రెండు నెలల్లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు | Double Decker Bus Hits Hyderabad Roads In 2 Months | Sakshi
Sakshi News home page

రెండు నెలల్లో రోడ్లపైకి డబుల్‌ డెక్కర్‌ బస్సులు

Published Sun, Feb 7 2021 10:10 AM | Last Updated on Sun, Feb 7 2021 12:47 PM

Double Decker Bus Hits Hyderabad Roads In 2 Months - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా డబుల్‌ డెక్కర్‌ అనగానే వెనకవైపు వెడల్పాటి ప్రవేశ ద్వారం కనిపిస్తుంది. ఇక కింది డెక్‌లో ఒక కండక్టర్, అప్పర్‌ డెక్‌లో మరో కండక్టర్‌ ఉంటారు. కానీ మరో రెండు నెలల్లో హైదరాబాద్‌లో కొత్తగా పరుగుపెట్టబోతున్న డబుల్‌ డెక్కర్‌ బస్సుకు రెండు డోర్లు ఉండనున్నాయి. అలాగే రెండు డెక్‌లకూ కలిపి ఒకే కండక్టర్‌ ఉంటారు. ప్రస్తుతం భారత్‌ స్టేజ్‌–6 వాహనాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తోంది. దీంతో ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి రూపొందించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా కొనబోయే బస్సులు ఆ ప్రమాణాలతో తయారయ్యే తొలి డబుల్‌ డెక్కర్లు కానున్నాయి.

తక్కువ కాలుష్యం
అవసరమైన డబుల్‌ డెక్కర్‌ బస్సుల కోసం ఇప్పటికే టెండర్లు పిలిచిన అధికారులు ఈనెల 18న తయారీ సంస్థలతో ప్రీ బిడ్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. అందులో కొత్త బస్సులు ఎలా ఉండాలనే విషయంలో వారికి సూచనలు చేయనున్నారు. ఎక్కువ మంది ప్రయాణికులతో తిరిగే బస్సు కావటంతో దీనికి శక్తివంతమైన ఇంజిన్‌ ఉంటుంది. ఎక్కువ శక్తిని వాడాల్సి ఉండటంతో పాత బస్సుల్లో పొగ కూడా ఎక్కువగా విడుదలయ్యేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సుల్లో తక్కువ కాలుష్యం విడుదల చేసే యంత్రాలు ఉండనున్నాయి. భారత్‌ స్టేజ్‌–6 ప్రమాణాల ప్రకారం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా ఇంజిన్‌ను రూపొందిస్తున్నారు. రంగు కూడా ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం సిటీ బస్సుల్లో రెండు ప్రవేశ మార్గాలు ఉండగా.. మహిళలు ముందు నుంచి, పురుషులు వెనక నుంచి ఎక్కే పద్ధతి అమలులో ఉంది. గతంలో నగరంలో ఉన్న డబుల్‌ డెక్కర్లకు ఒకే ప్రవేశ ద్వారం కారణంగా ఈ నిబంధన ఉండేది కాదు. అందరూ వెనకవైపు వెడల్పుగా ఉండే ప్రవేశ మార్గం నుంచే ఎక్కేవారు. కొత్తగా వచ్చే బస్సుల్లో మాత్రం ముందు డ్రైవర్‌ క్యాబిన్‌ను ఆనుకుని మరో ప్రవేశ ద్వారం ఉండనుంది.

వెనుక కూడా డోర్‌!
గతంలో వెనకవైపు ఉండే ప్రవేశద్వారానికి తలుపు ఉండేది కాదు. దాని వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. అందువల్ల ఈసారి డోర్‌ పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వెనకవైపున పెద్ద ప్రవేశ మార్గం వల్ల గతంలో సీట్ల సంఖ్య తగ్గింది. ఇప్పుడు వాటి సంఖ్య పెంచేలా డిజైన్‌ రూపొందించాల్సిందిగా తయారీ సంస్థను కోరే యోచనలో అధికారులున్నారు. డబుల్‌ డెక్కర్‌కు రెండు తలుపులున్నా అప్పర్‌ డెక్‌కు వెళ్లే మార్గం (మెట్లు) ఒకటే ఉంటుంది. అప్పర్‌ డెక్‌కు వెళ్లే చోటనే కండక్టర్‌ టికెట్‌ జారీ చేస్తారు. 

గతంలో నష్టాలు భరించలేకే..
మెహదీపట్నం – సికింద్రాబాద్‌ స్టేషన్, సికింద్రాబాద్‌–జూపార్కు, సికింద్రాబాద్‌–సనత్‌నగర్, మెహిదీపట్నం–చార్మినార్‌ మార్గాల్లో 16 ఏళ్ల క్రితం వరకు డబుల్‌ డెక్కర్‌ బస్సులు పరుగులు పెట్టాయి. ఆ బస్సు అప్పర్‌ డెక్‌లో కూర్చుని ట్యాంక్‌బండ్‌ మీదుగా ప్రయాణిస్తుంటే ఆ సరదానే వేరుగా ఉండేది. కానీ  సాధారణ బస్సులతో పోల్చుకుంటే ఈ బస్సుల నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ. అందుకే అప్పట్లో డిమాండ్‌ ఉన్నప్పటికీ నష్టాలు భరించలేక ఆర్టీసీ వాటిని వదిలించుకుంది. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఈ బస్సులు తీసుకుంటోంది. ఎంత కొత్తతరం నమూనా బస్సు అయినా, నిర్వహణ వ్యయం మాత్రం తడిసి మోపెడవుతుందని అధికారులు భయపడుతున్నారు. తొలుత 40 బస్సులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలనే ఆదేశాలు వచ్చినా.. ఖర్చుకు భయపడి 25 మాత్రమే కొంటున్నారు. ఒకవేళ నష్టాలు వస్తే వాటికి తగ్గట్టుగా ప్రభుత్వం రాయితీలు ఇస్తే అవసరమైనన్ని కొనాలని అధికారులు భావిస్తున్నారు. నష్టాల మాటెలా ఉన్నా.. కోటి జనాభాతోపాటు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉన్న భాగ్యనగరానికి డబుల్‌ డెక్కర్‌ అదనపు ఆకర్షణగా నిలుస్తుందనడంలో మాత్రం సందేహం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement