సాక్షి, సెంట్రల్ డెస్క్ : తాత, నానమ్మకు వ్యాక్సిన్ ఇచ్చేశారు.. నాన్మ, అమ్మ తీసేసుకుంటున్నారు.. అన్నయ్యకూ రేపోమాపో ఇచ్చేస్తామంటున్నారు. మరి మా పరిస్థితి ఏమిటి? 10 ఏళ్ల బిట్టూగాడి మైండ్‌లో ఇదే డౌట్. నాన్నా.. మాకెప్పుడిస్తారు అంటూ మొదలుపెట్టేశాడు. అటు బిట్టూగాడి తండ్రి సుబ్బారావుకేమో ఏం చెప్పాలో తోచడం లేదు. ఈ సెకండ్‌వేవ్‌లో పెద్దల స్థాయిలో కాకున్నా.. పిల్లలు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. మరోవైపు పిల్లల వ్యాక్సిన్ తయారీ దిశగా కూడా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎందరో బిట్టూలు.. మరెందరో సుబ్బారావుల సందేహాలను తీర్చే కథనమిదీ..
వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం.. ఈ ఏడాది మే 4వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా 117 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు. 18 ఏళ్లకన్నా తక్కువ వయసున్న వారికి వ్యాక్సిన్లు వేయడం లేదు. ప్రస్తుతం పిల్లలకు కరోనా నుంచి ఎలాంటి ప్రమాదం లేకున్నా.. వారి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని, అందువల్ల పిల్లలకు వ్యాక్సిన్ వేయగలిగినప్పుడే కరోనాను పూర్తిగా నియంత్రించడం సాధ్యమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
పిల్లల వ్యాక్సిన్ విషయంలో ఇబ్బందులేంటి?
వ్యాక్సిన్ల విషయంలో పిల్లలందరినీ ఒకే గాటన కట్టడానికి వైద్య పరంగా వీలు కాదు. పిల్లల్లో వారి వయసును బట్టి రోగ నిరోధక వ్యవస్థ పనిచేసే తీరు వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఆరేళ్ల పిల్లాడికి, 16 ఏళ్ల పిల్లాడికి మధ్య ఇమ్యూనిటీలో చాలా తేడా ఉంటుంది. పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల కూడా వయసును బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఈ విషయాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్ వారిపై ఎలా పనిచేస్తుందన్నది నిర్ధారించాల్సి ఉంటుంది.
వేరేగా వ్యాక్సిన్లు తయారు చేయాలా?
పిల్లలకైనా, పెద్దవారికైనా వ్యాక్సిన్లలో మాలిక్యులర్ స్ట్రక్చర్ (పదార్థ నిర్మాణం) దాదాపుగా ఒకటే ఉంటుంది. అయితే పిల్లల వయసును బట్టి ఎంత డోసు వేయాలి? దానివల్ల ఫలితం ఎలా ఉంటుంది? అన్నది తేల్చాలి. పెద్ద వాళ్లతో పోలిస్తే.. పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగాలను నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్నది. ఇందుకు చాలా కఠినమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వేర్వేరు వయసులకు, వేర్వేరు డోసులతో అత్యంత కచ్చితత్వంతో పరిశీలన జరపాల్సి వస్తుంది.
వ్యాక్సిన్ దిశగా అడుగులు
12 నుంచి 15 ఏళ్ల మధ్య (టీనేజ్) పిల్లలపై ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు ఈ ఏడాది మార్చిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాయి. వారిలో వ్యాక్సిన్ వంద శాతం సామర్థ్యంతో పనిచేసిందని, యాంటీబాడీస్ కూడా బాగా ఉత్పత్తి అయ్యాయని ప్రకటించింది. టీనేజ్ పిల్లలకు వ్యాక్సిన్ వేయడంపై ఫైజర్ సంస్థ ఇప్పటికే యూరోపియన్ యూనియన్‌కు, అమెరికాకు దరఖాస్తు చేసుకుంది. దానికి త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉంది. కెనడాలో అయితే ఇప్పటికే ఈ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇచ్చారు.
మరికొన్ని వ్యాక్సిన్లు కూడా..
► మోడెర్నా సంస్థ 12–17 ఏళ్ల మధ్య వారికి.. ఆరు నెలల నుంచి 12 ఏళ్ల మధ్య వయసు వారికి ట్రయల్స్ నిర్వహిస్తోంది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ 12–17 ఏళ్ల మధ్య వయసు వారికి వ్యాక్సిన్‌పై ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఆక్స్‌ఫర్డ్–ఆస్ట్రాజెనికా పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ మొదలుపెట్టింది. అయితే ఈ కంపెనీ పెద్దవాళ్ల వ్యాక్సిన్‌తో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్న వార్తలతో ఆపేసింది.
► నోవావ్యాక్స్ కూడా 12 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 3 వేల మంది పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఫైజర్ 12 ఏళ్లుపైబడిన పిల్లలకు వ్యాక్సిన్‌ను ఇప్పటికే సిద్ధం చేయగా.. ఆరు నెలల నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు వ్యాక్సిన్‌పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.
మన దేశంలో పరిస్థితి ఏంటి?
మన దేశంలో కూడా కోవిడ్ వ్యాక్సిన్లు పిల్లల్లో ఎలా పనిచేస్తాయి? వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న దానిపై క్లినికల్ ట్రయల్స్ మొదలుపెడుతున్నట్టు ఇటీవలే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లతో త్వరలోనే పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ కంపెనీలు కొద్దినెలల కిందే ట్రయల్స్‌కోసం దరఖాస్తు చేసుకున్నా.. సామర్థ్యం, భద్రతపై మరింత డేటా కావాలని కేంద్రం కోరింది. ఈ మేరకు కంపెనీలు ఇటీవలే డేటా అందించాయి. సోకిడ్స్.. బి రెడీ..
చదవండి: కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment