వ్యాక్సిన్‌ సైరన్‌.. ఎవరెవరికి ఎప్పుడంటే.. | Coronavirus: First Vaccine For Health Care Workers | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ సైరన్‌.. తొలి టీకా హెల్త్‌ వర్కర్లకే..

Published Tue, Jan 5 2021 9:19 AM | Last Updated on Tue, Jan 5 2021 10:13 AM

Coronavirus: First Vaccine For Health Care Workers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సిటీలో కరోనా వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో దాదాపు లక్షా 20 వేల మంది హెల్త్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ వేస్తారు. ఈ మేరకు ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు చేపట్టింది. వ్యాక్సిన్‌ తీసుకునే లబ్ధిదారులను గుర్తించి వారి వివరాలను కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 1602 వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 1.20 లక్షల మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్‌ వేస్తారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు ఏ రోజు? ఏ సమయంలో? ఏ కేంద్రానికి చేరుకోవాలి వంటి సమాచారం ముందస్తుగా వారి ఫోన్‌ నెంబర్‌కు మెస్సేజ్‌ వస్తుంది. ఆ మేరకు వారు తగిన గర్తింపు కార్డు తీసుకొని ఆయా కేంద్రాలకు చేరుకోవాలి. సెంటర్‌లోని రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ వద్ద తమ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ(వన్‌ టైం పాస్‌వర్డ్‌)ను ఇస్తే వారు అన్ని వివరాలను ధృవీకరించుకుని ఆ తర్వాతే వ్యాక్సిన్‌ ఇస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఐదు నుంచి పది నిమిషాల్లో పూర్తవుతుంది. ఇలా ఒక్కో సెంటర్‌లో వంద మందికి  వ్యాక్సిన్‌ వేయనున్నారు.  

చదవండి: ‘క్లినికల్‌’ తరహాలో కోవాగ్జిన్‌ టీకా

వ్యాక్సిన్‌ కేంద్రాల ఎంపిక ఇలా 
నిబంధనల ప్రకారం వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో మూడు గదులతో పాటు ఎంట్రెన్స్, ఎగ్జిట్‌లు వేర్వేరుగా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు.  
ఇలా ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను వ్యాక్సిన్‌ సెంటర్లుగా ఎంపిక చేశారు.  
⇔ ఈ సౌలభ్యం లేని చోట అదనంగా కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లు, కాలేజీలను వాక్సినేషన్‌ కేంద్రాలుగా ఎంపిక చేయనున్నారు.  
ఒక్కో సెంటర్‌లో ఐదుగురు సభ్యులతో కూడిన సిబ్బంది వ్యాక్సినేషన్‌లో పాల్గొంటారు. 
ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో పని చేస్తున్న సుమారు ఎనిమిది వేల మందికి వ్యాక్సినేషన్‌పై శిక్షణ ఇచ్చారు.   

వ్యాక్సిన్‌ స్టోరేజీ ఇలా.. 
కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమం ఈ నెల రెండో వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తుంది. 
ఆక్స్‌ఫర్డ్‌ ఆక్సెనికా సహాయంతో సీరం ఇనిస్టిట్యూట్‌ తయారు చేసిన కోవిషీల్డ్‌తో పాటు భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన కోవాగ్జిన్‌లకు ఇప్పటికే డ్రగ్‌
కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఏ) అనుమతి ఇచ్చింది.  
తొలిదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌లో తయారవుతున్న కోవిషీల్డ్‌ను వాడనున్నారు.  
ప్రత్యేక ఇన్సులేటెడ్‌ కార్గో విమానాల్లో శంషాబాద్‌ విమానాశ్రమానికి చేరుకుని అటు నుంచి కోఠిలోని స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌కు చేరుకుంటుంది. అక్కడ కోటిన్నర వ్యాక్సిన్ల నిల్వ సామర్థ్యం గల నాలుగు వాక్‌ ఇన్‌ కూలర్లు సిద్ధం చేశారు.  
⇔ కోఠి నుంచి జీహెచ్‌ఎంసీ స్టోర్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఎంపిక చేసిన చుట్టల్‌బస్తీ, బేగంబజార్, హరాజ్‌పెంట, శ్రీరామ్‌నగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోని సెంటర్లకు తరలిస్తారు. సాధారణ వ్యాక్సిన్‌ తరహాలోనే కోవిడ్‌ వ్యాక్సిన్‌కు కూడా 2 నుంచి 8 సెల్సియస్‌ డిగ్రీల వద్ద నిల్వ చేస్తారు. అక్కడి నుంచి వ్యాక్సినేషన్‌ రోజు ప్రత్యేక వాహనాల్లో, ప్రత్యేక స్టోరేజ్‌ బాక్సుల్లో సెంటర్లకు తరలిస్తారు.  

జిల్లాల వారికి ఏర్పాట్లు ఇలా:  

హైదరాబాద్‌ జిల్లాలో లబ్దిదారులు 78236 
ప్రభుత్వ హెల్త్‌కేర్‌ వర్కర్లు 19016 
ప్రైవేటు హెల్త్‌కేర్‌ వర్కర్లు 59220
వ్యాక్సినేషన్‌ సెంటర్లు 1202
వ్యాక్సినేషన్‌లో పాల్గొనే సిబ్బంది 6010
రంగారెడ్డి జిల్లాలో 26078 
ప్రభుత్వ హెల్త్‌కేర్‌ వర్కర్లు 6079
ప్రైవేటు హెల్త్‌కేర్‌ వర్కర్లు 19999
వ్యాక్సిన్‌ సెంటర్లు 260
వ్యాక్సినేషన్‌లో పాల్గొనే సిబ్బంది 1300
మేడ్చల్‌ జిల్లాలో లబ్ధిదారులు 14702
వ్యాక్సిన్‌ సెంటర్లు 141

ఎవరెవరికి ఎప్పుడంటే? 
తొలివిడత: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌ 
రెండో విడత: పోలీసు, జైళ్లశాఖ, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ 
మూడో విడత: సీనియర్‌ సిటిజన్స్, హృద్రోగ, కిడ్నీ, కేన్సర్, మధుమేహం ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు.. 
నాలుగో విడత: అన్ని వర్గాలకు చెందిన సాధారణ ప్రజలకు అవకాశం కల్పిస్తారు. 

ఏ స్టేజ్‌లో ఎవరు? ఏం చేస్తారంటే..? 
స్టేజ్‌–1: సెంటర్‌ ప్రధానగేటులో పోలీసు కానిస్టేబుల్‌/హోంగార్డు/ సెక్యూరిటీ స్టాఫ్‌ ఉంటారు. వీరు కేంద్రానికి చేరుకున్న లబ్ధిదారుల గుర్తింపు కార్డు, శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి, లోనికి అనుమతిస్తారు. 
స్టేజ్‌–2: సెంటర్‌ ప్రధాన ప్రవేశ ద్వారంలో రిజిస్ట్రేషన్‌ కోసం కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉంటారు. వీరు కోవిన్‌ పోర్టల్‌లో లబ్ధిదారుని పేరు ఉందో? లేదో చెక్‌ చేసి, ఫోన్‌కు ఓటీపీ వచ్చిందో లేదో చూసి రెండో గదిలోకి పంపిస్తారు. 
స్టేజ్‌–3: ప్రభుత్వ ఉపాధ్యాయుడు /ఆశా వర్కర్‌ ఉంటారు. వీరు వచ్చిన వారిని గదిలో ఓ క్రమ పద్ధతిలో కూర్చోబెడతారు. శానిటైజ్‌ చేసుకున్నారా? మాస్క్‌ ధరించారా? సామాజిక దూరం పాటిస్తున్నారా? లేదా వంటి అంశాలను పర్యవేక్షిస్తారు. 
స్టేజ్‌–4: పీపీఈ కిట్లు ధరించిన స్టాఫ్‌నర్సు/డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ ఉంటారు. వీరు వచ్చిన వారికి వ్యాక్సిన్‌ ఇస్తారు.  
స్టేజ్‌–5: డ్యూటీమెడికల్‌ ఆఫీసర్‌/అబ్జర్వర్‌ ఉంటారు. వీరు టీకా వేయించుకున్న వారిని గదిలో 30 నిమిషాల పాటు ఉంచి, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఏదైనా అనుకోని సమస్యలు తలెత్తితే వెంటనే ప్రత్యేక అంబులెన్స్‌లో గాంధీ, టిమ్స్‌ వంటి కోవిడ్‌ సెంటర్లకు పంపి, అక్కడే వారికి వైద్య సేవలు అందించనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement