ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, వేములవాడ( రాజన్న సిరిసిల్ల): కంటికి కనబడని కరోనా రక్కసి విళయతాండవం చేస్తోంది. సామాన్యుడు మొదలు కొని నాయకుల వరకు ఎవరినీ వదలిపెట్టని ఈ రోగం, మానవాళికే సవాలు విసురుతోంది. ఆసుపత్రిలో కరోనాతో మృత్యువాత పడిన తమ వారిని చూసేందుకు కుటుంబసభ్యులు, రక్త సంబధీకులు వెనుకాడే పరిస్థితి. మృతదేహాన్ని ముట్టుకోవడానికి వీలులేకపోవడంతో కాష్టం పేర్చి, దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేయలేని దుస్థితి నెలకొంది. మున్సిపల్ సిబ్బందే శ్మశానవాటికలకు తరలించి దహనసంస్కారాలు చేస్తుంటే కళ్లవెంట కన్నీరు కార్చడం తప్ప, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తోంది.
అద్దె మనుషులతో అంతిమ సంస్కారం
కరోనాతో మృతిచెందిన తమ కుటుంబసభ్యుల అంతిమ సంస్కారాలను అద్దె మనుషులతో పూర్తిచేయించాల్సి వస్తోంది. దహన సంస్కారాలను సెల్‌ఫోన్‌లో వీడియో తీసి, బంధువులకు పంపించి బోరున విలపిస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటూ మృతి చెందిన వారి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఇంటి యజమాని శవాన్ని ఇంటివరకు కూడా అనుమతించకపోవడంతో అనాథ శవంలాగే అంత్యక్రియలు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆస్తులు, అంతస్తులు, కుటుంబసభ్యులు ఎంతమంది ఉన్నా కరోనాతో మృతిచెందితే అనాథగా మరుభూమికి తరలుతున్నారు. అందరం ఉన్నా అనాథ శవంగానే వెళ్లిపోయావా అంటూ రోదనలే తప్ప, ఏమీ చేయలేని స్థితి. ఇలాంటి ఘటనలు మనుషుల్లో మానవత్వం మంటగలిసిందా అనే అనుమానాన్ని కలిగించేలా ఉన్నాయి.
దూరమవుతున్న బంధుత్వాలు
కరోనా కేసులు పెరగడంతో బంధుత్వాలు దూరమవుతున్నాయి. కనబడని కరోనా రోగం కుటుంబాలను కకావికళం చేస్తోంది. సెల్‌ఫోన్‌లోనే మాట్లాడుకుంటూ ఒకరిఒకరు ఓదార్చుకుంటున్నారు. ఇండియాలో రోజురోజుకు మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఉపాధికోసం గల్ఫ్ వెళ్లిన కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని వైద్యులు కోరుతున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కరోనా పై విజయం సాధించడానికి ప్రభుత్వానికి సహకరిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment