సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత రెండు నెలల్లో రాష్ట్రంలో 5 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనా. జూలైలో 2 లక్షలు, ఆగస్టులో 3 లక్షల మంది జ్వరం బారినపడ్డారు. తరచూ వర్షాలు పడటం, వాతావరణం చల్లబడటం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక.. తదితర కారణాలతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా దోమలు కుడుతున్నాయి. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా విషజ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య ఒక్కసారిగా గణ నీయంగా పెరిగినట్లుగా వైద్య యంత్రాంగం అంచనా.
ఈ నెలంతా కూడా జ్వరాలు కొనసాగే పరిస్థితి ఉందని హెచ్చరిస్తున్నారు. డెంగీ, మలేరియా కేసులు మరింత అధికంగా నమోదయ్యే పరిస్థితులున్నాయి. ఒకవైపు కరోనా అనుమానం... మరోవైపు వైరల్ ఫీవర్లతో జనం హడలిపోతున్నారు. కొన్నిచోట్ల వైద్య, ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం బాధితులకు శాపంగా మారింది. అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు రావడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆగస్టులో డెంగీ కోరలు...
రాష్ట్రంలో డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆగస్టులోనే అత్యధికం వెలుగుచూశాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎక్కువ కేసులున్నాయి. ఇక మలేరియా కేసులు కూడా భారీగానే నమోదువుతున్నాయి. ఒక్క ఆగస్టులోనే 116 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. మలేరియా జ్వరాలు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ప్రభుత్వ అంచనాకు మించి జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం... అధికారికంగా ఒక కేసును గుర్తిస్తే, గుర్తింపునకు నోచుకోకుండా సమాజంలో పదింతలు అధికంగా కేసులున్నట్లుగా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆ ప్రకారం రాష్ట్రంలో కేసుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తాకిడి పెరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులను పీల్చి పిప్పిచేస్తున్నాయి. 50 వేల వరకు ప్లేట్‌లెట్లు ఉన్నా, ప్లేట్‌లెట్ రక్తం ఎక్కిస్తూ లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. అయితే 10 వేల వరకు తగ్గినా, వెంటనే ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరంలేదని వైద్య నిపుణులు అంటున్నారు.
పగటిపూట కుట్టే దోమతో డెంగీ...
డెంగీ కారక ఈడిస్ ఈజిప్ట్ దోమ పగటిపూటే కుడుతుంది. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో నిల్వ ఉంచే మంచినీటిలోనే పుట్టి పెరుగుతుంది. పగిలిన చిన్నముంతలో ఒక వారం రోజులు కదపకుండా దోసెడు నీరున్నా చాలు. అందులో పునరుత్పత్తి కొనసాగిస్తుంది. ఎయిర్ కూలర్లలో, డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన మంచినీటిలో, వాడకుండా పక్కన పడేసిన పాత టైర్లు, రేకు డబ్బాల్లోని నీటిలో జీవనం సాగిస్తుంది. ఇక మలేరియా దోమ మురుగునీటిలో వృద్ధి చెందుతుంది. అందుకే పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
డెంగీని నిర్లక్ష్యం చేయొద్దు
– డాక్టర్ బి.సౌమ్య, జనరల్ పిజీషియన్, కాంటినెంటల్ ఆసుపత్రి, హైదరాబాద్
ప్రస్తుతం జ్వరాల కేసులు భారీగానే నమోదవుతున్నాయి. గొంతునొప్పి, జ్వరంతో అనేకమంది ఆసుపత్రులకు వస్తున్నారు. డెంగీ, కరోనా కలిపి గతంలో అధికంగా కేసులు రాగా, ఇప్పుడు డెంగీ కేసులే ఎక్కువగా వస్తున్నాయి. డెంగీలో 102–103 జ్వరం కూడా వస్తుంది. పారసిటమాల్ మాత్ర వేసినా తగ్గే పరిస్థితి ఉండదు. కరోనాలో మాత్ర వేశాక తగ్గుముఖం పడుతుంది. డెంగీ లక్షణాలున్న తర్వాత నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం సంభవిస్తుంది.
మాకు వస్తున్న కేసుల్లో 90 శాతం వరకు ఇళ్లలోనే ఉంచి చికిత్స చేస్తున్నాం. 50 వేల వరకు ప్లేట్‌లెట్లు తగ్గినప్పుడే ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. 10 వేల వరకు తగ్గినా కూడా ఒక్కోసారి ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరంలేదు. రక్తస్రావం జరగడం ఇతరత్రా ప్రమాదకర లక్షణాలుంటేనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి.
సోమవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో ఒకే బెడ్‌పై చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులు
Comments
Please login to add a commentAdd a comment