వీగనిజాలు
ఆహారపు అలవాట్లను బట్టి మనుషుల్లో శాకాహారులు, మాంసాహారులు రెండు రకాల విభజన అందరికీ తెలిసినదే. శాకాహారులు ఎలాంటి మాంసాహారాన్నీ తీసుకోరు. అయితే, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాడి ఉత్పత్తులను తీసుకుంటారు. శాకాహారులు తీసుకునే పదార్థాలతో పాటు గుడ్లు, చేపలు, పక్షుల మాంసం, జంతుమాంసం వంటివన్నీ తీసుకుంటారు మాంసాహారులు. సనాతన మతాల్లో ఆచారాన్ని అతిగా పాటించే వారు వీరవైష్ణవ, వీరశైవ వర్గాలుగా ఏర్పడినట్లుగా గడచిన శతాబ్దిలో ఆహారపు అలవాట్లలోనూ ఒక కొత్త అతిధోరణి మొదలైంది. తెలుగులో వీళ్లని వీర శాకాహారులనవచ్చు.ఇంగ్లిష్‌లో వీళ్లనే ‘వీగన్స్’ అంటున్నారు. వీళ్ల సిద్ధాంతమేమిటంటే పశు పక్ష్యాదులను వస్తువులుగా పరిగణించరాదు. అవి కూడా మనుషుల మాదిరిగా సాటి జీవులే. అందువల్ల వాటి నుంచి లభించే ఉత్పత్తులేవీ తీసుకోరాదు. పూర్తిగా ఈ సిద్ధాంతాన్ని నమ్ముకున్నవారు కనీసం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాడి ఉత్పత్తులను కూడా తీసుకోరు. కేవలం మొక్కలు, చెట్ల నుంచి లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు.
పాల ఉత్పత్తులను కూడా తీసుకునే శాకాహారులను ఇంగ్లిష్‌లో వెజిటేరియన్స్ అంటారు. పాల ఉత్పత్తులను తీసుకోని వీర శాకాహారులకు ‘వీగన్స్’ అనే పేరును 1944లో తొలిసారిగా డొనాల్డ్ వాట్సన్ అనే జంతు హక్కుల పరిరక్షణ ఉద్యమ కార్యకర్త ఖాయం చేశాడు. అప్పటి నుంచి పాల ఉత్పత్తులను సైతం నిరాకరించే వీర శాకాహారులకు ‘వీగన్స్’ పేరు స్థిరపడిపోయింది. డొనాల్డ్ వాట్సన్ ఇంగ్లండ్‌లో ‘వీగన్స్ సొసైటీ’ని కూడా ప్రారంభించాడు. ‘వీగన్’ ఆహారం అన్ని వయసుల వారికి, అన్ని శారీరక స్థితులకు చెందిన వారికి పూర్తిగా ఆమోదయోగ్యమైనదేనని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, డైటీషియన్స్ ఆఫ్ కెనడా, బ్రిటిష్ డైటెటిక్ అసోసియేషన్ సంస్థలు ప్రకటించాయి. అయితే, జర్మన్ సొసైటీ ఫర్ న్యూట్రిషన్ మాత్రం ఈ వాదనతో విభేదించింది. పాలు, పాల ఉత్పత్తులు సైతం లేని వీగన్ ఆహారం అన్ని వయసుల వారికీ ఆమోదయోగ్యం అని చెప్పడం తగదని, చిన్నారి శిశువులు, ఎదిగే వయసులోని పిల్లలు, గర్భిణులు, బాలింతలు పూర్తిగా వీగన్ ఆహారంపైనే ఆధారపడితే వారికి తగిన పోషణ లభించదని తేల్చిచెప్పింది. వారు కనీసం పాలు, పాల ఉత్పత్తులనైనా తమ ఆహారంలో భాగంగా చేసుకోవడమే మంచిదని స్పష్టం చేసింది.
ఇదీ శాకాహార చరిత్ర
ఆదిమానవులు ఆకులు అలములు పండ్లు దుంపలతో పాటు జంతుమాంసాన్ని కూడా తినేవారు. తొలి నాళ్లలో పచ్చిమాంసాన్ని తినేవాళ్లు. నిప్పును కనిపెట్టిన తర్వాత కాల్చిన మాంసం రుచి మరిగారు.కంచు, ఇనుము వంటి లోహాలను కనుగొని వాటితో పాత్రలు తయారు చేయడం, మట్టిపాత్రలు తయారు చేయడం మొదలైన తర్వాత రుచికరమైన ఆహారాన్ని వండుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. తొలి నాగరికతల్లో చాలా చోట్ల మనుషులు మాంసాహారులుగానే ఉండేవారు. సింధులోయ నాగరికత విలసిల్లిన ప్రాంతంలో కొందరు శాకాహారులుగా జీవించారనేందుకు ఆధారాలు ఉన్నాయి. అప్పటి కాలంలో అంటే క్రీస్తుపూర్వం 3300–1300 సంవత్సరాల మధ్య కాలంలో మన దేశానికి వాయవ్య ప్రాంతంలో కొందరు శాకాహారులుగా ఉండేవారు. ఈ ప్రాంతంలో కొంత ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దానికి చెందిన జైన మత వ్యవస్థాపకుడు వర్ధమాన మహావీరుడు శాకాహారాన్ని ప్రోత్సహించాడు. ఆయన ప్రభావంతో భారత భూభాగంలోని చాలా ప్రాంతాలకు శాకాహారం విస్తరించింది. జీవహింస పాపమనే చింతన గలవారిలో చాలామంది శాకాహారులుగా మారారు. తొలినాటి శాకాహారులు ఇప్పటి వీగన్ల మాదిరి వీర శాకాహారులేమీ కాదు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో పాటు వారు పాలను, పాల ఉత్పత్తులను కూడా తీసుకునేవారు. చరిత్రకెక్కిన తొలినాటి శాకాహారుల్లో మౌర్య సామ్రాజ్యాన్ని ఏలిన చంద్రగుప్తుడు, అశోకుడు, ప్రాచీన తమిళకవి వళ్లువార్, రోమన్ కవి ఓవిద్, రోమన్ నాటకకర్త సెనెకా ది యంగ్, గ్రీకు తత్వవేత్తలు ఎంపెడాక్లిస్, థియోఫ్రాస్టస్, ప్లూటార్క్, పైథాగరస్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఆహారం కోసం జంతువులను, పక్షులను చంపడాన్ని పైథాగరస్ తీవ్రంగా వ్యతిరేకించేవాడని, వాటిని చంపేవారికి, వాటితో వంటకాలు తయారు చేసేవారికి కూడా దూరంగా ఉండేవాడని ప్లాటో రాశాడు. ఇప్పటి కాలంలో వీగన్స్గా పిలుచుకొనే వీరశాకాహార ధోరణికి క్రీస్తుశకం పదో శతాబ్దిలోనే మూలాలు ఏర్పడ్డాయి. అప్పటి కాలానికి చెందిన అరబ్ కవి అబ్దుల్ అల్ అలమారి వీరశాకాహారాన్ని పాటించేవాడు. పశుపక్ష్యాదులకు చెందిన ఎలాంటి ఉత్పత్తులనూ తీసుకునేవాడు కాదు. తన అనుచరులకు కూడా ఇదే సిద్ధాంతాన్ని బోధించేవాడు. మనుషులు పశుపక్ష్యాదులను తినేస్తున్నట్లయితే మరణానంతరం పశుపక్షుల ఆత్మలు మనుషుల్లో, మనుషుల ఆత్మలు పశుపక్ష్యాదుల్లోనికీ చొరబడే ప్రమాదం ఉందని, అలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండాలంటే మనుషులందరూ ఆహారం కోసం కేవలం వృక్షజాతులపై ఆధారపడటమే సరైన పద్ధతి అని ఆయన బలంగా నమ్మేవాడు. అప్పట్లో ఈ సిద్ధాంతం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. అప్పటి కాలంలో అహింసావాద సిద్ధాంతాన్ని నమ్మేవారిలో చాలామంది స్వచ్ఛందంగా శాకాహారం వైపు మళ్లారు. నిర్ణీత ఆహారపు అలవాట్ల వల్ల చేకూరే ప్రయోజనాలపై మాత్రం వారిలో చాలామందికి తగిన అవగాహన ఉండేది కాదు. డొనాల్డ్ వాట్సన్ గత శతాబ్దిలో ‘వీగన్స్ సొసైటీ’ని ప్రారంభించినా, వీగన్ ఆహారానికి మాత్రం గడచిన దశాబ్దకాలంగా మాత్రమే ప్రాచుర్యం పెరుగుతూ వస్తోంది.
శాకాహారం ప్రయోజనాలూ పరిమితులూ
పాల ఉత్పత్తులను స్వీకరించే శాకాహారులను వెజిటేరియన్లుగా, పాల ఉత్పత్తులను సైతం ఆహారంలో భాగంగా చేసుకోని వారిని ‘వీగన్స్’గా పరిగణిస్తారు. నిజానికి శాకాహారంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా, వాటితో పాటే కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు, అందులోని పరిమితులతో పాటు వీగన్ ఆహారంపై ప్రచారంలో ఉన్న విషయాల గురించి వాస్తవిక దృక్పథంలో
అవగాహన కల్పించడానికే ఈ సమాచారం..
శాకాహారం చాలా మేలు చేస్తుంది. మాంసాహారం తీసుకోవడం వల్ల మన శరీరంలోకి కొన్ని సూక్ష్మజీవులు చేరుతాయి. అవి వ్యాధులకు కారణమవుతాయి. ఉదాహరణకు పందిమాంసం (పోర్క్) ద్వారా టేప్‌వార్మ్స్ వంటివి, బొవైన్ స్పాంజీతో ఎన్సెఫలోపతి, గొడ్డు మాంసంతో మ్యాడ్ కౌ డిసీజ్, ఆంథ్రాక్స్ వంటివి. గుడ్లు తినడం వల్ల సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి.ఫలితంగా న్యుమోనియా, బ్రాంకైటిస్, టైఫాయిడ్ వంటి వ్యాధులు రావచ్చు. శాకాహారంతో అలాంటి ప్రమాదం చాలా చాలా తక్కువ.
ఇవీ పరిమితులు
శాకాహారం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నా, దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. కేవలం శాకాహారం మాత్రమే శరీరానికి కావలసిన అన్ని పోషకాలనూ పూర్తిగా అందించలేదు. ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్ బి–12, విటమిన్–డి, ఐరన్ వంటి పోషకాలు తగినంతగా లభించాలంటే కనీసం పాలు, పాల ఉత్పత్తులనైనా తీసుకోవాల్సి ఉంటుంది.
∙శరీరానికి కావలసిన ప్రొటీన్లు శాకాహారంతో పోలిస్తే మాంసాహారం ద్వారానే తేలికగా లభిస్తాయి. చాలా వరకు శాకాహార పదార్థాల్లో ప్రొటీన్ల పరిమాణం తక్కువగా ఉంటుంది. శాకాహారం ద్వారా మాత్రమే పూర్తిగా ఆధారపడి శరీరానికి కావాల్సిన పరిమాణంలో ప్రొటీన్లు పొందాలంటే పప్పులు, సోయా వంటి గింజధాన్యాలు, వాటితో తయారయ్యే సోయా మిల్క్, తోఫు వంటి ఉత్పత్తులను తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ప్రొటీన్లు పుష్కలంగా ఉండే కినోవా, అవిసెగింజలను కూడా రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి వాటితో పోలిస్తే ఇవేవీ అంత చౌకైన ప్రత్యామ్నాయాలు కావు.
∙యుక్తవయసు వచ్చిన నాటి నుంచి అంటే... 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు వయసు గలవారికి ప్రతి ఒక్కరికీ 1000 మిల్లీగ్రాముల క్యాల్షియమ్ అవసరం. ఇది పాల ఉత్పత్తుల్లో పుష్కలంగా ఉంటుంది. అయితే వీగనిజమ్ అవలంబించే వారికి అదే మొత్తంలో క్యాల్షియం లభ్యం కావాలంటే వాళ్లు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు అంటే పాలకూర, బ్రకోలీ, పొద్దుతిరుగుడు గింజలు, సోయా ఉత్పత్తులు వంటివి ప్రతిరోజూ తీసుకోవాలి. వీరశాకాహారం పేరిట పాలు, పాల ఉత్పత్తులను సైతం మానేసి, ప్రత్యామ్నాయాలను తగినంతగా తీసుకోలేకపోతే ఎముకలకు తీరని నష్టం వాటిల్లుతుంది.ఎముకల్లోకి క్యాల్షియం ఇంకిపోవాలంటే, శరీరానికి కీలకమైన విటమిన్–డి తగినంతగా అందాలి. పూర్తిగా ఎదిగిన యుక్తవయస్కులకు ప్రతిరోజూ 2000 ఇంటర్నేషనల్ యూనిట్స్ (ఐయూ) పరిమాణంలో విటమిన్–డి అవసరం. ఇది కూడా పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, సూర్యకాంతి ద్వారా లభిస్తుంది. పాలు, గుడ్లు మానుకునేవారు ఈ లోటును భర్తీ చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రతిరోజూ సోయా ఉత్పత్తులు, పుట్టగొడుగులు వంటివి తీసుకోవాలి.
∙రక్తహీనత బారిన పడకుండా ఉండటానికి ఐరన్ చాలా అవసరం. ఇది మాంసాహారంలో తక్షణం లభిస్తుంది. అయితే శాకాహారం ద్వారానే ఇది లభ్యం కావాలంటే ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సోయాబీన్ నట్స్ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు టమాటాలు తినడం వల్ల కూడా ఐరన్ తేలిగ్గా శరీరంలోకి ఇంకుతుంది.
∙విటమిన్ బి–12 పూర్తిగా జంతు సంబంధ ఆహారంలోనే లభిస్తుంది. మాంసం తినకపోయినా, కనీసం పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా విటమిన్ బి–12 లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు. విటమిన్ బి–12 లోపిస్తే మెదడు నరాల నుంచి అవయవాలకు ఆదేశాలు అందడంలో ఆటంకాలు, స్పృహతప్పడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఎండ కన్నెరగకుండా ఇళ్లకు, ఆఫీసులకు మాత్రమే పరిమితమవుతూ, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వారిలో విటమిన్–డి, విటమిన్–బి12 లోపంతో వచ్చే నరాల సమస్యలు, ఎముకల సమస్యలు ఇటీవలి కాలంలో చాలా పెరిగాయి. అందుకే కేవలం వెజిటేరియన్ ఆహారంపైనే ఆధారపడే వారు, విటమిన్–డి, విటమిన్–బి12, ఐరన్ వంటి కీలకమైన పోషకాల కోసం సప్లిమెంట్ల వంటి ప్రత్యామ్నాయాలపై మరింత ఎక్కువ దృష్టిపెట్టాలి.
వీగన్ ఆహారానికి పెరుగుతున్న ప్రాచుర్యం
గడచిన దశాబ్దకాలంగా వీగన్ ఆహారానికి ప్రాచుర్యం పెరుగుతోంది. అమెరికా, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ వంటి పాశ్చాత్య సంపన్న దేశాలతో పాటు చైనా, హాంకాంగ్ వంటి ప్రాచ్య దేశాల్లోనూ ప్రాసెస్ చేసిన వీగన్ ఆహార పదార్థాల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో పాడి పరిశ్రమ ద్వారా వచ్చే పాలకు బదులు సోయా మిల్క్ వంటి ప్రత్యామ్నాయ ఉత్పత్తులను తీసుకునే వారి సంఖ్య గత ఎనిమిదేళ్లలోనే 41 శాతం మేరకు పెరిగింది. పూర్తిగా శాకాహార పదార్థాలతో తయారుచేసిన కృత్రిమమాంసం అమ్మే దుకాణాలు కూడా పాశ్చాత్య దేశాల్లో వెలిశాయి. జర్మనీలో 2011లో వీగన్ సూపర్‌మార్కెట్ ప్రారంభమైంది.యూరోప్‌లో వీగన్ల కోసం ప్రత్యేకంగా వెలిసిన తొలి సూపర్‌మార్కెట్ ఇదే. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు వీగన్ ఆహారం వైపు మళ్లుతున్నారు.
ఇవీ ప్రయోజనాలు
శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను ఇటీవలి పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. మాంసాహారంతో పోలిస్తే శాకాహారమే ఎంతో మేలైదని తెలిపే అధ్యయన ఫలితాలు తరచుగా వెల్లడవుతున్నాయి. వాటిలో వెల్లడైన ఫలితాల సారాంశం సంక్షిప్తంగా...
∙శాకాహారం మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగిస్తుంది. అందుకే శాకాహారాన్ని స్వాభావికమైన డీటాక్స్ (విషహరిణి)గా చెప్పవచ్చు. శాకాహారంలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది, విటమిన్లు, ఖనిజలవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఒక అధ్యయన ఫలితం ప్రకారం శాకాహారం తినే జంతువులతో పోలిస్తే మాంసాహారం తినే వాటిల్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ 10 శాతం అదనంగా స్రవిస్తూ ఉంటుంది.
∙మాంసాహారం సాధారణంగా ఒకేరంగుతో కంటికి అంత ఆకర్షణీయంగా కనిపించదు. కానీ శాకాహారంలోని రకరకాల పదార్థాలు రకరకాల రంగులతో ఆకర్షణీయంగా ఉంటాయి. సహజంగా దొరికే రంగురంగుల ఆహారపదార్థాల్లో నచ్చిన వాటిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండటం వల్ల వైవిధ్య భరితమైన విభిన్న తరహా ఆహారాలతో, అవి అందించే విభిన్న పోషకాలతో ఆరోగ్యం బాగుంటుంది.
∙ శాకాహారం తేలికగా జీర్ణమవుతుంది. కూరగాయలు, గింజలు, ఆకుకూరలతో కూడిన ఆహారంలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మొలలు, స్థూలకాయం, డయాబెటిస్, మలబద్ధకం, హయటస్ హెర్నియా, డైవర్టిక్యులైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిప్పి పళ్లు (డెంటల్ కేరిస్), పిత్తాశయంలో రాళ్లు వంటి అనేక వ్యాధుల నివారణ స్వాభావికంగానే జరుగుతుంది.
∙పప్పులు, గింజలు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో కూడిన శాకాహారంతో ఆరోగ్యానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల తరచుగా వీటిని తీసుకునేవారు స్థూలకాయం బారిన పడకుండా ఉంటారు. అంతేకాదు, యాంటీ ఆక్సిడెంట్లు మేని మెరుపును కాపాడతాయి. పండ్లు ఆకుకూరలు తరచూ తినేవారికి స్థూలకాయం వల్ల తలెత్తే డయాబెటిస్, హైబీపీ వంటి సమస్యలు కూడా చాలావరకు ఉండవు. పండ్లు, ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజలవణాలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. శాకాహారం వల్ల పిప్పిపళ్లు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా అరుదు.