ఓ వైపు సాంస్కృతిక సౌరభాలు వెదజల్లే సంప్రదాయ నాట్యాలు.. మరోవైపు అత్యాధునికతకు పట్టం కట్టే అంతర్జాతీయ మ్యూజిక్ ఫెస్టివల్స్.. అంబరాన్ని తాకే అద్భుతమైన పెళ్లి వేడుకలు.. రంగుల హంగుల హోలీ వేదికలు.. నగరం అంటే ఇప్పుడో ఈవెంట్ల సాగరం.
ఓ వైపు ఈవెంట్స్‌కు పెద్దన్న లాంటి కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.. మరోవైపు ఇటీవలే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో నూతన కాంతులీనాలని నగర ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగం ఆకాంక్షిస్తోంది. అందుకు గాను ప్రభుత్వ సహాయ సహకారాలను కోరుతోంది. – సాక్షి, సిటీబ్యూరో
ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈవెంట్స్ రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించాలని చాలాకాలంగా కోరుతున్నారు. ఈ రంగంలో ఈవెంట్ మేనేజర్‌లు, సౌండ్ లైట్ వీడియో ప్రొవైడర్లు, డెకరేటర్‌లు, డిజైనర్లు తదితర విభిన్న క్రాఫ్ట్‌లను కలిగి ఉన్న నగర ఈవెంట్ రంగం దేశంలోనే నంబర్ 1గా దూసుకుపోతోంది. పెద్ద సంఖ్యలో కళాకారులు, క్యాటరర్లు, ఈవెంట్ వేదికల యజమానులు, కన్వెన్షన్ కేంద్రాలతో కళకళలాడుతోంది.
ఈ నేపథ్యంలోనే తమ ఈవెంట్ రంగానికి ప్రభుత్వం నుంచి పరిశ్రమ గుర్తింపు కావాలని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ప్రతినిధులు కోరుతున్నారు. టీసీఈఐలో 400 మంది సభ్యులు, 15,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్రంలో అధికారికంగా ఈవెంట్ మార్కెట్ పరిమాణం రూ.800 కోట్ల అసంఘటిత రంగంలో కొన్ని వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ రంగం ఏటా 16% చొప్పున వృద్ధి నమోదు చేస్తోంది.
కోర్సులకు శ్రీకారం..
విస్తృత అవసరాలను కలిగి ఉన్న ఈవెంట్ రంగం వైపు నిపుణులను ఆకర్షించడానికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ కోర్సులను ప్రారంభించేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌తో టీసీఈఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కోర్సుల పట్ల యువతలో ఆసక్తి పెంచడానికి వీటిని ఉపాధి ఆధారితంగా మార్చడానికి, టీసీఈఐ ప్రభుత్వ సహకారం కోరుతోంది.
సింగిల్ విండోతో సమస్యలకు చెక్...
ఈవెంట్ నిర్వహణ కత్తిమీద సాము. ముఖ్యంగా ఇందులో సమయం కీలకపాత్ర పోషిస్తుంది. కాలం వృథా వల్ల కలిగే నష్టం ఒక్కోసారి అంచనాలకు అందదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈవెంట్ల నిర్వహణకు కావాల్సిన అనుమతుల కోసం అనేక ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరిగే అవసరం తప్పించాల్సిందిగా టీసీఈఐ చాన్నాళ్లుగా కోరుతోంది. అన్ని రకాల అనుమతులూ ఒకే చోట క్లియర్ అయ్యేలాగా విండో క్లియరెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తోంది.
గత ప్రభుత్వం అందించిన సహకారంతో ఈవెంట్స్ రంగం కొత్త పుంతలు తొక్కిందనీ నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వం అంతకు మించిన ప్రోత్సాహం అందిస్తుందని, ప్రపంచంలోనే హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చే కృషిలో చేయూత అందిస్తుందని టీసీఈఐ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈవెంట్ సిటీ ఏర్పాటు కావాలి..
నగరంలోని ఈవెంట్స్, మేనేజర్ల టాలెంట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరాయి. దీనికి అనుగుణంగా మరిన్ని మార్పులు చేర్పులు అవసరం. ప్రపంచ స్థాయి ఈవెంట్‌లు – కాన్ఫరెన్స్‌ల నిర్వహణను సులభతరం చేయడానికి, భారీ కన్వెన్షన్ సెంటర్‌లు, స్పోర్ట్స్ స్టేడియాలు, అడ్వెంచర్ స్పోర్ట్స్ అరేనాలు, అవుట్‌డోర్ ఈవెంట్ అరేనాలు, మోటర్ స్పోర్ట్స్ రేసింగ్ ట్రాక్‌లు, హోటళ్లు, వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తుల హౌసింగ్ వంటివన్నీ ఒకే చోట నెలకొల్పే విధంగా ఒక ఈవెంట్ సిటీని ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది.
దీనిని నగరానికి 80–100 కి.మీ లోపల ఈవెంట్ సిటీని సృష్టించేందుకు వీలుంది. ఇలాంటి ప్రతిపాదనలతో కొత్త ప్రభుత్వ సారధులను త్వరలోనే కలవనున్నాం. – రవి కుమార్, జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ
Comments
Please login to add a commentAdd a comment