‘కామ్‌’గా నెట్టేసి.. కోట్లు కొట్టేసి | Cyber criminals in Telangana | Sakshi
Sakshi News home page

‘కామ్‌’గా నెట్టేసి.. కోట్లు కొట్టేసి

Jul 10 2024 5:28 AM | Updated on Jul 10 2024 5:28 AM

Cyber criminals in Telangana

సాక్షి, హైదరాబాద్‌: ఒక వెబ్‌సైట్‌ అడ్రస్‌కు సంబంధించి చివరలో ఉండే .కామ్‌కు బదులు .నెట్‌ ఎంటర్‌ చేస్తే ఏమవుతుంది? ఆ సైట్‌ తెరుచుకోకపోవడమో లేదా మరో సైట్‌కు కనెక్ట్‌ కావడమో జరుగుతుంది. అయితే అకౌంట్‌ టేకోవర్‌ ఫ్రాడ్స్‌లో ఇలా జరిగితే మాత్రం భారీగా ఆర్థిక నష్టం వస్తుంది. నగరానికి చెందిన వ్యాపారవేత్తలు, సంస్థలు తరచూ ఈ నేరాల బారినపడుతున్నాయి.

ఇలాంటి ఓ ఈ–మెయిల్‌ను నమ్మిన రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఇటీవల ఏకంగా రూ.11.4 కోట్లు సైబర్‌ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేసింది. అమెరికాకు చెందిన బ్యాంకు అప్రమత్తతతో ఈ మొత్తం సేఫ్‌గా ఉన్నా, రాజధాని కేంద్రంగా తరచూ ఈ అకౌంట్‌ టేకోవర్‌ ఫ్రాడ్స్‌ జరుగుతున్నట్టు చెబుతున్న తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ కేవీఎం.ప్రసాద్‌ ఆన్‌లైన్‌ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

బాధితులుగా మారేది వ్యాపారులు, సంస్థలే..
అకౌంట్‌ టేకోవర్‌గా పిలిచే ఈ సైబర్‌ నేరాల్లో ఒకప్పుడు బాధితులంతా ఉత్తరాదిలో ఉన్న వ్యాపారులే ఉండేవారు. ఆపై హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ తరహా నేరాలు జరుగుతున్నాయి. ఈ సైబర్‌ నేరం చేయడానికి తొలుత నైజీరియన్లు గ్రూపులుగా ఏర్పడి వ్యాపార/ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ–మెయిల్‌ ఐడీలను గుర్తించి హ్యాక్‌ చేస్తారు. 

అందులో ఉండే లావాదేవీలతోపాటు వారి భాషాశైలి, చెల్లింపులు/వసూళ్ల విధానాన్ని కొంతకాలం పాటు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రధానంగా ఇంపోర్ట్‌–ఎక్స్‌పోర్ట్‌ వ్యాపారం చేసే వారే ఎక్కువగా టార్గెట్‌ అవుతున్నారు. హ్యకింగ్‌ చేసిన తర్వాత ఏ దశలోనూ సదరు వ్యాపారికి అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు.  

చిక్కకుండా ఉండేందుకు జాగ్రత్తలు
అకౌంట్‌ టేకోవర్‌ స్కామ్స్‌లో టార్గెట్‌ చేసిన సంస్థ నుంచి డబ్బు డిపాజిట్‌ చేయించుకోవడానికి బ్యాంకు ఖాతాలు ఎంతో కీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలు ఉంటాయి. ఇలా కాకుండా ఉండేందుకు ఇక్కడివే, బోగస్‌ చిరునామాలతో ఉండేవి తప్పనిసరి. దీనికోసం నైజీరియన్లు భారీ పథక రచన చేస్తున్నారు. నకిలీ పత్రాలతో వీటిని తెరుస్తున్నారు. రాయదుర్గంలోని ఫార్మా స్యూటికల్‌ సంస్థ నుంచి రూ.11.4 కోట్లు కాజేయడానికి ప్రయతి్నంచిన నేరగాళ్లూ ఇలానే చేశారు.

అయితే నగదు రిసీవ్‌ చేసుకునే సంస్థ పేరుతోనే బ్యాంకు ఖాతా తెరవడం సాధ్యం కాలేదు. కొద్దిగా మార్పులతో కూడిన పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఆ పేరుతో ఖాతా తెరిచారు. రాయదుర్గం సంస్థ నుంచి వెళ్లిన నగదును అమెరికాలోని బ్యాంకు నేరుగా ఈ ఖాతాలోకి బదిలీ చేయాల్సి ఉండగా, కంపెనీ పేరుతో ఉన్న మార్పును గమనించి ఆ మొత్తాన్ని హోల్డ్‌లో పెట్టింది. దీంతో రూ.11.4 కోట్లు నేరగాళ్ల పాలు కాకుండా ఆగాయి.  

చిన్నచిన్న మార్పులతో మెయిల్‌ ఐడీలు...
సైబర్‌ నేరగాళ్లు ఇలా హ్యాక్‌ చేసిన ఈ–మెయిల్‌ను నిరంతరం అధ్యయనం చేయడం ద్వారా వారికి డబ్బు రావాల్సి, చెల్లించాల్సిన సమయం వచ్చే వరకు వేచి చూస్తున్నారు. సరైన టైమ్‌లో నగదు రిసీవ్‌ చేసుకునే సంస్థ పేరును పోలిన, అదే యూజర్‌ నేమ్‌తో కూడిన, ఆఖరులో ఉండే .కామ్, .నెట్‌ తదితరాలను మార్చి ఈ–మెయిల్‌ ఐడీలు క్రియేట్‌ చేస్తున్నారు. వీటిని వినియోగించి నగదు పంపాల్సిన సంస్థకు నగదు రిసీవ్‌ చేసుకునే సంస్థ నుంచి వచి్చనట్టే ఈ–మెయిల్‌ పంపుతున్నారు. 

అందులో ఆడిటింగ్, ఫైనాన్షియల్‌ ఇయర్‌ ఎండింగ్‌లతోపాటు సాంకేతిక కారణాలను వివరిస్తూ..నిత్యం నగదు బదిలీ చేసే బ్యాంక్‌ ఖాతాకు కాకుండా మరో దానికి పంపాల్సిందిగా కోరుతున్నారు. రాయదుర్గంలోని ఫార్మా స్యూటికల్‌ సంస్థ విషయంలో ఇలానే జరిగింది. ఈ సంస్థకు ముడిసరుకు సరఫరా చేసే అమెరికన్‌ సంస్థను పోలిన ఈ–మెయిల్‌ ఐడీ సృష్టించారు. అసలు దానికి చివరలో .కామ్‌ ఉంటుంది. అయితే సైబర్‌ నేరగాళ్లు .నెట్‌తో ముగిసేలా మరోటి సృష్టించారు. దీని ఆధారంగా మెయిల్‌ పంపి రూ.11.4 కోట్లకు సమానమైన అమెరికన్‌ డాలర్లు తమ ఖాతాల్లో వేయించుకున్నారు.  

సరిచూసుకోకుంటే నష్టపోవాల్సిందే  
అకౌంట్‌ టేకోవర్‌ నేరాల్లో ప్రతి ఏడాది నగరానికి చెందిన వ్యాపారులు, వ్యాపార సంస్థలు రూ.లక్షలు, కోట్లల్లో నష్టపోతున్నారు. ఈ–మెయిల్స్‌ విషయంలో చాలామంది దాన్ని పంపిన యూజర్‌ నేమ్‌ చూసి ఎదుటివారు తమ వారే అని భావిస్తారు. అనేక ఈ–మెయిల్‌ ఖాతాలకు ఒకే యూజర్‌ నేమ్‌ ఉండవచ్చు. అందులో ప్రధానంగా యూజర్‌ ఐడీని చూడాలి. ఈ–మెయిల్స్‌ అవి పంపిన సంస్థల నుంచి వచి్చనట్టు ఉన్నా.. ఆఖరులో .కామ్‌ ఉందా? .నెట్‌ ఉందా? అనేది క్షుణ్ణంగా గమనించాలి. సైబర్‌ నేరగాళ్లు ఎక్కువగా ఇంటర్‌ నెట్‌లో ఫ్రీగా దొరికే  ‘.ఓఆర్‌జీ’తో కూడినవి తయారు చేసి వాడతారు. ఈ తరహా నేరాల్లో నిందితులు చిక్కడం, నగదు రికవరీ కావడం కష్టసాధ్యం. - కేవీఎం.ప్రసాద్, డీఎస్పీ,తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో

అకౌంట్‌ టేకోవర్‌ నేరాల్లో నష్టపోయిన కొన్ని సంస్థలు...
* 2020 జూలై కేపీసీ ఇన్‌ఫ్రా, హైదరాబాద్‌ రూ.9.9లక్షలు
* 2020 అక్టోబర్‌ పోకర్ణ ఇంజనీరింగ్‌ స్టోన్‌ లిమిటెడ్‌ రూ.2.09లక్షలు
* 2021 ఫిబ్రవరి హేమా ఎల్రక్టానిక్స్, సికింద్రాబాద్‌ రూ.లక్ష
* 2021 జూన్‌ నిర్మా సిన గ్లాస్‌ కంపెనీ, మాసబ్‌ట్యాంక్‌ రూ.55లక్షల స్వాహాకు యత్నం 
* 2022 ఏప్రిల్‌ అమీర్‌పేటకు చెందిన ఓ సంస్థ రూ.1.19కోట్లు
* 2022 జూలై నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.64లక్షలు
* 2023 ఫిబ్రవరి హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సంస్థ, బంజారాహిల్స్‌ రూ.1.16కోట్లు
* 2023 మార్చి ఏబీఆర్‌ ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ, బాగ్‌అంబర్‌పేట రూ.7లక్షలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement