జూడాల సమ్మె సరికాదు: సీఎం కేసీఆర్‌ | CM KCR Review With Medical Officers At Pragati Bhavan | Sakshi
Sakshi News home page

జూడాల సమ్మె సరికాదు: సీఎం కేసీఆర్‌

Published Wed, May 26 2021 5:04 PM | Last Updated on Thu, May 27 2021 7:58 AM

CM KCR Review With Medical Officers At Pragati Bhavan - Sakshi

జానియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపు ఇవ్వడం మంచిది కాదని.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విధులకు హాజరుకావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రగతి భవన్‌లో వైద్యాధికారులతో సీఎం కేసీఆర్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు.

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సీనియర్‌ రెసిడెంట్ల గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచేందుకు.. మూడేళ్లు వైద్య విద్య అభ్యసించి కోవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య విద్యార్థులకూ ఈ వేతనాన్ని వర్తింపజేసేందుకు సీఎం ఓకే చెప్పారు. కోవిడ్‌ విధుల్లో మరణించిన వైద్యులకు అందిస్తున్న ఎక్స్‌గ్రేషియాను సత్వరమే చెల్లించాలని.. జూనియర్‌ డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్షించారు.

ఈ సందర్భంగా అధికారులు జూనియర్‌ డాక్టర్ల సమ్మె విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చాలా రాష్ట్రాల్లో జూనియర్‌ డాక్టర్లకు తెలంగాణ కంటే తక్కువ స్టైపెండ్‌ చెల్లిస్తున్నారని వివరించారు. దీంతో జూనియర్‌ డాక్టర్ల సమస్యలు ఏమిటని సీఎం ఆరా తీశారు. ఆయా అంశాలను అధికారులు వివరించగా.. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. జూనియర్‌ డాక్టర్ల పట్ల ప్రభుత్వం ఎన్నడూ వివక్ష చూపలేదని, వారి సమస్యలను పరిష్కరిస్తూనే ఉందని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా న్యాయమైన కోరికలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందన్నారు. 

సమ్మెను ప్రజలు హర్షించరు 
విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచు కుని తక్షణమే విధుల్లో చేరాలని జూనియర్‌ డాక్టర్లకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ‘‘జూనియర్‌ డాక్టర్లవి న్యాయమైన కోరికలైనప్పుడు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం ఉండబోదు. వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చు. అంతేగానీ.. చీటికి మాటికి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా, సమయ సందర్భాలను కూడా చూడకుండా, విధులను బహిష్కరించడం సరైన పద్ధతి కాదు. అదికూడా కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో ఇటువంటి నిర్ణయాన్ని ప్రజలు హర్షించరు’’అని స్పష్టం చేశారు. 

చదవండి: జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందన
సమర్థవంతంగా లాక్‌డౌన్‌ అమలు: సీపీ అంజనీకుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement