
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో చితిపై మృతదేహం
ఇందల్వాయి/భిక్కనూరు: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం వల్ల మృతదేహాలు తారుమారయ్యాయి. మృతదేహాన్ని చితిపై ఉంచి నిప్పు పెట్టే సమయంలో ఆస్పత్రి నుంచి ఫోన్ రావడంతో ఆఖరి నిమిషంలో అంత్యక్రియలు ఆగిపోయాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన అంకం హన్మాండ్లు (58)కు కరోనా సోకడంతో నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. మూడు రోజుల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు 11 రోజుల క్రితం హైదరాబాద్‌లోని సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ హన్మాండ్లు గురువారం రాత్రి మృతి చెందాడు. అయితే, చికిత్సకు రూ.10 లక్షలకు పైగా బిల్లు కాగా, అది చెల్లించే వరకూ మృతదేహాన్ని ఇవ్వమని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం రోజంతా డబ్బు కోసం ఇబ్బందులు పడ్డారు. చివరకు శనివారం ఉదయం బిల్లు చెల్లించగా, కరోనా నిబంధనల మేరకు ఆస్పత్రి యాజమాన్యం మృతదేహాన్ని పూర్తిగా ప్యాక్ చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించింది.
చివరి నిమిషంలో ఆగిన అంత్యక్రియలు
మృతదేహాన్ని అంబులెన్సులో గన్నారం తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు.. చితి పేర్చి, దానిపై ఉంచారు. మరో రెండు నిమిషాల్లో చితికి నిప్పంటిస్తారనగా, అంబులెన్స్ డ్రైవర్‌కు ఆస్పత్రి యాజమాన్యం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మృతదేహాలు తారుమారయ్యాయని,, హన్మాండ్లు మృతదేహానికి బదులు మరొకరిది ఇచ్చినట్లు ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు ఫోన్‌లో తెలిపారు. దీంతో చివరి నిమిషంలో అంత్యక్రియలు ఆగిపోయాయి. మృతదేహాన్ని తిప్పి పంపించాలని ఆస్పత్రి సిబ్బంది కోరగా, కుటుంబ సభ్యులు నిరాకరించారు.
హన్మాండ్లు మృతదేహం తీసుకొచ్చే వరకూ ఈ మృతదేహాన్ని అప్పగించబోమని స్పష్టం చేశారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది మరో అంబులెన్స్‌లో హన్మాండ్లు మృతదేహాన్ని తరలించింది. సుమారు నాలుగు గంటల తర్వాత మృతదేహం గన్నారం చేరుకుంది. ప్యాకింగ్ తెరిచి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించగా.. వారు తమదేనని నిర్ధారించుకున్నారు. అప్పటికే చితిపై ఉంచిన మోహన్‌గౌడ్ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసి అంబులెన్స్‌లోకి మార్చి, హన్మాండ్లు అంత్యక్రియలు పూర్తి చేశారు.
నిర్లక్ష్యం వల్లే..
హన్మాండ్లు మృతదేహమని చెప్పి ఆస్పత్రి సిబ్బంది అప్పగించిన మృతదేహం కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన మోహన్‌గౌడ్‌ది. అతనికి కూడా కరోనా సోకడంతో సన్‌షైన్ ఆస్పత్రిలో చేర్చించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆస్పత్రి మార్చురీలో లేదు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన ఆస్పత్రి సిబ్బంది.. అసలేం జరిగిందని ఆరా తీయగా మృతదేహాలు తారుమారైనట్లు తేలింది.
ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
మృతదేహాలను మార్చి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సన్‌షైన్ ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని హన్మాండ్లు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. చికిత్స వివరాలు తెలపకుండా రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment