
సాక్షి, హైదరాబాద్ : ప్రజల మనిషి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అనేక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తారని, అధికారంలోకి వచ్చాక అభివృద్ధికి కొత్త నిర్వచనం చూపారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధి వైఎస్ హయాంలోనే జరిగిందని, అవుటర్ రింగ్ రోడ్, పీవీ ఎక్స్ ప్రెస్ హైవే లాంటి అనేక ఫ్లైఓవర్తను నిర్మించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ హయాంలోనే అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయం పూర్తైన విషయాన్ని గుర్తుచేశారు. సాఫ్ట్‌వేర్ పార్కులను ఏర్పాటుచేసి ఐటీకి కొత్తరూపం తెచ్చారని కొనియాడారు. ఆపదలో ఆదుకునే ఆరోగ్య శ్రీ పథకంతో కొత్త విప్లవానికి శ్రీకారం చుట్టిన మహానేత రైతు పక్షపాతిగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచారని పేర్కొన్నారు.