సురేశ్, రమేశ్ (ఫైల్)
సాక్షి, అర్వపల్లి (నల్లగొండ): పొట్టకూటి కోసం రాజస్థాన్ నుంచి ఇక్కడకు వచ్చి జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడుతోంది. ఒకే ఏడాది ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జోద్‌పూర్ ప్రాంతానికి చెందిన దేవాసి కైలాస్ అలియాస్ సురేశ్, దేవాసి చెన్నారాం అలియాస్ రమేశ్ సోదరులు.
వీరు చిన్న వయసులోనే బతుకు దెరువు నిమిత్తం ఇక్కడికి వచ్చి అర్వపల్లి మెయిన్‌రోడ్డులో రాజస్థాన్ టీస్టాల్, స్వీట్‌హౌస్ నడుపుతున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి 29న సురేశ్ బైక్‌పై నల్లగొండ జిల్లా శాలిగౌరారంనకు తన బంధువుల వద్దకు వెళ్లి టీపొడి తీసుకొని వస్తూ జాజిరెడ్డిగూడెం–మాదారం మధ్య హైవేపై రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు.
దీంతో కుటుంబ సభ్యులు స్థానికుల వద్ద రూ.1.20 లక్షలు చందాలు సేకరించి అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేసి వచ్చారు. ఆ తర్వాత సురేశ్ సోదరుడు రమేశ్ టీస్టాల్‌ను నడిపిస్తున్నాడు. వీరిద్దరు సోదరులు కూడా సేవాతత్పరులు కావడంతో స్థానికులు వారిని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. అయితే లాక్‌డౌన్, ఇతర సమయాల్లో ఇద్దరు సోదరులు ఎందరో పేదలకు తమ వంతు సాయమందించారు.
రాజస్థాన్‌లో మరో సోదరుడు..
కాగా, రమేశ్ 15 రోజుల క్రితం తల్లిదండ్రులను చూసేందుకు రాజస్థాన్‌లోని స్వగ్రామానికి వెళ్లాడు. అయితే పోయేటప్పుడు పెద్ద సోదరుడు మోహన్‌ను రాజస్థాన్ నుంచి ఇక్కడికి పిలిపించి టీస్టాల్ నడిపించమని చెప్పి వెళ్లాడు. అయితే ఆదివారం రాత్రి వారి స్వరాష్ట్రం రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు.
దీంతో విషయం తెలిసి స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఏడాది తిరక్కముందే ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇక్కడి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. కాగా వీరిద్దరి ఆధార్‌కార్డులు, రేషన్ కార్డులు ఇక్కడే తీసుకున్నారు.
చదవండి: రైల్వే కోచ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్
Comments
Please login to add a commentAdd a comment