అలా కాదు.. ఇలా ఉంటాడు.. ‘దసరా విధ్వంసం–ఉగ్ర త్రయం’లో ఇతడే కీలకం  | Changes In Terrorist Farhatullah Ghauri Photo based On Jahed Custody | Sakshi
Sakshi News home page

అలా కాదు.. ఇలా ఉంటాడు.. ‘దసరా విధ్వంసం–ఉగ్ర త్రయం’లో ఇతడే కీలకం 

Published Mon, Nov 14 2022 5:44 PM | Last Updated on Mon, Nov 14 2022 5:53 PM

Changes In Terrorist Farhatullah Ghauri Photo based On Jahed Custody - Sakshi

ఫర్హాతుల్లా ఘోరీ ఊహాచిత్రాలు, జాహెద్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన మహ్మద్‌ ఫర్హాతుల్లా ఘోరీ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌. దసరా ఉత్సవాల నేపథ్యంలో హ్యాండ్‌ గ్రెనేడ్లతో భారీ విధ్వంసాలకు కుట్రపన్ని చిక్కిన ఉగ్ర త్రయాన్ని పాకిస్థాన్‌ నుంచి హ్యాండిల్‌ చేసిన ముగ్గురిలో ఇతడూ ఒకడు. ఇతడిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ అయి ఉన్నా... ఇప్పటి వరకు పోలీసులతో సహా ఏ ఏజెన్సీ వద్ద స్పష్టమైన ఫొటో లేదు. కొన్నేళ్ల క్రితం రూపొందించిన ఉహాచిత్రంతోనే (స్కెచ్‌) నెట్టుకు వస్తున్నారు. ఉగ్ర త్రయంలో కీలక వ్యక్తి మహ్మద్‌ జాహెద్‌ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా అధికారులు తమ వద్ద ఉన్న స్కెచ్‌లో అనేక మార్పులు చేస్తున్నారు.  

24 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి... 
మాదన్నపేట సమీపంలోని కూర్మగూడకు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ అలియాస్‌ అబు సూఫియాన్‌ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇది జరిగిన నాలుగేళ్ల తర్వాత కానీ ఇతని పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. 2002లో గుజరాత్‌లోని అక్షర్‌ధామ్‌ దేవాలయంపై జరిగిన దాడి కేసుతో ఇతని వ్యవహారాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. 2004లో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర జరిగింది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్‌ (జేఈఎం)కు సానుభూతిపరుడిగా ఉన్న ఇతను ఈ కేసులో నిందితుడిగా మారాడు. ఆపై 2005లో టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి తాజాగా దసరా ఉత్సవాల్లో విధ్వంసానికి కుట్ర సహా అనేక కేసుల్లో ఇతడి పేరుంది.  

కొన్నాళ్లు దుబాయ్, ఇప్పుడు రావల్పిండి... 
పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ సహకారంతో ఫర్హాతుల్లా ఘోరీ సుదీర్ఘ కాలం దుబాయ్‌లో తలదాచుకున్నాడు. అక్కడి నుంచే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరవెనుక సాయం చేయడంతో కీలక వ్యక్తిగా మారాడని నిఘా వర్గాలు గుర్తించాయి. యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాడని, దుబాయ్‌ మీదుగా పాక్‌ పంపాడని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉంటూ ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్‌ఈటీ)లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇండియన్‌ వుుజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు అమీర్‌ రజా ఖాన్‌కు సన్నిహితుడిగా ఉన్నాడు. ఈ తరహా నేరచరిత్రతో పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ స్పష్టమైన ఫొటో పోలీసులకు లభించలేదు. 

35 ఏళ్ల క్రితం నాటి ఫొటోనే... 
ఇతడిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని తన వెబ్‌సైట్‌లోనూ పొందుపరిచింది. అయితే ప్రతి నోటీసుతోనూ ఆ వాండెట్‌ వ్యక్తి ఫొటోను జత చేస్తుంటుంది. అయితే ఘోరీ నోటీసుతో పాటు దాదాపు 35 ఏళ్ల క్రితం నాటి, అస్పష్టమైన ఫొటోనే ఉంచింది. అతడి స్పష్టమైన ఫొటో ఏ ఏజెన్సీ వద్దా లేకపోవడమే అందుకు కారణం. 2008 ఏప్రిల్‌లో ఇతని మేనల్లుడు ఫయాఖ్‌ను దుబాయ్‌ నుంచి డిపోట్‌ చేయగా (బలవంతంగా తిప్పిపంపడం) నగర పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఫయాఖ్‌ చెప్పిన రూపురేఖల ఆధారంగా దాదాపు ఫర్హాతుల్లా ఘోరీకి సంబంధించి దాదాపు 20 స్కెచ్స్‌ (ఊహాచిత్రాలు) రూపొందించారు. అక్షర్‌ధామ్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ సోదరుడు షౌకతుల్లాను 2009 ఏడాది జూలైలో అరెస్టు చేసినప్పుడు వీటిని చూపగా ఓ స్కెచ్‌ను నిర్థారించడంతో ఇప్పటి వరకు అదే ఆధారంగా ఉంది.  

జాహెద్‌కు వీడియో కాల్స్‌ చేయడంతో... 
ఉగ్ర త్రయంలో ఒకడైన జాహెద్‌కు రావల్పిండి నుంచి టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా సంప్రదింపులు జరిపాడు. కొన్ని సందర్భాల్లో ఇతడితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. జాహెద్‌ విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతడి రూపురేఖలపై జాహెద్‌ను లోతుగా ప్రశ్నిస్తూ తమ వద్ద ఉన్న స్కెచ్‌ చూపించి మార్పు చేర్పులు చెప్పాలని కోరారు. ఘోరీ ప్రస్తుతం కాశ్మీరీ లుక్‌తో ఉన్నాడని జాహెద్‌ చెప్పాడు. గడ్డం, మీసంతో పాటు పొట్ట కూడా ఉందని, తనతో వీడియో కాల్‌ మాట్లాడుతున్నప్పుడు రెండుమూడుసార్లు సిగరెట్‌ కాలుస్తూ కనిపించాడని బయటపెట్టాడు. ఈ వివరాల ఆధారంగా పోలీసులు తమ వద్ద ఉన్న స్కెచ్‌లో పలుమార్పులు చేయాలని నిర్ణయించారు. ఊహా చిత్రాలు తయారు చేసే నిపుణుల సాయంతో ఆ పని చేస్తున్నాడు. 

ఘోరీ రూపురేఖలు చెప్పిన జాహెద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement