CM KCR To Lead New National Party Bharat Rashtra Samiti This Month - Sakshi
Sakshi News home page

ఇక ముహూర్తమే!: కొత్త జాతీయ పార్టీకి కేసీఆర్‌ బాస్‌.. చక్రం తిప్పనున్న పీకే.. 

Published Tue, Jun 14 2022 12:46 AM | Last Updated on Tue, Jun 14 2022 10:56 AM

CM KCR To Lead New national party Bharat Rastra Samiti - Sakshi

ప్రత్యామ్నాయ ఎజెండా.. ‘తెలంగాణ మోడల్‌’ జెండా! 
► టీఆర్‌ఎస్‌ జెండాను పోలిన రీతిలో కొత్త పార్టీ పతాకం.. ఎన్నికల గుర్తుగా కారును కొనసాగించేలా ఎన్నికల సంఘాన్ని కోరాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కొత్త పార్టీ ఎజెండా కూడా ఖరారైనట్టు సమాచారం. 
► తెలంగాణ ఉద్యమం ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో కొనసాగగా.. ఇంచుమించు ఇవే అంశాలను జాతీయ ఎజెండాలోనూ ఎత్తుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. విద్యుత్‌ సమస్య, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత, వివిధ రంగాల్లో టీఆర్‌ఎస్‌ సర్కారు ప్రగతిని రోల్‌ మోడల్‌గా చూపనున్నట్టు సమాచారం. 
► పార్టీ ఎజెండాను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా.. వివిధ రంగాలకు చెందిన వారిని కూడగట్టే పనిని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు అప్పగించినట్టు తెలిసింది. 
► దేశంలోని పలువురు వ్యవసాయ, ఆర్థిక, నీటి పారుదల, విద్యుత్, పాలనా రంగాల నిపుణులతో కేసీఆర్‌ ఇప్పటికే మంతనాలు జరిపారు. మొత్తంగా దేశం ముందు పెట్టాల్సిన ప్రత్యామ్నా య, ఆర్థిక ఎజెండాను రూపొందించే బాధ్యతను హైదరాబాద్‌లోని ఓ సామాజిక, ఆర్థిక అధ్యయన బృందానికి అప్పగించినట్టు తెలిసింది. 
► ఇక పార్టీ ఎజెండాపై విస్తృత ప్రచారం కల్పించేందుకు దేశవ్యాప్తంగా పలు వర్సిటీల్లో సదస్సులు నిర్వహించేలా ఇప్పటికే కొన్ని విద్యార్థి బృందా లను సిద్ధం చేసినట్టు సమాచారం. 
► తెలంగాణ ఉద్యమ వ్యాప్తి, టీఆర్‌ఎస్‌ విస్తరణలో కీలకపాత్ర పోషించిన ‘సాంస్కృతిక కళారూపాలను కొత్త పార్టీకి కూడా జోడించనున్నారు. దీనికి అవసరమైన సాహిత్యం, 
కళాకారులు వంటి అనేక అంశాలపై కసరత్తు జరుగుతోంది.  

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో జాతీయ పార్టీ ఏర్పాటుకు టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మూడు రోజులుగా ప్రగతిభవన్‌లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో మంతనాలు జరిపిన కేసీఆర్‌.. కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలకు తుది రూపునిచ్చినట్టు తెలిసింది. ‘భారత రాష్ట్ర సమితి’, ‘భారత నిర్మాణ సమితి’, ‘భారత ప్రజా సమితి’లలో ఒక పేరును ఖరారు చేసి.. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీని రిజిస్ట్రేషన్‌ చేసే ప్రక్రియ చురుగ్గా కొనసాగుతున్నట్టు సమాచారం.

ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు మంచి రోజులు ఉండటంతో సరైన ముహూర్తం చూసి.. కొత్త జాతీయ పార్టీ పేరు, ఎజెండా, నియమావళి, జెండా, ఎన్నికల గుర్తు తదితరాలను ప్రకటించేందుకు కేసీఆర్‌ సన్నాహాలు చేస్తున్నారు. దీంతో త్వరలోనే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ కొత్త జాతీయ పార్టీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు కూడా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్‌ వ్యవహరించనుండగా.. ప్రశాంత్‌ కిషోర్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి లేదా సెక్రటరీ జనరల్‌ హోదా కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

ఏర్పాట్లపై తుది కసరత్తు.. 
‘భారత రాష్ట్ర సమితి’ లేదా ‘భారత నిర్మాణ సమితి’గా టీఆర్‌ఎస్‌ అవతరించే పక్షంలో.. ఆపై రాష్ట్రంలోనూ కొత్త పేరుతోనే మనుగడ సాగించనుంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కొత్త జాతీయ పార్టీకి చెందిన గుర్తు, ఎజెండాపైనే ఎన్నికల బరిలోకి దిగే అవకాశముంది. జాతీయ పార్టీగా అవతరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ పేరిట ఉన్న ఆస్తులు, బ్యాంక్‌ డిపాజిట్లు తదితరాలను కొత్త పార్టీ పేరిట మార్పిడి చేసేందుకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు, చిక్కులపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.

కొత్త జాతీయ పార్టీ ఆవిర్భావ ప్రకటనతోపాటు జాతీయ కార్యవర్గం/పొలిట్‌ బ్యూరోను కేసీఆర్‌ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో భావ సారూప్యత కలిగిన చిన్న పార్టీలు, వివిధ సామాజిక సంస్థలు, సంఘాలను విలీనం చేసుకుంటూ కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్టు సమాచారం. కొత్త పార్టీ కార్యవర్గంలో రాజకీయ నేతలకంటే వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావి వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాపై తమ చిత్తశుద్ధిని చాటాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. 

ఢిల్లీలో బహిరంగ సభ పెట్టి.. 
కేసీఆర్‌ జాతీయ పార్టీ స్థాపనపై ప్రకటన చేశాక.. జూలై మొదటి వారంలో దేశ రాజధాని ఢిల్లీ లేదా పరిసర రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆ సభకు తెలంగాణతోపాటు ఉత్తరాది నుంచి జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు. అదే సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజయ్యేలా జాగ్రత్తలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఉత్తరాదిన పార్టీ విస్తరణకు అనువైన వాతావరణం ఉందని భావిస్తూ.. ఉత్తరాది రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో రాజకీయ శూన్యత లేదనే అభిప్రాయంతో ఉన్న కేసీఆర్‌.. సందర్భాన్ని బట్టి ముందుకు సాగాలని భావిస్తున్నారు. రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ సేవలను వినియోగించుకోవడం, యూపీలో ఆర్‌ఎల్‌డీ, జార్ఖండ్‌లో జేఎంఎం, బిహార్‌లో ఆర్జేడీ, యూపీలో సమాజ్‌వాదీ వంటి పార్టీలతో ఏ తరహా సంబంధాలను కొనసాగించాలనే కోణంలోనూ కేసీఆర్‌ కొంతమేర స్పష్టతకు వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులు, కలిసి వచ్చే పార్టీలు, నేతల వివరాలతో పీకే బృందం ఇప్పటికే నివేదికలు రూపొందించినట్టు సమాచారం. 

కొత్త పార్టీకి ‘సినీ గ్లామర్‌’! 
జాతీయ రాజకీయాల్లో వీలైనంత త్వరగా కుదురుకోవాలని భావిస్తున్న సీఎం కేసీఆర్‌.. కొత్త పార్టీకి సినీ గ్లామర్‌ను కూడా అద్దుతున్నారు. ఇప్పటికే నటుడు ప్రకాశ్‌రాజ్‌ కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతుండగా.. మరో నటుడు సోనూసూద్‌ కూడా కొత్త పార్టీలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది.   

సోషల్‌ మీడియా దన్నుతో.. 
జాతీయ స్థాయిలో కొత్త పార్టీ విస్తరణ కోసం కొన్ని జాతీయ మీడియా సంస్థల సాయం తీసుకోవడంతోపాటు సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా ఉపయోగించుకునేలా ప్రశాంత్‌ కిషోర్‌ ఇప్పటికే వ్యూహ రచన చేశారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ విధానాలపై కేసీఆర్‌ హిందీలో చేసిన ప్రసంగాల్లోని అంశాలు ఇప్పటికే సామాజిక మాధ్య మాల ద్వారా ఉత్తరాది రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నాయని.. వేల సంఖ్యలో కామెంట్లు, లైక్‌లు వస్తున్నాయని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement