పార్టీ పతాకాన్ని ఎగురవేసి బీఆర్‌ఎస్ శ్రేణులు జెండా పండుగ నిర్వహించాయి. చాలా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు డప్పు చప్పుళ్లతో ర్యాలీగా తరలివచ్చారు. ఆటపాటలతో సభలను హోరెత్తించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు, అమరులకు, అమరుల స్తూపాలకు నివాళి వంటి కార్యక్రమాలు జరిగాయి.
మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్వయంగా భోజనాలు వడ్డించి పార్టీ కేడర్‌తో మమేకం అయ్యేందుకు ప్రయత్నించారు. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు నృత్యాలతో సందడి చేశారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి, ఘనపూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఇల్లందులో ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ, కరీంనగర్‌లో మేయర్, కార్పొరేటర్లు ప్రతినిధుల సభా వేదికలపై చేసిన నృత్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
హాజరైన ముఖ్య నేతలు..అసంతృప్తులు దూరం
సిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పొల్గొనగా, సిద్దిపేటతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ సభలకు మంత్రి టి.హరీశ్‌రావు హాజరయ్యారు. మిర్యాలగూడలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బాన్సువాడలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో జరిగిన సభల సమాచారాన్ని పార్టీ వర్గాలు సేకరించాయి. తాండూరు, స్టేషన్ ఘనపూర్, రామగుండంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఆసంతృప్త నేతలు ప్రతినిధుల సభలకు దూరంగా ఉన్నారు. ఆహ్వానం అందలేదని కొందరు దూరంగా ఉండగా, ఆహ్వానం అందినా హాజరు కావడం ఇష్టం లేక మరికొందరు దూరంగా ఉన్నట్టు సమాచారం.
కేంద్రం, బీజేపీ తీరుపై ఘాటు విమర్శలు
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రతినిధుల సభల్లో తీర్మానాలు చేశారు. అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు, సచివాలయానికి ఆయన పేరు తదితర నిర్ణయాలను స్వాగతించారు. మరోవైపు తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్ష, బీజేపీ విధానాలు, వైఫల్యాలను ఎత్తి చూపుతూ తీర్మానాలు ఆమోదించారు.
గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని విపక్ష పార్టీల ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్న తీరు, ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా వేధించడం తదితరాలను ఖండిస్తూ తీర్మానాలు చేశారు. ప్రతినిధుల సభల్లో ఆరు అంశాలపై తీర్మానాలు చేయాలని కేటీఆర్ సూచించగా, స్థానిక పరిస్థితుల ఆధారంగా ఒక్కోచోట 10 నుంచి 15 వరకు తీర్మానాలు జరిగాయి. బీఆర్‌ఎస్ నేతలు తమ ప్రసంగాల్లో కేంద్రం, బీజేపీ తీరును తీవ్ర పదజాలంతో ఎండగడుతూ ఘాటు విమర్శలు చేశారు.
పార్టీ యంత్రాంగానికి కేటీఆర్ ధన్యవాదాలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతినిధుల సభలను అద్భుతంగా నిర్వహించిన పార్టీ యంత్రాంగానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ సభలను ఆత్మీయ వాతావరణంలో, క్రమశిక్షణతో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పార్టీ పరిశీలకులను ప్రత్యేకంగా అభినందించారు.
పార్టీ రాష్ట్ర ప్లీనరీ తరహాలో పకడ్బందీగా ఒకేరోజు 119 నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు లక్షల మంది కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం దేశ చరిత్రలోనే మైలు రాయి వంటిదని అన్నారు. ఈ సభల్లో చర్చించిన అంశాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment