అన్నీ బాగున్నా.. ఆ సర్టిఫికెట్‌ కావాలే! స్థోమతను బట్టి రూ.40 వేల నుంచి లక్ష | Disability Certificate For Disabled Persons | Sakshi
Sakshi News home page

అన్నీ బాగున్నా.. సదరం సర్టిఫికెట్‌ కావాలే! స్థోమతను బట్టి రూ.40 వేల నుంచి లక్ష

Published Sun, Feb 6 2022 2:47 AM | Last Updated on Sun, Feb 6 2022 9:24 PM

Disability Certificate For Disabled Persons - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: 
కరీంనగర్‌లో సుభాష్‌నగర్‌కు చెందిన ఓ విశ్రాంత పోలీసు అధికారి దంపతులు 100శాతం వైకల్యం సర్టిఫికెట్‌ సంపాదించారు. అందులో భార్యకు అంధత్వం ఉన్నట్టు, సదరు అధికారికి కాళ్లు పనిచేయవని సర్టిఫికెట్‌ (నంబర్‌ 09190181710100001) తీసుకున్నారు. ఏఎస్సై హోదాలో రిటైరైన సదరు అధికారి ఇలా దొంగ సర్టిఫికెట్లు తీసుకోవడం ఆశ్చర్యకరం.

జమ్మికుంట మండలంలోని ఓ ఊరి సర్పంచ్‌ భర్త కూడా దివ్యాంగుడిగా సదరం సర్టిఫికెట్‌ తీసుకున్నాడు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న ఆయనకు ఆ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారో అంతుచిక్కడం లేదు.

ఇలా ఒకటీరెండు కాదు కరీంనగర్‌ జిల్లాలో పెద్ద సంఖ్యలో తప్పుడు సదరం సర్టిఫికెట్ల వ్యవహారం సాగుతోంది. సదరం సర్టిఫికెట్లు జారీ చేసే కొందరు డిస్ట్రిక్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (డీఆర్‌డీఏ) సిబ్బంది, కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రిలో పనిచేసే వైద్యసిబ్బంది కలిసి యథేచ్ఛగా ఈ దందాకు తెరలేపారు. అడిగే సర్టిఫికెట్, వారి స్థోమతను బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అనర్హులు ఇలా పొందిన సర్టిఫికెట్లతో దివ్యాంగ పింఛన్లు, ఆర్టీసీ, రైల్వే పాసులు, పారిశ్రామిక రాయితీలు, సబ్సిడీ రుణాలు వంటివి పొందుతున్నారు. కొన్నేళ్లుగా నడుస్తున్న ఈ తప్పుడు సదరం సర్టిఫికెట్ల దందా ఇటీవల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు కింద చేసుకున్న దరఖాస్తుతో బయటపడింది.

అధికారులు కుమ్మక్కై..
ప్రతినెలా గ్రామాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ముందుగా నోటిఫికేషన్‌ ద్వారా షెడ్యూల్‌ ప్రకటించి, వైకల్యం ఉన్నవారిని రావాల్సిందిగా సూచిస్తారు. తర్వాత ఆ నెలలోని ఒక్కోవారంలో వేర్వేరుగా ఆర్థో (ఎముకల సంబంధిత), దృష్టి, వినికిడి, మానసిక వైకల్యం ఉన్నవారిని పరీక్షిస్తారు. సదరు వ్యక్తికి ఏ వైకల్యం ఉంది? ఎంతశాతం లోపం ఉందనేది నిర్ధారించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఇందులో కొందరు వైద్యసిబ్బంది, డీఆర్‌డీఏలోని కొందరు సిబ్బంది కుమ్మక్కై తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు.

దీనిపై అనుమానం వచ్చిన జిల్లాకు చెందిన సామాజిక ఉద్యమకారుడు సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేయడంతో వ్యవహారం మొత్తం బయటపడింది. దివ్యాంగుల జాబితాలో అర్హుల కంటే అనర్హులే అధికంగా ఉండటం చూసి విస్తుపోవాల్సి వచ్చింది. అంతేకాదు.. సదరం సర్టిఫికెట్లు పొందినవారిలో పలువురు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ పోలీసులు, ప్రజాప్రతినిధులు, భూస్వాములు ఉండటం గమనార్హం.

80 శాతం అనర్హులే..
గతంలో జోరుగా నడిచిన తప్పుడు సర్టిఫికెట్ల దందా కోవిడ్‌ కారణంగా దాదాపు ఏడాదిపాటు ఆగిపోయింది. తిరిగి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అప్పటినుంచి ఈ ఏడాది జనవరి వరకు నిర్వహించిన సదరం క్యాంపుల్లో దివ్యాంగులను పరీక్షించి, సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ ఏడాది కాలంలో 1,000కిపైగా సర్టిఫికెట్లు జారీ అయితే.. అందులో దాదాపు 800 మంది వరకు అనర్హులేనని సమాచారం. ఇలా తప్పుడు సర్టిఫికెట్ల కోసం పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలుఉన్నాయి. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.40 వేలదాకా, కొందరి వద్ద అయితే రూ.లక్ష దాకా వసూలు చేసినట్టు తెలిసింది. 800 మంది నుంచి రూ.40 వేల చొప్పున తీసుకున్నట్టు లెక్కించినా.. రూ.32 కోట్లకుపైనే దండుకున్నట్టు అంచనా.

ఎక్కడ చూసినా అవే..
తప్పుడు సదరం సర్టిఫికెట్ల దందా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. కరీంనగర్‌ జిల్లా పరిధిలోని కరీంనగర్‌ రూరల్, మానకొండూరు, కేశవపట్నం, జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంట, తిమ్మాపూర్, చొప్పదండి, వీణవంక, ఎలగందుల, మామిడాలపల్లి, కొత్తగట్టు తదితర మండలాల్లోనూ కొనసాగింది. ఇంక కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని అన్ని వార్డుల పరిధిలో తప్పుడు సర్టిఫికెట్లు పొందినవారు ఉన్నట్టు తెలిసింది. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో నివసిస్తున్న విశ్రాంత పోలీసు అధికారి దంపతులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్న విషయం పరిశీలనలో వెల్లడైంది.

వారి పనులు వారే చేసుకుంటున్నా.. సదరు విశ్రాంత అధికారి కదల్లేడని, అతడి భార్యకు కంటిచూపు లేదని సర్టిఫికెట్లు జారీ చేసిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిజమైన అర్హులను నెలల తరబడి తిప్పుకొంటున్నారని, అలాంటిది ప్రభుత్వ పింఛన్‌ తీసుకునేవారికి 100% వైకల్యమున్నట్టు సర్టిఫికెట్‌ ఎలా ఇస్తారని స్థానికులు మండిపడుతున్నారు.

ఈ ‘తప్పు’తో మరెన్నో అక్రమాలు
ప్రభుత్వం దివ్యాంగ పింఛన్‌ కింద నెలకు రూ.3,016 ఇస్తుండటంతో చాలా మంది తప్పుడు సదరం సర్టిఫికెట్ల కోసం ఎగబడుతున్నారు. అధికారులు దీనిని ‘ఆసరా’గా తీసుకుని ఒక్కొక్కరి నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. తప్పుడు సర్టిఫికెట్లు పొందినవారిలో చాలా మంది ఆసరా పింఛన్లు పొందుతున్నట్టు తేలింది. అదే సమయంలో విశ్రాంత ఉద్యోగులు, ధనవంతులు, స్థానిక ప్రజాప్రతినిధులూ తప్పుడు సర్టిఫికెట్లు తీసుకోవడంపై సందేహాలు వస్తున్నా యి.

చాలామంది వివిధ దివ్యాంగుల కోటాలో బస్సు, రైల్వే పాసులు తీసుకున్నారని తెలిసింది. మరికొందరు ఆదాయపన్ను మినహాయింపు కోసం వాడుతున్నట్టు బయటపడింది. ఇంకొం దరు పారిశ్రామికంగా రాయితీలు, బ్యాంకు రుణాలు, వాహనాల్లో సబ్సిడీలు పొందుతున్నట్టు సమాచారం. కొందరైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో దివ్యాంగుల కోటా ఉద్యోగాల్లోనూ చేరినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement