సాక్షి, హైదరాబాద్ : అతని పేరు రఘురామయ్య... 55 ఏళ్లుంటాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మొదటి దశలో కరోనా టీకాకు అర్హుడు. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా? వేసుకుందామని ఎదురుచూస్తున్నాడు. కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకోమని ప్రభుత్వం గతంలో ప్రకటించడంతో దాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే, అందుబాటులోకి రాకపోవడంతో నిరాశతో ఉన్నాడు. ఆమె పేరు శాంతాకుమారి... 45 ఏళ్లుంటాయి. షుగర్, ఆస్తమా ఉండటంతో ఆమె కూడా కోవిడ్ వ్యాక్సిన్‌కు అర్హురాలే. ఇప్పటివరకు ఎలాగోలా కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కోవిన్ యాప్‌లో పేరు నమోదు చేసుకుందామంటే అది ఓపెన్ కావడం లేదు. ఇదీ రాష్ట్రంలో లబ్ధిదారుల పరిస్థితి. త్వరలో వ్యాక్సిన్ మన ముంగిటకు రానుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. దీంతో నిర్దేశిత లబ్ధిదారులందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్లేనని చాలా మంది అనుకుంటున్నారు.
కోవిన్ యాప్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ యాప్ ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో పేర్లను ఎలా నమోదు చేసుకోవాలనే విషయంలో లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది. వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. కానీ వాస్తవమేమింటే కోవిన్ యాప్ ఇంకా విడుదలే కాలేదు. దీనిపై మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ జరిగింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అందులో ఈ అంశంపై చర్చించాలని భావిస్తున్నారు. కోవిన్ యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అడిగి తెలుసుకుంటామని అధికారులు వెల్లడించారు.
వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మొదట కరోనా వ్యాక్సిన్ ఇస్తారు. తర్వాత ప్రాధాన్యతా క్రమంలో 50 ఏళ్లు పైబడిన వారందరికీ, 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి టీకా వేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ రెండు వర్గాలకు చెందినవారు కోవిన్ యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పడంతో... జనం అందుకోసం ప్రయత్నిస్తున్నారు. నిజానికి కోవిన్ యాప్ ఇంకా విడుదల కాలేదు. కాబట్టి సామాన్య ప్రజానీకం నమోదుకు తొందరపడకూడదు. అప్పుడే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లలో దీనికోసం వెతకొద్దు. కోవిన్‌ను పోలిన పేరుతో ఉన్న యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని వాటిల్లో పంచుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యాప్ అందుబాటులోకి వచ్చాక... ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్... ఇలా ఏదో ఒక గుర్తింపు కార్డు ఆధారంగా కోవిన్‌లో నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. నమోదుకు సంబంధించిన విధివిధానాలను కూడా యాప్ విడుదల సమయంలో వెల్లడిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment