సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి 50 ఏళ్లు పైబడిన, ఆ లోపు వయసుగల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా టీకా వేసేందుకు పేర్ల నమోదుపై గందరగోళం నెలకొంది. వారి పేర్లను కోవిన్ యాప్‌లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్నాకే టీకా వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేస్తున్నారు. త్వరలో రెండో డోసు మొదలుకానుంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే 50 ఏళ్లు పైబడిన, 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ వేయనున్నారు.
లబ్ధిదారుల గుర్తింపు సవాల్...
రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మందికి మొదటి విడత టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించగా అందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది దాదాపు 3 లక్షల మందిని గుర్తించారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర ఫ్రంట్‌లైన్ కార్మికులు దాదాపు 2 లక్షల మంది ఉంటారు. వారికి వ్యాక్సినేషన్ జరుగుతోంది. వారు కాకుండా మిగిలిన వారంతా 50 ఏళ్లు పైబడిన వారు, ఆలోపు వయసుగల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు. అంటే 75 లక్షల మందికి వచ్చే నెల నుంచి టీకా వేయాల్సి ఉంది. కానీ వారి జాబితా తయారీపై ఇప్పటివరకు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించలేదు. కోవిన్ యాప్‌లో పేర్లు ఎలా నమోదు చేయాలో మార్గదర్శకాలను కేంద్రం పంపించలేదు. వారిని గుర్తించడం అత్యంత సంక్లిష్టమైన వ్యవహారమని వైద్య, ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. ఈ సమస్యలను అధిగమించి జాబితా ఎలా తయారు చేయాలో కూడా అధికారులకు స్పష్టత లేదు.
సులభతరం అన్నప్పటికీ...
వ్యాక్సిన్ లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం సులభతరం చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గతంలో పేర్కొన్నారు. కోవిన్ యాప్‌లో పేర్లను ఎవరికి వారు రిజిస్ట్రేషన్‌న్ చేసుకోవాలని మొదట్లో సూచించారు. అలాగే పీహెచ్‌సీలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ–సేవ కేంద్రాల్లో లబ్ధిదారులు పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. అందుకోసం పీహెచ్‌సీల్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఆ ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదు. 50 ఏళ్లు పైబడిన వారు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని, ఆ పత్రం లేనివారు ఓటర్ గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ వంటివి తెస్తే యాప్‌లో అప్‌లోడ్ చేసి వారి పేర్లను నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment