కోవిడ్‌–19 మొదటి అంకం ముగిసింది | Clinical Trials Complete First Fase in NIMS Hospital | Sakshi

మొదటి అంకం ముగిసింది

Aug 11 2020 8:37 AM | Updated on Aug 11 2020 8:37 AM

Clinical Trials Complete First Fase in NIMS Hospital - Sakshi

లక్డీకాపూల్‌ : నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)లో  కొనసాగుతున్న కొవాక్జిన్‌ క్లినికల్‌ ట్రయిల్స్‌లో మొదటి అంకం విజయవంతంగా ముగిసింది. ఈ ప్రక్రియలో 50 మంది వలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ టీకాలను ప్రయోగించారు. ప్రస్తుతం నిమ్స్‌ వైద్యులు పరిశీలనలో నిమగ్నమయ్యారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) ఆదేశాల మేరకు దాదాపుగా 60 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 50 మందికి సంబంధించి రక్త నమూనాలను సేకరించి సమగ్రంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీలోని ఐసీఎంఆర్‌ అనుమతించిన ల్యాబ్‌ సైతం పరీక్షలు నిర్వహించి ఆయా వలంటీర్ల  ఫిట్‌నెస్‌ను నిర్ధారించింది. ఈ మేరకు   కోవిడ్‌–19ను నియంత్రించే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజమైన భారత్‌ బయోటెక్‌ ఇండియా లిమిటెడ్‌(బీబీఐఎల్‌) సంస్థ తయారు చేస్తున్న కోవాక్జిన్‌ ఫేజ్‌–1 హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయిల్స్‌కు శ్రీకారం చుట్టారు.

తొలుత ఇద్దరు ఆరోగ్యకమైన వలంటీర్లకు మొదటి మోతాదు టీకా ప్రయోగం చేశారు. అప్పటి నుంచి ఈ  ప్రక్రియను కొనసాగిస్తూ ఈ నెల మొదటి వారంలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత 14 రోజులకు అదే కోడ్‌కు సంబంధించిన బూస్టర్‌ డోస్‌ను కూడా ఇచ్చారు. ఈ ప్రక్రియను కూడా ఇటీవలే పూర్తి చేసినట్టు నిమ్స్‌ వైద్యులు పేర్కొంటున్నారు. నిమ్స్‌ సంచాలకులు డాక్టర్‌ కె. మనోహర్‌ పర్యవేక్షణలో క్లినికల్‌ ఫార్మకాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు, సీనియర్‌ వైద్యులతో పాటు జనరల్‌ మెడిసిన్, ఆనస్తీషియా, రెస్పిరేటరీ మెడిసిన వైద్యులు సమన్వయంతో ఈ ట్రయిల్స్‌ నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం ఆయా వలంటీర్లంతా తమ తమ ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. ఇందులో భాగంగా 28 రోజుల తర్వాత రెండవ మోతాదు టీకా ప్రయోగానికి  నిమ్స్‌ క్లినికల్‌ ట్రయిల్‌ నోడల్‌ అధికారి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సి. ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎవాల్యూషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ వ్యాక్సిన్‌ వల్లలో శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. వలంటీర్ల ఆరోగ్యాన్ని  పరిక్షించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే రెండవ మోతాదు టీకా ప్రయోగానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement