మళ్లీ ఏఆర్‌ఆర్‌లు వాయిదా!
♦ ఐదోసారి గడువు పెంపు కోరిన డిస్కంలు
♦ ఈ నెల 20 వరకు పొడిగించాలని ఈఆర్‌సీకి లేఖ
♦ నేడు నిర్ణయించనున్న విద్యుత్ నియంత్రణ మండలి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనల సమర్పణకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు మరోసారి గడువు పెంపు కోరాయి. 2016-17కు సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)ను సమర్పించేందుకు సోమవారంతో గడువు ముగిసిపోగా.. ఈ నెల 20 వరకు మళ్లీ పొడిగించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి డిస్కంలు తాజాగా విజ్ఞప్తి చేశాయి. దీనిపై మంగళవారం ఈఆర్‌సీ నిర్ణయం తీసుకోనుంది.
ఉజ్వల్ డిస్కం యోజన (ఉదయ్) పథకంలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత భారం పంచుకోవాలి.. వచ్చే ఏడాది ఎన్ని నిధులు కేటాయించాలి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని డిస్కంలు భావిస్తున్నాయి. సీఎం ఖమ్మం పర్యటన తర్వాత ఏఆర్‌ఆర్‌లకు తుది రూపునిస్తామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉదయ్‌లో చేరితే రాష్ట్ర డిస్కంలపై ఉన్న రూ.12 వేల కోట్లకు పైగా అప్పుల భారంలో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
120 రోజుల నుంచి 40 రోజులకు..
ఏఆర్‌ఆర్‌లపై ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ, రిటైల్ టారీఫ్ ఆర్డర్ జారీ ప్రక్రియల కోసం కనీసం ఈఆర్‌సీకి 120 రోజుల సమయం ఉండాలని విద్యుత్ చట్టం పేర్కొం టోంది. ఈ లెక్కన గత నవంబర్‌తోనే ఏఆర్‌ఆర్‌ల దాఖలు గడువు ముగిసింది. ఉదయ్ పథకంలో చేరే అంశంపై నిర్ణయం కోసం ప్రభుత్వం వరుసగా నాలుగు సార్లు గడువు పొడిగింపు కోరింది. ఈ నెల 20 లోపు గడువు పొడిగిస్తే మాత్రం 40 రోజుల్లో ఈఆర్‌సీ ఏఆర్‌ఆర్‌లపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ, వాటిపై డిస్కంల వివరణ ఆ తర్వాత రిటైల్ టారీఫ్ ఆర్డర్ జారీ చేయాల్సి ఉంటుంది.