సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ చలానా నుంచి తప్పించుకోవడానికి జనాలు ఎలాంటి వింత వింత వేషాలు వేస్తున్నారో కొద్ది రోజుల క్రితమే చెప్పుకున్నాం. చలానా పడకూడదనే ఉద్దేశంతో ఓ మహిళ తన కాలును నంబర్ ప్లేట్‌కు అడ్డంగా పెట్టి.. ఎలా బుక్కయ్యిందో చూశాం. సాధారణంగా ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వంటివి చేస్తే ట్రాఫిక్ అధికారులు 1,000 రూపాయలలోపే జరిమానా విధిస్తారు. కానీ సదరు మహిళ ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్‌ని కనిపించకుండా కాలు అడ్డుపెట్టడంతో ట్రాఫిక్ అధికారులు ఏకంగా 2,800 రూపాయలు చలానా విధించారు. అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ సీన్‌ని మీమ్‌గా ఉపయోగించి చేసిన ఈ ట్వీట్ తెగ వైరలయ్యింది.
తాజాగా ఇప్పుడు మరో కొత్త మీమ్‌తో ముందుకు వచ్చారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ వంచితే బెండు తీస్తామని.. క్రిమినల్ కేసు ఫైల్ చేస్తామని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. ఈ సారి దీనికి రామ్ ‘రెడీ’ సినిమాను ఎంచుకున్నారు. బ్రహ్మానందం, రామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాంబినేషన్‌లో వచ్చే సీన్‌ను మీమ్‌గా వాడారు. నంబర్ ప్లేట్ వంచి ప్రయాణం చేస్తున్న ఓ బైక్ ఫోటోతో పాటు ఈ మీమ్‌ని షేర్ చేశారు. ఆ బైక్ ఓనర్ గురించి పబ్లిక్- ‘‘వాడి పాపాన వాడే పోతాడు వదిలేయండి’’ అంటే.. బైక్(బ్రహ్మానందం).. ‘‘వాడి పాపాలకి నేను పోయేలా ఉన్నాను సార్’’ అంటూ షేర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం తెగ వైరలుతోంది. నవ్వు తెప్పిస్తూనే.. జనాల్లో ఆలోచన కలిగేలా ట్వీట్ చేయడంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ వంచడం/దాచడం నేరం. ఇందుకు వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయబడును. pic.twitter.com/iGr6C21XSX
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 8, 2021
Comments
Please login to add a commentAdd a comment