సాక్షి, హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించేది లేదంటూ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) ఝలక్ ఇచ్చింది. 2024–25 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి డిస్కంల వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్‌ఆర్), టారిఫ్ ప్రతి పాదన లు సమర్పించేందుకు జనవరి 31తో గడువు ముగిసింది. మరో మూడు నెలలు పొడిగించాలని డిస్కంలు చేసిన విజ్ఞప్తిని ఈఆర్‌సీ తోసిపుచ్చింది.
మల్టీ ఈయర్ టారిఫ్(ఎంవైటీ) రెగ్యులేషన్స్ ప్రకారం సత్వరమే ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాలని డిస్కంలకు ఆదేశించింది. ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు గడువులోగా సమర్పించడంలో విఫలమైతే డిస్కంలపై రోజుకు రూ.5000 చొప్పున జరిమానా విధించాలని ఎంవైటీ రెగ్యులేషన్స్ స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే రెండుసార్లు పొడిగింపు
ప్రతి ఏటా నవంబర్ 31లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు ఈఆర్‌సీకి డిస్కంలు సమర్పించాలి. దాని ఆధారంగా వినియోగదారులకు ఎన్ని మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయాలి? దానికి ఎంత అవుతుంది ? ప్రస్తుత విద్యుత్ టారిఫ్‌తోనే వినియోగదారుల నుంచి బిల్లులు వసూలు చేస్తే వచ్చే ఆదాయం ఎంత? అవసరమైన ఆదాయం, వచ్చే ఆదాయం మధ్య ఉండే వ్యత్యాసం(ఆదాయ లోటు) ఎంత? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సబ్సిడీలు పోగా, మిగిలే ఆదాయలోటు భర్తీ చేసేందుకు ఏ మేరకు విద్యుత్ చార్జీలు పెంచాలి ? వంటి అంశాలు ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనల్లో ఉంటాయి.
ఈ ప్రతిపాదనలపై ఈఆర్‌సీ రాత పూర్వకంగా అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు హైదరాబాద్, వరంగల్‌లో బహిరంగ విచారణ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ఆ సంవత్సరంలో వసూలు చేయాల్సిన విద్యుత్ టారి ఫ్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వినియోగదారుల కేటగిరీల వారీగా పెరిగిన/తగ్గిన విద్యుత్ చార్జీల పట్టిక ఇందులో ఉంటుంది.
గతేడాది నవంబర్ 31లోగా ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉండగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల పేరుతో అప్పట్లో డిస్కంలు డిసెంబర్ 2 వరకు గడువు పొడిగింపు పొందాయి. విద్యుత్ టారీఫ్ ఖరారుకు సంబంధించిన కీలకమైన మార్గదర్శకాలతో మల్టీ ఈయర్ టారిఫ్ రెగ్యులేషన్స్‌ను ఆ తర్వాత కాలంలో ఈఆర్‌సీ ప్రకటించింది. ఈ కొత్త మార్గదర్శ కాలపై అధ్యయనం జరిపి ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించడానికి జనవరి 31వరకు రెండోసారి గడువు పొడిగించింది.
డిస్కంల యాజమాన్యాలు తర్జనభర్జన
రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారింలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారులను సీఎండీలుగా నియమించింది. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి తోడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచడానికి అనుమతించినట్టు తప్పుడు సంకేతాలు పోతాయని ప్రభుత్వవర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది.
డిస్కంల ఆర్థిక నష్టాలు రూ.50,275 కోట్లకు, అప్పులు రూ.59,132 కోట్లకు పెరిగినట్టు ఇటీవల రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని అధికారులు అంటున్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ప్రతిపాదనలు సమర్పించే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment