వృద్ధురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సర్పంచ్
చంటి పిల్లలు తప్పటడుగులు వేస్తూ కిందపడిపోతే తల్లిదండ్రుల మనసు ఎంత తల్లడిల్లిపోతుందో అందరికీ తెలిసిందే.. అలాంటిది జన్మనిచ్చిన వారిని అవసాన దశలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నపేగులు కాఠిన్యం ప్రదర్శించాయి. కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే కూతురు ఓ తల్లిని ఇంటినుంచి గెంటేయగా.. కుమారులు కొన్నేళ్లుగా ఆమె ఆలనా పాలననే విస్మరించారు. ఈ దారుణ ఘటన త్రిపురారం మండల కేంద్రంలో శుక్రవారం వెలుగుచూసింది.
సాక్షి, త్రిపురారం (నాగార్జునసాగర్): మండల కేంద్రంలోని బాబు సాయిపేట రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కులవృత్తి చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసి వివాహాలు జరిపించారు. ఓ కుమారుడు, కూతురు అక్కడే ఉంటుండగా మరో కుమారుడు బతుకుదెరువు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వలస వెళ్లాడు. కాగా, కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మృతిచెందాడు. అప్పటినుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఉన్న ఆస్తిపాస్తులు పంచుకుని తల్లి ఆలనా పాలనను కుమారులు విస్మరించారు. దీంతో ఆ వృద్ధురాలు కొన్నేళ్లుగా మండల కేంద్రంలోనే ఉంటున్న కుమార్తె వద్ద ఆశ్రయం పొందుతోంది.
వైరస్ సోకిందని...
కొద్ది రోజులుగా సదరు వృద్ధురాలు స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో గురువారం సాయంత్రం పాజిటివ్ అని తేలింది. ఆ విషయం తెలుసుకున్న కుమార్తె తల్లిని ఇంట్లోకి రానివ్వకుండా చెట్టు కొమ్మలు అడ్డు వేసుకుంది. దీంతో రాత్రంతా చలికి వణుకుతూ.. ఆకలికి అలమటిస్తూ ఆ.. అభాగ్యురాలు చెట్టుకిందే గడిపింది.
సర్పంచ్ చొరవ తీసుకుని..
వృద్ధురాలి దీనస్థితిని శుక్రవారం ఉదయం స్థానికులు సర్పంచ్ శ్రీనివాసరెడ్డికి వివరించారు. వెంటనే స్పందించిన ఆయన వృద్ధురాలిని ఇంట్లోకి రానివ్వాలని నచ్చచెప్పినా కుమార్తె ఒప్పుకోలేదు. అటు ఆమె కుమారులను సంప్రదించినా ససేమిరా అన్నారు. దీంతో సర్పంచ్ చొరవ తీసుకుని ఆ వృద్ధురాలికి కుమార్తె ఇంటి సమీపంలోనే తాత్కాలిక ఆశ్రయం కల్పించి కడుపు నింపి భరోసా కల్పించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సరైన వైద్యసేవలతో పాటు న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment