గచ్చిబౌలి (హైదరాబాద్): బాలల దినోత్సవం సందర్భంగా 6.118 కిలోమీటర్ల పొడవునా.. 30,107 జతల బూట్లను ప్రదర్శనకు పెట్టి రియల్‌పేజ్ ఇండియా సంస్థ గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈ బూట్లను 100 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని పేద విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఆదివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ బూట్లను ప్రదర్శనకు ఉంచారు. రియల్‌ఎస్టేట్ రంగానికి సాఫ్ట్‌వేర్ సేవలు అందించే రియల్‌పేజ్ సంస్థ.. సామాజిక బాధ్యతలో భాగంగా ఇటీవల ‘రియల్ సోల్స్ ఫ్రమ్ రియల్ సోల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులోభాగంగా పేద విద్యార్థులకు ఉచితంగా బూట్లను అందిస్తోంది.
అమెరికా రికార్డును అధిగమించి..
అత్యంత ఎక్కువ బూట్లను వరుసగా పేర్చిన రికార్డు ఇంతకుముందు అమెరికాలో నమోదైందని, అక్కడ 2011లో 24,962 జతల బూట్లతో ‘లాంగెస్ట్ లైన్ ఆఫ్ షూస్’గా రికార్డ్ ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ స్వప్నిల్ డంగరికర్ వెల్లడించారు. ఆదివారం గచ్చిబౌలిలో బూట్ల ప్రదర్శనను పరిశీలించి.. రియల్‌పేజ్ సంస్థ కొత్త రికార్డును సాధించిందని తెలిపారు. కాగా.. రియల్ పేజ్ సంస్థ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు పంపిణీ చేయడం అభినందనీయమని శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు.
మరింత సాయం అందిస్తాం
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరింత తోడ్పాటు అందిస్తామని రియల్ పేజ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ సందీప్‌శర్మ తెలిపారు. ప్రస్తుతం బూట్లు పంపిణీ చేస్తున్నామని.. బ్యాగులు, యూనిఫాం, బెంచీలు, కిచెన్ వంటివి కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment