కెరీర్‌పై మోజుతో పెళ్లి వాయిదా వేస్తూ చివరకు బ్రహ్మచారులుగా మిగిలిపోయేవారు కొందరైతే.. వివాహం చేసుకుని విడాకులు తీసుకుని ఒంటరిగా మారేవారు మరికొందరు. ఇంకా మరెన్నో కారణాలతో సిటీలైఫ్‌లో ఒంటరి జీవితాలు సర్వసాధారణంగా మారాయి. అయితే.. వీరి ఆలోచనల్లో కరోనాతో మార్పు వచ్చిందా? జంటగా మారడమే మేలు అనే అభిప్రాయం తెచ్చిందా? అంటే అవుననే అంటున్నారు మ్యారేజీ బ్యూరోల ప్రతినిధులు, సైకాలజిస్ట్‌లు.
– సాక్షి, సిటీబ్యూరో
కరోనా సమయంలో ప్రపంచం అంతా తలుపులు మూసుకున్న పరిస్థితుల్లో అన్ని వేడుకలూ, కార్యక్రమాలూ అర్ధంతరంగా ఆగిపోయాయి. అన్నింటి కన్నా పెళ్లి వేడుకలపై కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. లాక్‌డౌన్ టైమ్‌లో ముహూర్తాలన్నీ మూలనపడ్డాయి. ఈ ఏడాది అత్యల్ప సంఖ్యలోనే పెళ్లిళ్లు జరిగాయి. ఇది అందరికీ తెలిసిన సంగతే. అయితే.. దీనిలో మరో కొత్త కోణం ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తోంది. ఇప్పటిదాకా ఒంటరి ఉన్న వ్యక్తుల్లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పెళ్లి ఆలోచన పెరిగిందనేదే ఈ కొత్త కోణం. దీనికి కారణాలు చూస్తే..
లాక్‌డౌన్‌లో.. లోన్లీనెస్
కరోనా కారణంగా అన్ని కార్యకలాపాలూ స్తంభించడంతో.. అందరూ ఇళ్లలోనే ఎన్నడూ లేనంత ఎక్కువ సమయం గడిపారు. కొన్ని నెలల పాటు ఇంట్లో ఒంటరిగా గడపడంతో సింగిల్స్‌కి అదెంత కష్టమైన పనో అర్థమైంది. కేవలం ఫోన్ల ద్వారా తప్ప స్నేహితులను, బంధువులను నేరుగా కలవడానికి వీలు లేకుండాపోయింది. అప్పటిదాకా తీరికలేని పనులతోనో, ఇష్టమైన వ్యాపకాలతోనో తమలోని ఒంటరితనాన్ని దూరం చేసుకున్న సింగిల్స్.. కరోనా సమయంలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ‘ఏ పనీ లేకుండా నాలుగ్గోడల మధ్య చిక్కుకుపోతే గానీ ఒంటరి బతుకెంత కష్టమనేది తెలిసిరాలేదు’ అని గుర్తు చేసుకున్నారు ఖైరతాబాద్‌లోని వెంకటరమణ కాలనీ నివాసి రవి.
పోస్టింగ్స్.. టెస్టింగ్స్..
కుటుంబం అంతా ఒక చోట ఉన్నప్పటికీ వ్యక్తిగత వ్యాపకాలు, బిజీబిజీ పనులతో ఎవరికివారే యమునా తీరే అన్నట్టు ఉండటం నగర జీవితంలో సహజమే. వారాంతాల్లోనో మరో హాలీడే రోజునో మాత్రమే ఫ్యామిలీ మొత్తం కలిసి గడపడం జరుగుతుంటుంది. అలా ఉన్నప్పటికీ తమకంటూ మరొకరో, మరికొందరో ఉన్నారనే భరోసా వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ భరోసా లేని సింగిల్స్.. పరిచయస్థులు, స్నేహితుల మధ్య గడపడం లేదా ఇష్టమైన అభిరుచులను ఆస్వాదించడంలో బిజీ అయిపోయి ఆ లోటును మర్చిపోతుంటారు. అది లాక్‌డౌన్ టైమ్‌లో సాధ్యపడలేదు. మరోవైపు లాక్‌డౌన్ టైమ్‌లో ఫ్యామిలీస్ అంతా కలిసి గడపడం, అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ కలిసి ఆట పాటలు, వంటలు చేసుకోవడం, గార్డెనింగ్ వంటి పనులతో ఎంజాయ్ చేయడం.. పైగా వాటిని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకోవడం.. గమనిస్తూ వచి్చన సింగిల్స్ తాము ఏం కోల్పోతున్నామనేది సోషల్ మీడియా గుర్తు చేసింది.
‘లాక్‌డౌన్ టైమ్‌లో సిస్టమ్‌కి నన్ను నేను కట్టి పడేసుకున్నా. అయినా ఫ్యామిలీస్ పోస్ట్ చేసే పోస్టులు, ఫొటోలు నేను మిస్సవుతున్న వాటిని పదే పదే గుర్తుచేసి నన్ను కొంత బలహీనంగా మార్చిన మాట వాస్తవమే’నన్నారు బేగంపేట నివాసి దేవి.
సీనియర్స్‌లో మరింతగా..
పెద్ద వయసులో ఒంటరిగా ఉండేవాళ్లు ఈ కరోనా టైమ్‌లో చాలా రకాల భయాలకు గురవుతున్నారు. ఒంటరితనంతో పాటు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయేమోననే ఆందోళన వీరిని ఏదో ఒక తోడు వెతుక్కునేందుకు పురిగొల్పుతోంది. కరోనా సమయంలో ఒంటరిగా ఉండటం వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్ని చెబుతూ తోడు కోసం మమ్మల్ని ఈ విషయంలో సంప్రదించేవారి సంఖ్య పెరిగింది.
– రాజేశ్వరి, ‘తోడునీడ’
Comments
Please login to add a commentAdd a comment