200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరాకు ఏటా.. 4,008 కోట్లు | CM Revanth Reddy Review On Electricity | Sakshi
Sakshi News home page

200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరాకు ఏటా.. 4,008 కోట్లు

Published Sat, Dec 9 2023 4:57 AM | Last Updated on Sat, Dec 9 2023 8:27 AM

CM Revanth Reddy Review On Electricity - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా స్థితిగతులు, విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితి, ఆదాయ, వ్యయాలు, అప్పులు, నష్టాల వివరాలను విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా నివేదించాయి. విద్యుత్‌ సంస్థల ఆర్థిక స్థితిపై సమగ్ర నివేదికను కూడా సమర్పించాయి. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ మేరకు గృహాలకు ప్రతి నెలా 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడానికి ఏటా రూ.4,008 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు తెలిపాయి. సీఎం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో విద్యుత్‌ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, సీఎంవో కార్యదర్శి వి.శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్, టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ సంస్థల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్‌రావు, జెన్‌ కో డైరెక్టర్‌ అజయ్, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస రావు పాల్గొన్నారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్, నివేదిక ద్వారా వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.  

బకాయిల కోసం రూ.30,406 కోట్ల అప్పు 
తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో), తెలంగాణ విద్యుత్‌ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో), టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌ సంస్థల అప్పులు  2015–15లో రూ.22,423 కోట్లు కాగా, ఈ ఏడాది అక్టోబర్‌ 31 నాటికి రూ.81,516 కోట్లకు పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిలను చెల్లించడానికే టీఎస్‌ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌ సంస్థలు ఏకంగా రూ.30,406 కోట్లను స్వల్పకాలిక రుణాలుగా తీసుకున్నాయి. అప్పులు తిరిగి చెల్లించడానికి రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ప్రతి నెలా రూ.1,300 కోట్లు అవసరం. విద్యుత్‌ ఎక్ఛ్సేంజీల నుంచి అదనపు విద్యుత్‌ కొనుగోలు కోసం ప్రతి నెలా రూ.500 కోట్లు ఖర్చు అవుతోంది.     

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో డిస్కంలు  
ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ టీఎస్‌ఎనీ్పడీసీఎల్‌/టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. రాష్ట్ర ఆవిర్భావం (2014–15) నాటి నుంచి 2023–24 వరకు ఈ రెండు సంస్థలు ఏకంగా రూ.50,275 కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. 2014–15లో రూ.3,600 కోట్లు ఉన్న విద్యుత్‌ సబ్సిడీని క్రమంగా పెంచుకుంటూ 2023–24 నాటికి రూ.11,500 కోట్లకు పెంచారు.  

వ్యవసాయానికి 2 విడతల్లో 12 గంటలు.. 
రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక్కో విడతలో 6 గంటలు చొప్పున ప్రతి రోజూ రెండు విడతల్లో మొత్తం 12 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర విద్యుత్‌ సరఫరా స్థాపిత లోడ్‌ సామర్థ్యం 19,475 మెగావాట్లు కాగా, ఇప్పటివరకు 15,497 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదైందని తెలిపారు. గత మార్చి 14న అత్యధికంగా 297.89 మిలియన్‌ యూనిట్లను సరఫరా చేశామన్నారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల నిర్మాణం పూర్తైతే గరిష్టంగా 16,701 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంటుందని వివరించారు.  

వారంలో విద్యుత్‌పై శ్వేతపత్రం 
రాష్ట్ర ఆవిర్భావం నాటి (2014–15) కాలంతో పోల్చుతూ 2023–24లో రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలిపేందుకు శ్వేతపత్రాన్ని సిద్ధం చేయాల్సిందిగా సీఎం రేవంత్‌ ఆదేశించినట్టు తెలిసింది. మరో వారం రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహించి ప్రజలకు దీనిని విడుదల చేస్తామని, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విద్యుత్‌ సంస్థలు భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిస్థితులను ప్రజలకు ముందుగానే  తెలియజేయాల్సిన అవసరముందని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగరాదని ఆదేశించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.   

విద్యుత్‌ సంస్థల నష్టాలకు కారణాలు ఇవే..

  • రాష్ట్రంలో 27.99 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లుండగా, వీటికి ఉచితంగా సరఫరా చేస్తున్న విద్యుత్‌కు కచి్చతమైన లెక్కలు లేవు.  
  • రూ.12,515 కోట్ల ట్రూఅప్‌ చార్జీలను విని యోగదారుల నుంచి వసూలు చేసేందుకు గత ప్రభుత్వం అనుమతించలేదు. ప్రభుత్వమే వచ్చే ఐదేళ్లలో విడతల వారీగా చెల్లిస్తుందని హామీ ఇచ్చినా ఇప్పటివరకు చెల్లించలేదు.  
  • క్లీన్‌ ఎనర్జీ సెస్‌గా టన్ను బొగ్గుపై కేంద్రం రూ.400 వసూలు చేస్తోంది.  
  • బొగ్గు ధరలు భారీగా పెరగడం, రైలు, రవాణా చార్జీలు పెరగడం. 
  • ప్రతి నెలా రూ.1,300 కోట్లను స్వల్పకాలిక రుణాలు తిరిగి చెల్లించడానికే ఖర్చు చేయాల్సి వస్తోంది. 
  • 800 మెగావాట్ల కేటీపీఎస్, 1,080 మెగావాట్ల భద్రాద్రి, 800 మెగావాట్ల ఎన్టీపీసీ వంటి కొత్త విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణంతో విద్యుత్‌ కొనుగోలు వ్యయం పెరిగింది. 
  • ఎన్టీపీసీ వంటి కేంద్ర ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థలు అధిక ధరతో విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుని వాడుతున్నాయి.  
  • విద్యుత్‌ ఉద్యోగులకు 2014–15లో 37.5% 2018–19లో 42.5%, 2023–24లో 15% వేతన సవరణ అమలు చేయడంతో జీతాల వ్యయం భారీగా పెరిగింది.   

నాకు సమాచారం లేదు.: ప్రభాకరరావు
విద్యుత్‌ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించే సమీక్షాసమావేశానికి రావాలని తనకు ఎలాంటి సమాచారంలేదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు స్పష్టం చేశా రు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఎం విద్యుత్‌రంగంపై నిర్వహించే సమీక్షకు రమ్మని విద్యుత్‌శాఖ నుంచి కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఎలాంటి సమాచారంరాలేదని తెలిపారు. సీఎం సమావేశానికి పిలుస్తున్నారని చెబితే వెళ్లకుండా ఎందుకు ఉంటానని అన్నారు. తాను మాజీ సీఎండీగా కూడా సీఎం పిలిస్తే వెళ్లి అన్ని విష యాలు వివరించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభాకర్‌రావు చెప్పారు.

గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో తీసుకున్న రుణాలు కేవలం మూలధన వ్యయం(క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌) చేసినట్లు ఆయన తెలిపారు. ఎంత మొత్తం వ్యయం చేశామన్నది ఇప్పుడు చెప్పలేనని తెలిపారు. సమీక్షాసమావేశానికి తనను పిలిపించాలని సీఎం ఆదేశించినట్లు కేవలం మీడియా, పత్రికల్లోనే చూశానని, వాటి ఆధారంగా సమావేశానికి వెళ్లలేనని, ఇప్పటికే రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తన రాజీనామాను ఆమోదించినట్లు కానీ, తిరస్కరించినట్లు కానీ ఎలాంటి సమాచారంలేదని వివరించారు. విద్యుత్‌ సంస్థల్లో డిమాండ్, సరఫరా, కొనుగోళ్లు అన్ని పారదర్శకంగానే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.    

ఇదీ చదవండి: ఓ వైపు పాలన..  మరోవైపు పదవులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement