సాక్షి, హైదరాబాద్: ‘మనుషులు, జంతువులు, పక్షులు, క్రిములు.. చూస్తే అన్నీ వేర్వేరు. కానీ కలిసి సాగితేనే సుఖ జీవనం. మంచి జీవితం కావాలంటే సహజీవనం అవసరం. అదే సమతాభావం.. రామానుజుల తత్వం. కానీ ఇప్పుడు సమాజంలో ఎన్నో వికార పోకడలు. నేనే గొప్ప, నేనే నిలవాలన్న స్వార్థ చింతనలు పెరిగిపోయాయి. ఈ తీరు మారాలి. మన ఇల్లు, ఊరు, సమాజం, దేశం, ప్రపంచం అంతా సంతోషంగా ఉండాలి. అందుకు రామానుజులు చూపిన సమతా మార్గంలో మనం సాగాలి. ఆ దిశగా మేం వేస్తున్న తొలి అడుగు ‘సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం’’.. ఇది త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి చెప్పిన మాట.శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో 216 అడుగుల రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్టిస్తూ రూపొందించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం వచ్చే నెల 5న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామి ‘సాక్షి’తో మాట్లాడారు.
సామాజికంగా సిద్ధాంతాలు ఎన్ని చెప్పినా.. విద్యా విధానం లో విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉంది. విద్యార్థిగా చిన్నప్పుడు పడ్డ బీజాలే వారి భవిష్యత్ ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మనం వాడుకలో నైతికతకు రాముడిని, జీవన విధానానికి భగవద్గీతను మార్గంగా చూపుతాం. కానీ పాఠ్యాంశాల్లోకి వచ్చేసరికి 2,500 ఏళ్లకు ముందు మనకు నాగరికతే లేదని, అప్పుడే శిలాయుగం మొదలైందని అంటున్నాం. ఇలాంటి చదువు చదివినప్పుడు రాముడు, భగవద్గీత, జీవన విధానం, నైతికతలకు ప్రాధాన్యం ఎక్కడుంది? ఈ రెండింటికీ పొంతనేది? దేశీయ సంస్కృతి, సంప్రదాయాలు, మన పూర్వీకుల వైజ్ఞానిక చైతన్యానికి విద్యావిధానంలో చోటు దక్కాలి.
ఇప్పటివరకు మన దేశంలో దేవతామూర్తుల భారీ విగ్రహాలున్నాయేగానీ.. ఆది శంకరాచార్యులు, రామానుజులు వంటి గురువుల భారీ మూర్తులు లేవు. ఈ క్రమంలో మహామూర్తిగా శ్రీరామానుజాచార్యుల విగ్రహం రాష్ట్రంలో రూపుదిద్దుకుంది. తాము దీనిని రికార్డు కోసం చేయడం లేదని, దీని వెనుక గొప్ప పరమార్థం దాగి ఉందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వివరించారు. ప్రకృతిలో మనుషులతోపాటు అన్ని జీవులూ సమానమేనన్న రామానుజుల స్ఫూర్తిని అందరం అనుసరించాలని.. ఆ దిశగానే ‘సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం’ను ఏర్పాటు చేస్తున్నామని ‘సాక్షి’కి వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
రామానుజుల ఆలోచనా విధానం 16 శతాబ్దం చివరివరకు కొనసాగింది. ఆంగ్లేయులు వచ్చాక ధ్వంసమైంది. వారు మనుషుల మధ్య అంతరాల మంటలు పెట్టి చలికాచుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఆంగ్లేయుల రీతి కొంత సజీవంగా ఉంది. గణతంత్ర భారతంలో రాజ్యాంగం ప్రసాదించిన సమతాస్ఫూర్తిని ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేకపోతున్నాం. ఎక్కువ మంది రాజకీయ నేతల్లోని నిగూఢమైన స్వార్ధ ప్రవృత్తే దీనికి కారణం. అందుకే.. ఆగస్టు 14 అర్ధరాత్రి స్వాతంత్రం వస్తే.. ఇంకా తెల్లవారలేదు, ఆ చీకట్లు పోలేదు అంటుంటారు.
కొత్త విద్యా విధానం రావాలి
ఏడెనిమిది శతాబ్ధాలకు పూర్వందాకా అంతరిక్షంలోకి మనిషి వెళ్లనేలేదు. అలాంటిది కొన్ని వేలఏళ్ల కిందటే కచ్చితమైన ఖగోళ రహస్యాలను వరాహమిహిరుడు గ్రంధస్థం చేశారు. ఇలాంటి మన పూర్వీకుల వైజ్ఞానిక అద్భుతాలకు విద్యా విధానంలో చోటుదక్కనప్పుడు.. మన సంప్రదాయ విలువలకు ప్రాధాన్యమే ఉండదు. వైద్యరంగంలో మన పూర్వీకులు అద్భుతాలు చేశారు. కానీ తర్వాతికాలంలో మన సంప్రదాయ వైద్యం, నాటి వైజ్ఞానిక అద్భుతాలను వ్యూహాత్మకంగా అణచివేశారు. ఇప్పటికైనా నాటి వివరాలు, రహస్యాలు, ఆధారాలు అన్నీ మన పాఠాల్లోకి రావాలి. ఇందుకు కొత్త జాతీయ విద్యా విధానం రావాలి. దీనిపై కొంత ప్రయత్నం జరుగుతోంది. ఆజాదీకా అమృతోత్సవాలను ఘనంగా చేసుకోగలుతున్నాం. రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు చేసుకోబోతున్నాం.. ఇవన్నీ కొంత శుభసూచకాలుగా మాకు కనిపిస్తున్నాయి.
యువతలో మార్పు రావాలి
ఆశిష్టః దృఢిష్టః బలిష్టః యువాస్యాత్ సాధు యువాధ్యాయకః అని వేదం స్పష్టంగా చెప్తోంది. యువత మంచి తిండి తినాలి, తిన్నది హరాయించుకోవాలి, దాన్ని శక్తిగా మార్చుకోవాలి, ఆ శక్తితో సమాజానికి సేవ అందించాలి. లేకపోతే యువత సమాజానికి దండుగగా మారుతుంది. దురదృష్టవశాత్తు ఇప్పుడదే జరుగుతోంది. యువత రకరకాల వ్యసనాలు, విలాసాలకు లోనవడాన్ని ప్రగతికి చిహ్నంగా భావిస్తోంది. చాలా మంది దారి తప్పి సమాజాన్ని కుంగదీస్తున్నారు. ఇది మారాలి. యువత సమాజానికి ఉపయోగపడే శక్తిగా తయారు కావాలి.
కండల లక్ష్యం బలహీనుడిని ఆదుకోవడం, ధన సంపాదన లక్ష్యం ధనహీనుడి ఉద్ధరణ, విద్యాధికుడి లక్ష్యం మార్కులు, ఉద్యోగం కాదు.. విద్యా రహితుడిని విద్యావంతుడిగా మార్చటం.. ఇది రామానుజుల స్పూర్తి. ఇలా ఉన్నప్పుడు సమాజంలో దమము (నియంత్రణ) ఉంటుంది. లేకుంటే తిరగబడి మదము అవుతుంది. మనం సమాజంలో ఓ భాగంగా సమాజ సమగ్ర వికాసానికి ఉపయోగపడాలన్న ఆలోచన అందరిలో ఉండాలనేది రామానుజుల సందేశం. దీన్నే ఆయన వేదాంత పరిభాషలో శరీర శరీరి భావ సంబంధంగా పేర్కొన్నారు. రామానుజుల ఆలోచన సంపత్తిలో ఇదే కీలకం.
ఆయన అడుగే ఓ విప్లవం
కొందరిపై అంటరానివారిగా ముద్ర వేసి, సమాజానికి దూరంగా పెట్టిన భయంకర పరిస్థితులున్న సమయంలో రామానుజులు ఈనేలపై నడయాడారు. అంటరాని వారిని చేరదీస్తే తల తీసేసే పరిస్థితులను ఎదుర్కొని.. వారిని జనజీవన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పంచ సంస్కారాలు చేశారు. మంత్రదీక్షలు ఇచ్చి, వైష్ణవులుగా మార్చారు.తిరుక్కులతార్‌గా వారికి గౌరవప్రదమైన కులానికి చెందినవారన్న పేరు పెట్టారు. ఇది గొప్ప సామాజిక మార్పు దిశలో రామానుజులు వేసిన విప్లవాత్మక అడుగు. పండితలోకాన్ని, పాలకులను, ప్రజలను ఒప్పించి ముందుకు సాగిన మహనీయుడు రామానుజులు. ఇప్పుడూ కులాల మధ్య భారీ అగాధం ఉంది. మళ్లీ రామానుజులు రావాల్సిందే..
సర్వప్రాణులూ దైవ స్వరూపమే..
ప్రకృతిలో మనిషే కాదు.. చెట్లు, జంతువులు, సూక్ష్మజీవులు ఎన్నో ఉన్నాయి. అవి లేకుండా మనిషి ఉండలేడు, కానీ మనిషి లేకుండా అవి ఉండగలవు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో మనిషి ఇంటికే పరిమితమైతే.. ప్రకృతి పరవశించిన విషయాన్ని కళ్లారా చూశాం. అందుకే మనం పదిలంగా ఉండాలంటే వాటిని కాపాడాల్సిందే. ఇందుకు ప్రత్యేకంగా చేసేదేమీ లేదు. వాటి మానాన వాటిని బతకనీయడమే. అందుకే రామానుజుల అనుసరణ ఏంటంటే.. ‘మాధవ సేవగా సర్వప్రాణి సేవ’.
మహనీయుల చరిత్రతో డిజిటల్ లైబ్రరీ
సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో అద్భుతమైన డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాం. సమతా భావం కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాడిన మహనీయుల చరిత్రను అందులో నిక్షిప్తం చేస్తున్నాం. అబ్రహం లింకన్, మండేలా, మలాలా.. ఇలాంటి 116 మందిని గుర్తించి వారి వివరాలను నిక్షిప్తం చేశాం. రామానుజుల ప్రబోధాలను జనంలోకి తీసుకెళ్లి మార్పునకు అవకాశం కల్పించడం, దేశ పురోగతికి బాటలు వేసేలా చేయాలన్నది నా కల. ఈ కేంద్రంతో కొంత నెరవేరినట్లవుతోంది. దీన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా దారితప్పిన మనిషి పరివర్తనకు బాట వేసే కేంద్రంగా పరిగణించాలి.
ఆధునిక పద్ధతిలో యువతకు..
సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సాధారణ గుడిగా, ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించి దర్శనం చేసుకుని వెళ్తే ఉపయోగం ఉండదు. రామానుజుల ఆలోచనలు, సమాజానికి అందించిన సేవలు, మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటో ప్రజలు గ్రహించగలగాలి. ఆ దిశగానే అగుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్‌డ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. రామానుజుల సందేశం వ్యవస్థలోకి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వైష్ణవంలో దివ్య దేశాలుగా పేర్కొనే 108 దేవాలయాల నమూనాలను స్ఫూర్తి కేంద్రంలో నిర్మించాం. వాటిని దేవాలయాలుగా భావించి కాదు, రామానుజులను ప్రభావితం చేసిన ప్రాంతాల నేపథ్యంగా ఏర్పాటు చేశాం. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంగా దీనికి నామకరణం చేశాం.
అంతా ప్రకృతి బిడ్డలమన్న భావన రావాలి
రోమ్‌రోమ్‌మే రామ్ హై అంటాడు భక్తుడు. ఇందుగలడు అందులేడన్న సందేహం లేదంటాడు ప్రహ్లాదుడు. పశుపక్ష్యాదులు, మనిషి అంతా ప్రకృతి సంతానమే. అలాంటప్పుడు ఈ భేదాలు, ఆధిపత్య ధోరణులు ఎందుకు? అందుకే అనేకముల్లో ఒకటిగా ఉండాలని రామానుజులు విశిష్టాద్వైతాన్ని ప్రబోధించారు. కులాలు, వర్గాలు, మతాలు, రంగులు, లింగభేదంతో విడిపోద్దని సూచించారు. దానికి తన అనుభవాన్నీ జోడించారు. ‘పదడుగుల ఎత్తు పునాదితో ఇల్లు కట్టి నన్ను ఆహ్వానించారు. అంతెత్తు పునాది ఎందుకని అడిగాను. పక్కనే ఉన్న నది పొంగి చుట్టూ ఇళ్లు కొట్టుకుపోయినా.. నా ఇల్లు నిలిచి ఉండాలన్న ఉద్దేశంతో ఇలా కట్టానని అతను చెప్పాడు. ఊరంతా కొట్టుకుపోతే ఒక్కడివీ మిగిలి ఏం చేద్దామని? అందరితో కలిసి సాగు, చేతనైతే అందరినీ నిలిపి నువ్వూ నిలువ’ని చెప్పారు.
పర సహనం కోల్పోవడం అశాంతికి మూలం
ఒకే భాష మాట్లాడేవారు, ఒకే దేవుడిని పూజించేవారు కూడా వైషమ్యాలతో మారణహోమం సృష్టించుకుంటున్నారు. పరసహనం కోల్పోతున్నారు. ఆధిపత్య ధోరణి విశృంఖలమవుతోంది. నేను అగ్రాసనంలో ఉండాలన్న స్వార్ధంతో ఇతరులను అణచివేయటం పరిపాటిగా మారింది. వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య, సమాజాల మధ్య, దేశాల మధ్య ఇదే తీరు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అణ్వాయుధాలు వచ్చాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నకోవిడ్ కూడా ఇదే కోవలో వెలువడ్డ జీవాయుధం. ఇలాంటి ధోరణి మారాలన్నదే వెయ్యేళ్ల కింద రామానుజులు చేసిన ప్రయత్నం.
Comments
Please login to add a commentAdd a comment