సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం మరోసారి పలు వివరాలు కోరింది. గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల సందర్భంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు పక్కన ఉన్న వరద రక్షణ గోడలు పంప్‌హౌస్‌లు, తదితరాలను రక్షించడంలో ఎందుకు విఫలమయ్యాయి? రక్షణ గోడలు నిబంధనల అనుగుణంగా ఎత్తును కలిగి ఉన్నాయా? బ్యారేజీలకు సంబంధించిన గట్టులు (సేఫ్టీ ఎంబ్యాక్‌మెంట్) పరిసర గ్రామాలకు రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమయ్యాయి?.. తదితర వివరాలను సమర్పించాలని పేర్కొంటూ కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీకి లేఖ రాసింది.
గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టుకు సమానంగా వరద ముప్పును కలిగి ఉన్న ఇతర ప్రాజెక్టులున్నాయా? ఆ ప్రాజెక్టులు ఎందుకు వరదను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాయి? కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు ఎందుకు విఫలమయ్యాయి? అనే సమాచారాన్ని సైతం అందించాలని కోరింది. ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అన్నారం బ్యారేజీకి బుంగలు పడి నీళ్లు లీకైన విషయం తెలిసిందే. ఈ ఘటనల నేపథ్యంలోనే జలశక్తి శాఖ ఈ సమాచారం కోరినట్టు తెలుస్తోంది.
అవగాహన ఉన్న అధికారిని పంపండి
పంప్‌హౌసుల్లోని పంపింగ్ యూనిట్ల డిజైన్లు, ప్లేస్‌మెంట్ల (లొకేషన్)లో లోపాలు వంటి సమాచారాన్ని కూడా జలశక్తి శాఖ కోరింది. వరదల సమ యంలో పంప్‌హౌసుల్లో చేరిన నీళ్లను బయటకి తోడడంలో డీవాటరింగ్ పంప్‌లు ఎందుకు విఫలమయ్యాయి? వీటికి సంబంధించిన ఇన్‌లెట్ గేట్లు/వాల్‌్వలు ఎందుకు మొరాయించాయి ? అనే వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
సవరించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను ఇవ్వాలని సూచించింది. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర స మాచారాన్ని అందజేసేందుకు వీలుగా ఈ విషయంలో పూర్తి అవగాహన కలిగిన ఓ అధికారిని జలశక్తి శాఖకు డిప్యుటేషన్‌పై పంపాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment