World Mosquito Day: ఫీవర్‌ సర్వేలో.. డెంగీ కలకలం.. | Dengue Cases Increses In Karimnagar | Sakshi
Sakshi News home page

World Mosquito Day: ఫీవర్‌ సర్వేలో.. డెంగీ కలకలం..

Published Thu, Aug 19 2021 8:38 AM | Last Updated on Thu, Aug 19 2021 9:14 AM

Dengue Cases Increses In Karimnagar - Sakshi

కరీంనగర్‌లోని హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన రమాదేవికి ఈనెల 13న జ్వరం వచ్చింది. మొదటి కోవిడ్‌గా అనుమానించి నిర్ధారణ పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. జ్వరం తీవ్రంగా ఉండడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. రక్త పరీక్షలు చేయగా సీజనల్‌గా వచ్చే వైరల్‌ ఫీవర్‌గా నిర్ధారణ అయింది. దోమ కాటు వల్ల వచ్చిన జ్వరంతో నాలుగు రోజులపాటు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోగా.. రూ.10 వేల వరకు ఖర్చఅయింది. 

హైరిస్క్‌ ప్రాంతాలు..
నగరంలోని ఖాన్‌పురా, రాంనగర్, కార్ఖానగడ్డ, మార్కండేయనగర్, వావిలాలపల్లి, కట్టరాంపూర్‌తో పాటు దుర్శేడ్, అన్నారం, ఇందుర్తి, వెలిచాల, గర్శకుర్తి, గద్దపాక, జోగినపల్లి గ్రామాలను సీజనల్‌ వ్యాధులు సంభవించే హైరిస్క్‌ ప్రాంతాలుగా గుర్తించారు. జిల్లాలో 11 డెంగీ కేసులు నమోదు కాగా, జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కు చెందిన వంగల హన్మండ్లు(60) డెంగీతో జూన్‌ 30న మృతి చెందారు. మరో 10 డెంగీ కేసుల్లో కరీంనగర్‌లో 6, గ్రామాల్లో 4 కేసులు గుర్తించారు. 

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో విషజ్వరాలు క్రమంగా విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాణాంతక డెంగీ, మలేరియా కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ జిల్లాలో మొత్తం 11 కేసులు డెంగీ కేసులు నిర్ధారణ కాగా.. ఒకరు మరణించడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రెండు విషజ్వరాలతో చిన్న జ్వరం వచ్చినా జనాలు ప్రైవేటు ఆసుపత్రికి పరుగులు పెడుతున్నారు.

అక్కడ సాధారణ జ్వరానికి కూడా డెంగీ బూచిచూపి మరోవైపు టెస్టుల పేరుతో వారు దోపిడీకి తెరలేపుతున్నారు. మొత్తానికి చిన్న జ్వరం వచ్చినా.. జనాలు వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లాలో కరీంనగర్‌ జిల్లా చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.  ఈ విషజ్వరాలకు ప్రధాన కారణం పారిశుద్ధ్య లోపం, దోమల స్వైరవిహారం. జిల్లాల్లో ఇప్పటికీ పలు మారుమూల గ్రామాల్లో ఓపెన్‌ డ్రైనేజీ, మురికి కుంటలు, పందుల స్వైర విహారం వల్ల దోమల సంతతి పెరుగుతోంది. దీనికితోడు ఇటీవలి వర్షాలతో కుంటలు నిండి దోమల అమాంతం పెరిగాయి.

వాస్తవానికి జిల్లాల్లో దోమల సమస్య ఈనాటిది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమయంలోనూ కరీంనగర్‌ జిల్లా డెంగీ కేసుల్లో ముందున్న విషయం తెలిసిందే. కరోనా తరువాత ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో చాలా మార్పులు వచ్చాయి. పదే పదే శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవడం, శుభ్రమైన తాగునీరు తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం, జనసంచారం మీద ఆంక్షలతో డయేరియా, జ్వరాలు, చర్మవ్యాధులు గణనీయంగా తగ్గడం గమనార్హం. నెమ్మదిగా సెకండ్‌ వేవ్‌ నుంచి నెమ్మదిగా బయటపడుతున్న వేళ విషజ్వరాలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. శుక్రవారం(ఆగస్టు 20) ‘ప్రపంచ మస్కిటో దినోత్సవం’ సందర్భంగా దోమల వల్ల కలుగుతున్న ప్రాణాంతక జ్వరాలు, వాటి వెనక ఉన్న కారణాలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం.

పెరిగిన ఓపీ..!
సీజనల్‌ వ్యాధుల వల్ల వచ్చే జ్వరాలతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు నిండిపోతున్నాయి. వారం రోజులుగా జ్వరబాధితుల కేసులు ఎక్కువగా పెరిగిపోయాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ఓపీలకు వ్యాధిగ్రస్తులు క్యూ కడుతున్నారు. కోవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రతిరోజూ 150 మించి ఉండని ఓపీ సేవలు ప్రస్తుతం 300 వరకు ఓపీ పెరిగింది. జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ప్రైవేటు ఆసుపత్రులలో జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. ఇందులో ఏది డెంగీ, మలేరియా అన్న ఆందోళనతో జనాలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. 

కానరాని వైద్య శిబిరాలు..
జ్వర పీడితులు పెరుగుతున్న పట్టణంలోని స్లమ్‌ ఏరియాల్లో, గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేయాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇక పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్లు సమయపాలన పాటించడం లేదు. వ్యాక్సినేషన్, కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల పేరుతో వైద్య సేవలను మరిచినట్లు తెలుస్తోంది. కొంత మంది మధ్యాహ్నం లోపే విధులకు డుమ్మాకొట్టి వెళ్తుండగా, మరికొంత మంది వివిధ కారణాల చూపుతూ ఆరోగ్య కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కొంత మంది వైద్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. 

ఫీవర్‌ సర్వేతో వెలుగుచూస్తున్న వ్యాధులు..
జిల్లాలో ఇప్పటికే కోవిడ్‌తో చాలా మంది ఇబ్బందులు పడుతుండగా తాజాగా.. జిల్లా వ్యాప్తంగా సాధారణ వ్యాధులు పెరుగుతూ మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ఫీవర్‌సర్వేలో సీజనల్‌ జ్వరాలు బయటపడుతున్నాయి. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తుండడంతో వ్యాధుల తీవ్రత తెలుస్తోంది. గడిచిన 8 నెలల్లో కరీంనగర్‌ జిల్లాలో 11 డెంగీ కేసులు బయటపడ్డాయి. ఒకరు డెంగీ మరణించడం కలకలం రేపుతోంది.

ఈ కేసులు ఎక్కువగా పట్టణాల పరిధిలోనే నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మలేరియా కేసులు ఈ యేడాది కేవలం 2 మాత్రమే నమోదయ్యాయి. డెంగీ, మలేరియా ఎక్కువగా వచ్చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అధికారులు దోమల నివారణ చర్యలు చేపట్టడంలో తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement