ముందుంది ముప్పు.. కావాలి కనువిప్పు..! | - | Sakshi
Sakshi News home page

ముందుంది ముప్పు.. కావాలి కనువిప్పు..!

Published Fri, Jun 16 2023 6:18 AM | Last Updated on Fri, Jun 16 2023 12:13 PM

- - Sakshi

ఆక్రమణలతోనే రాజీవ్‌ రహదారిపై వరద
జిల్లాలోని తుర్కలమద్దికుంట, చందపల్లి గ్రామాల కుంటలు, ఎల్లమ్మచెరువు, భోజన్న చెరువు, లింగరాయకుండ, దొబ్బరివాగు, పట్టణంలోని మురుగు వరద అంతా రంగంపల్లి ఒర్రె ద్వారా ప్రవహించి చీకురాయి చెరువు మీదుగా హుస్సేన్‌మియా వాగులో కలుస్తుంది. అయితే జిల్లాకేంద్రం కావటంతో ఆక్రమణలు చోటుచేసుకోవటంతో ఒర్రె ప్రవాహించే ప్రాంతం కుచించుకుపోయి, వరద పోటెత్తి రాజీవ్‌రహదారిపైకి చేరింది. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. తాత్కాలిక చర్యలతోనే సరిపెట్టడంతో వర్షాకాలంలో మరోసారి వరద రోడ్డెక్కెందుకు అవకాశం ఉందని పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ జిల్లావాసులకు.. ముఖ్యంగా గోదావరిఖని, మంథని పట్టణ వాసులకు కొత్తసమస్య తెచ్చిపెట్టింది. గతేడాది భారీగా కురిసిన వర్షాలతో వరదలు వచ్చి రామగుండం, మంథనిలో పలు కాలనీలు పూర్తిగా నీటమునిగిపోయి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అదే సమస్య మళ్లీ పునరావృతం అయ్యే అవకాశాలున్నాయి. ఏటా వరద ముంచెత్తుతున్నా.. పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గుణపాఠం నేర్చి.. ముంపు నుంచి రక్షించే చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంతో రామగుండం ప్రాంతానికి ముప్పు ఉందని ల్యాడర్‌ సర్వేలో తేలటంతో గోదావరి ఒడ్డున సుమారు 8 కిలోమీటర్ల మేర సుందిళ్ల గ్రామం వరకు కరకట్ట నిర్మించి వదిలేశారు. రామగుండం వరకు మరో 5కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించేందుకు రూ.110 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. నిధుల మంజూరు కోసం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కలిసినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో అ వి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.

గతేడాది వరదలలో మల్కాపూర్‌, సప్తగిరికాలనీ, ప్రశాంత్‌నగర్‌, రెడ్డికాలనీ, రఘుపతిరావ్‌నగర్‌ ముంపునకు గురయ్యాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఎలంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఈ ఏడాది కూడా భారీ వర్షాలు కురిస్తే భారీ నష్టం తప్పదని స్థానికులు అంటున్నారు.భారీ వర్షాలతో వచ్చిన వరద బొక్కలవాగు ద్వారా గోదావరిలో చేరాల్సి ఉంది. అయితే అప్పటికే గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో బొక్కలవాగు నీరు వెనక్కివెళ్లి నాలాల ద్వారా పట్టణాన్ని ముంచెత్తింది.

దీంతో బొక్కలవాగు, మర్రివాడ, వాగు గడ్డ, బోయినిపేట, లైన్‌గడ్డ, దొంతులవాడ, భగత్‌నగర్‌, చాకలివాడ, మంగలివాడ, దుబ్బగూడెం, ఎస్సీకాలనీ, అంబేద్కర్‌నగర్‌ తదితర పట్టణప్రాంతాలు నీటమునిగాయి. అకస్మాత్తుగా వచ్చిన వరద వల్లే పట్టణం మునిగిందని, పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందని, ఏటా భారీ వరదలు వచ్చే అవకాశం ఉండదని యంత్రాంగం భావిస్తోంది. కానీ.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరకట్ట లేక నీటమునిగి ప్రవాహం తాళలేక వెనక్కి
గతేడాది భారీగా కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. దీంతో జిల్లాలోని పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. శ్రీరాంసాగర్‌, కడెం ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటితోపాటు ఎల్లంపల్లి క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురిసిన భారీ వర్షాలకు ఎల్లంపల్లికి వరద రికార్డుస్థాయిలో వచ్చింది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదలడంతో సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. ఆ బ్యాక్‌వాటర్‌తో గోదావరి పరీవాహక ప్రాంతంలోని గోదావరిఖని, మంథని పట్టణం పూర్తిగా నీటమునిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement