ప్రైవేటు జలగలు..!  | Coronavirus: Private Hospitals Collects High Fee From Patients In Adilabad | Sakshi
Sakshi News home page

ప్రైవేటు జలగలు..! 

Published Tue, Sep 1 2020 10:34 AM | Last Updated on Tue, Sep 1 2020 10:34 AM

Coronavirus: Private Hospitals Collects High Fee From Patients In Adilabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అతని పేరు రమేశ్‌ (పేరు మార్చాం). వయస్సు 40 సంవత్సరాలు.. జిల్లాకేంద్రంలోని భుక్తాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల కాలనీలోకి 104 అంబులెన్స్‌ రావడంతో కోవిడ్‌ టెస్టు చేయించుకున్నాడు. ఫలితం పాజిటివ్‌ రావడంతో హైరానా పడ్డాడు. పట్టణ శివారులో ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. అందులో రెండు రోజులు ఉండేసరికి రూ.53వేల బిల్లు వేయడంతో ఖంగు తిన్నాడు. రెండు రోజులకు బెడ్‌ చార్జీల కింద రూ.31వేలు, మందులకు రూ.13వేలు, ల్యాబ్‌ టెస్టుల కోసం రూ.4వేలు, డీసీ చార్జీల కింద రూ.5వేల బిల్లు వేశారు. మామూలు చికిత్స అందజేసి ఇంత బిల్లు చేతిలో పెట్టడంతో ఈ చికిత్స కంటే ఇంట్లో ఉన్నది నయం అనుకొని బిల్లు కట్టి అక్కడి నుంచి బయల్దేరాడు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇదీ జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రి నిర్వాహకులు కరోనా బాధితులను పట్టి పీడిస్తున్న తీరు.

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో కరోనా సోకిన వారికి జిల్లాకేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రితోపాటు ఉట్నూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. జిల్లాకేంద్రంలో నాలుగు కోవిడ్‌ కేర్‌ సెంటర్లు కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇటీవల జిల్లాకేంద్రంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి కరోనా చికిత్స కోసం ప్రభుత్వం అనుమతినిచ్చింది. అందులో సాధారణ బెడ్లతో పాటు ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు కూడా ఉన్నాయి. అయితే కరోనా చికిత్సకు ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్తున్న వారికి బిల్లు చుక్కలను చూపిస్తుంది. రెగ్యులర్‌ బెడ్లకే ఒక్కరోజుకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తుండడంతో బాధితులు ఖంగు తింటున్నారు. దీంతో ఒకట్రెండు రోజులకే తడిసి మోపెడైన బిల్లును చూసి హైరానా చెంది బిల్లు కట్టేసి అక్కడి నుంచి బయట పడుతున్నారు. ఇక ఆక్సిజన్, ఐసీయూ బెడ్లకు రెట్టింపు చార్జీలు వసూలు చేయడం ద్వారా కరోనా బాధితుల నడ్డి విరుస్తున్నారు. అడ్డగోలుగా ఈ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పేరిట బిల్లులు వేస్తుండగా ప్రభుత్వ నియంత్రణ ఉందా.. ? లేదా ? అన్న అనుమానం కరోనా బాధితుల్లో వ్యక్తమవుతోంది. 

ప్రభుత్వ ఆస్పత్రులు కాదని చేరిక..
ఆదిలాబాద్‌ వంటి వెనుకబడిన జిల్లా ప్రైవేట్‌ ఆస్పత్రిలో భారీ స్థాయిలో బిల్లులు వసూలు చేస్తుండటం చోద్యంగా కనిపిస్తోంది. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉండే ఈ ప్రాంతంలో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స ద్వారా కొద్దిపాటి ఖర్చుతో కరోనా నుంచి విముక్తి పొందాలని ఆశతో వస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. అనేకమంది కరోనా బాధితులు అయోమయంతో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ కేర్‌ సెంటర్లు కాదని ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లి జేబులను గుల్ల చేసుకుంటున్నారు. అనంతరం హోం ఐసోలేషన్‌లో ఉండి కూడా ప్రభుత్వం సరఫరా చేసే మందులు తీసుకోవడం ద్వారా నయం కావచ్చని భావిస్తూ ప్రైవేట్‌ ఆస్పత్రి నుంచి ఒకట్రెండు రోజుల్లోనే బయట పడుతున్నారు. ఆస్పత్రిలో ధరల పట్టిక ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ ఆస్పత్రి నిర్వాహకులు ఏర్పాటు చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్య శాఖాధికారులు కూడా దీనిపై నియంత్రణ లేకపోవడం, ‘మామూలు’గా తీసుకోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. 

లెక్కల గజిబిజి..
జిల్లాలో ఆదివారం వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 1699. అందులో యాక్టివ్‌ కేసులు 788. దీంట్లో 87 మంది రిమ్స్‌లో, ముగ్గురు హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో, 698 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆదిలాబాద్‌ హెల్త్‌ బులిటెన్‌లో తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఉన్నవారి సంఖ్య ఈ లెక్కల్లో లేకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది. ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్తున్నవారు కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ టెస్టింగ్‌ సెంటర్లలో చేసుకుంటున్నారా..? లేనిపక్షంలో దొడ్డిదారిన ప్రైవేట్‌ ఆస్పత్రిలో నిర్వహించే సెంటర్లలో చేయించుకుంటున్నారా ?అన్న అనుమానాలు లెక్కల గజిబిజి కారణంగా తలెత్తుతున్నాయి.

అనుమతి లేకుండానే పరీక్షలు..
జిల్లాకేంద్రంలోని స్టేషన్‌ రోడ్డు ప్రాంతంలో ఓ నర్సింగ్‌హోమ్‌లోని ల్యాబరేటరీలో అనుమతి లేకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్‌ ల్యాబరేటరీలకు అనుమతినివ్వలేదు. ప్రభుత్వం ర్యాపిడ్‌ యాంటీజన్‌ టెస్టుల కోసం అర్బన్‌ పీహెచ్‌సీలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కిట్లను సరఫరా చేసింది. ఈ కిట్లు ప్రైవేట్‌ ల్యాబరేటరీలకు చేరడం వెనక ఎవరి హస్తం ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ప్రైవేట్‌లో ఫుల్‌.. 
కరోనా చికిత్సకు రిమ్స్, ఉట్నూర్‌ ఆస్పత్రి, ప్రైవేట్‌ ఆస్పత్రిలో సాధారణ బెడ్లు, ఆక్సిజన్‌ బెడ్లు, ఐసీయూ బెడ్లు ఉన్నట్లు హెల్త్‌ బులిటెన్‌లో వివరించారు. రిమ్స్‌లో అన్ని బెడ్లు కలిపి 320 ఉన్నాయి. వీటిలో 74 భర్తీ కాగా, 246 ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఆక్సిజన్‌ బెడ్లు 270కు గాను 206 ఖాళీగా ఉన్నాయి. ఐసీయూ బెడ్లు 50కి గాను 40 ఖాళీ ఉన్నాయి. ఇక ఉట్నూర్‌ ఆస్పత్రిలో అన్ని బెడ్లు కలిపి 80కి అన్ని ఖాళీగానే ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ బెడ్లు 3 ఉండగా, మూడు భర్తీ అయ్యాయి. ఇక ఐసీయూ బెడ్లు 18 ఉండగా, అన్ని నిండిపోయాయి. రెగ్యులర్‌ బెడ్లు మాత్రం 15కు అన్ని ఖాళీగా ఉన్నాయి.

వివరాలు.. 

  •      రిమ్స్‌లో సీబీనాట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
  •      5 అర్బన్‌ పీహెచ్‌సీలు, 22 గ్రామీణ పీహెచ్‌సీలు, ఉట్నూర్‌ ఆస్పత్రి, బోథ్‌ ఆస్పత్రి, రిమ్స్‌లో యాంటీజన్‌ టెస్టులు చేస్తున్నారు.
  •      కరోనా సోకిన వారికి రిమ్స్‌ ఆస్పత్రి, ఉట్నూర్‌ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్, పోస్టుమెట్రిక్‌ మైనార్టీ హాస్టల్, మైనార్టీ హాస్టల్‌ బాయ్స్‌–1, మైనార్టీ హాస్టల్‌ బాయ్స్‌–2లో కోవిడ్‌ కేర్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 350 పడకలు ఉన్నాయి. 
  •      జిల్లాలో ప్రస్తుతం ఆదిలాబాద్‌అర్బన్, మావల, ఇంద్రవెల్లి, బోథ్‌లలో కలిపి 15 క్లస్టర్‌ కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయి.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనా చికిత్సకు ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు  తీసుకుంటాం. ఒక టీమ్‌ను పంపించి పరిశీలన చేస్తాం. స్టేషన్‌ రోడ్డులో ఓ ల్యాబరేటరీలో పరీక్షలు చేస్తున్నట్లు కూడా మా దృష్టికి రాలేదు. ఇక కరోనా సోకిన వారు మామూలు లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్‌లోనే ఉండి ప్రభుత్వం అందజేసే చికిత్స తీసుకోవాలి. వైరస్‌ తీవ్రత ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాలి. – డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్, డీఎంహెచ్‌వో 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement