సాక్షి, హైదరాబాద్ : దశాబ్దం క్రితం నగరంలోని అంబర్‌పేటలో ఓ కుటుంబంలో ఐదుగురిని పట్టపగలు చంపినా.. ప్రత్యక్ష సాక్షులు లేరన్న కారణంతో నిందితులకు శిక్ష పడలేదు. రెండేళ్ల కింద హాజీపూర్, గొర్రెకుంట ఘటనల్లో సైకోలకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ రెండు ఘటనల్లోనూ ప్రత్యక్ష సాక్షులు లేకున్నా.. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా న్యాయస్థానం నిందితులకు క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది.
ఈ రెండు ఘటనల్లోనూ దర్యాప్తు చేసింది తెలంగాణ పోలీసులే. కానీ, శిక్షలు పడటంలో ఎందుకంత మార్పు వచ్చింది? అంటే హాజీపూర్, గొర్రెకుంట కేసుల్లో కోర్టు డ్యూటీ ఆఫీసర్ (సీడీవో) లేదా కోర్టు లైజినింగ్ ఆఫీసర్ పోషించిన పాత్రే. నేరం జరిగిన వెంటనే పోలీసులు దర్యాప్తు చేసిన విధానం ఒక ఎత్తైతే, కోర్టు విచారణ మొదలైన తరువాత నిందితుల నేరం నిరూపించడం మరో ఎత్తు. కోర్టులో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. సాక్షులు ప్రభావితమైనా, తడబాటుకు గురైనా పోలీసుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే, ఈ లోపాన్ని సరిచేయడానికి డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఠాణాల్లో సిబ్బంది పనిని మొత్తం 17 వర్టికల్స్‌గా విభిజించారు. ఇందులో రిసెప్షన్, రైటర్, డయల్ 100, డిటెక్టివ్, క్రైంస్టాఫ్ తదితర విభాగాలు కీలకం. వీటన్నింటిలో సీడీవోల పని కీలకం. ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక ఏటా రాష్ట్రంలో కన్విక్షన్లు పెరిగి డిస్పోజల్స్ తగ్గుతున్నాయి.
సెక్షన్లపై శిక్షణ..
2018 నుంచి వీరిపై డీజీపీ ప్రత్యేక శ్రద్ధ వహించడం ఫలితంగా గతంలో మునుపెన్నడూ చూడని రీతిలో నేరాల్లో న్యాయస్థానాల్లో శిక్షలు పడుతున్నాయి. సీడీవోలుగా రాష్ట్రంలోని అన్ని ఠాణాల నుంచి కానిస్టేబుల్, ఏఎస్సై ర్యాంకు ఆఫీసర్లకు హైదరాబాద్ జేఎన్‌టీయూలో ప్రత్యేకంగా పలు ఐపీసీ సెక్షన్లు, లీగల్ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చారు. సాక్షుల వాంగ్మూలం రికార్డు, వారికి రక్షణ, వాయిదాలకు హాజరయ్యేలా చూడటం, సాంకేతిక ఆధారాల నివేదిక, చార్జిషీటు సరైన సమయంలో ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్) ద్వారా కోర్టుకు సమర్పించడం, సీసీ నంబర్ తీసుకోవడం కోర్టు వాయిదాలపై క్యాలెండర్ రూపొందించడం తదితర విధులు అతనే నిర్వర్తించాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో కలసి దర్యాప్తు అధికారులు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)కు న్యాయస్థానం విషయాలు వివరించాలి. వీరు ప్రతీ శనివారం ఠాణాలో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి ఎస్‌హెచ్‌వో, దర్యాప్తు అధికారులు హాజరవుతారు. వారంలో కోర్టులో నడిచిన ట్రయల్స్ లోటుపాట్లు, అదనంగా చేయాల్సిన పనులపై చర్చిస్తారు. ఈ నివేదికను డీజీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు అందజేస్తారు.
‘ఉత్తము’లకు అభినందనలు..
అన్ని వర్టికల్స్‌తోపాటు సీడీవోల పనితీరుపై సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నిరంతరం డేటా నిర్వహిస్తోంది. ఇక్కడ అధికారులు రాష్ట్రంలోని అన్ని యూనిట్ల నుంచి నిరంతరం వచ్చే నివేదికలు చూసి పొరపాట్లు ఉంటే సరిచేస్తారు. కన్విక్షన్, డిస్పోసల్స్ వివరాలు డేటాబేస్‌లో నమోదు చేస్తారు. సీడీవోల అత్యుత్తమ ప్రతిభను, లోటుపాట్లను పేర్లు లేకుండా అందరికీ అందజేస్తారు. వీరి గణాంకాల ఆధారంగా నెలనెలా డీజీపీ కన్విక్షన్లలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అభినందనలు పంపుతారు. దీంతో అందరిలోనూ జవాబుదారితనం పెరిగి కేసుల్లో న్యాయస్థానం త్వరగా తీర్పులు వస్తున్నాయని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్‌చార్జి డీఎస్పీ సత్యనారాయణ వివరించారు.
ఆ ఇద్దరు సైకోలకు ఉరిశిక్షల వెనుక..
Published Sat, Jan 23 2021 3:52 PM | Last Updated on Sat, Jan 23 2021 7:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment