ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కలిసి భోజనం చేస్తున్న ముఖ్యమంత్రులు ఉద్ధవ్ ఠాక్రే, కేసీఆర్, నితీశ్ కుమార్, శివరాజ్‌సింగ్ చౌహాన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్త జిల్లా లు ఏర్పాటు చేసినందున, ఐపీఎస్ కేడర్‌ను సమీక్షించి పోస్టుల సంఖ్యను 195కు పెంచాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను సీఎం కె.చంద్రశేఖర్‌రావు కోరారు. దీనివల్ల ఆయా జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారుల కొరత తీరుతుందని వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి 8:45 నుంచి 10:05 వరకు అమిత్ షాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సాధారణంగా సీఎం కాన్వాయ్‌లో ఉండే ఇతర వాహనాలు ఏవీ లేకుండా, కేవలం ఒకే వాహనంలో అమిత్ షా ఇంటికి కేసీఆర్ వెళ్ళారు.
కొత్త జిల్లాలపై వివరణ
విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు వేగవంతంగా చేర్చేందుకు వీలుగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయాన్ని మరోసారి కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్ళారు. అందులో భాగంగానే ఐపీఎస్ కేడర్ సమీక్ష అంశాన్ని ప్రస్తావించారు. పునర్ వ్యవస్థీకరించిన జిల్లాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. అప్పటివరకు ఉనికిలో ఉన్న 9 పోలీసు జిల్లాలు, రెండు పోలీసు కమిషనరేట్ల స్థానంలో.. 20 పోలీసు జిల్లాలు, 9 పోలీసు కమిషనరేట్లతో కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌లో పోలీసు పరిపాలనకు సంబంధించి ప్రత్యేక గుర్తింపు ఉందని గుర్తుచేశారు. పాలనకు సంబంధించి కొత్త వ్యవస్థలో భాగంగా పోలీసు యూనిట్లు ఏర్పాటైనందున కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్‌ను అనుసరించి కొత్తగా పలు ప్రాదేశిక పోస్టులు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు.
ఉన్నతాధికారులను నియమించాల్సి ఉంది
‘తెలంగాణకు సంబంధించి ఐపీఎస్ కేడర్‌ను 2016లో కేంద్రం సమీక్షించింది. 139 అధీకృత పోస్టులను ఆమోదించింది. ప్రస్తుతం పునర్ వ్యవస్థీకరణ తర్వాత కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, కొత్త మల్టీ జోన్లకు పోలీస్ ఉన్నతాధికారులను నియమించాల్సి ఉంది. అందువల్ల ఐపీఎస్ కేడర్ అధికారుల సంఖ్య 195కి పెంచాలి’ అని సీఎం కోరారు.
ప్రత్యేక అంశంగా పరిగణించండి
‘పోలీసు శాఖ పరిపాలన అవసరాల రీత్యా దీనిని ప్రత్యేక అంశంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఐపీఎస్ పోస్టుల సంఖ్యను పెంచితే విభిన్న ప్రాదేశిక యూనిట్లలో కమిషనర్లుగా, ఎస్పీలుగా, జోనల్ డీఐజీలుగా, మల్టీ జోనల్ ఐజీలుగా నియమించే వీలు కలుగుతుంది. అందువల్ల ప్రస్తుత ఐపీఎస్ క్యాడర్ సమీక్షను అసాధారణ కేసుగా పరిగణించి ఆమోదించాలి..’అని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు విభజన చట్టం హామీలకు సంబంధించి అమిత్ షాతో కేసీఆర్ చర్చించారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment