
సాక్షి, హైదరాబాద్: పక్షులను వేటాడటం చూశాం.. కానీ, ఇక పక్షులే వేటకు వెళ్లే అపూర్వ సందర్భాలను చూడబోతున్నాం. ఇక పోలీసులకు అండ, మావోల పాలిట గండంగా మారనున్నాయి. సంఘ విద్రోహశక్తుల కదలికలపట్ల పోలీసులు నిశితంగా దృష్టి పెట్టారని చెప్పడానికి డేగకన్ను వేశారని అనేవాళ్లం కదా! ఇప్పుడు అసాంఘికశక్తులపై డేగలు నిజంగానే కన్ను వేయనున్నాయి. ఒకప్పుడు అడవుల్లోని మావోయిస్టు దళాల ఆనుపానులు గుర్తించేందుకు పోలీసులు ఉపగ్రహాల చిత్రాలు, డ్రోన్లు వాడేవారు. నిత్యం దండకారణ్యంలో తిరుగాడే మావోలు కూడా ఇప్పుడు డ్రోన్లు
వాడుతూ పోలీసుల కదలికలను తెలుసుకుంటూ వారి కంటపడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎత్తుకు పైఎత్తు వేసేలా మావోలు, ఇతర సంఘ విద్రోహకశక్తుల డ్రోన్లను పట్టుకునేందుకు పోలీసులు పలు గద్దలు, డేగలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పుష్కరకాలంగా ఆచూకీ లేకుండాపోయిన మావోలు నెలరోజులుగా తిరిగి తెలంగాణలో ఉనికి కోసం ప్రయత్నిస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని కట్టడి చేసేందుకు గరుడదళాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు.
వచ్చే ఏప్రిల్ నాటికి విధుల్లోకి!
గరుడదళాన్ని వినియోగించడం దేశంలోనే తొలిసారి. దేశంలో మరే రాష్ట్ర పోలీసులు పక్షుల సేవలను వాడుకోవడం లేదు. భద్రత కోసం తెలంగాణ పోలీసులు వేసిన ఈ అడుగుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. పోలీసు శాఖలోని వివిధ విభాగాలకుతోడు అశ్వ, జాగిల దళాలు పోలీసుల విధినిర్వహణకు ఎంతో దోహదపడుతున్నాయి. ఈ రెండింటినీ పోలీసులు ప్రత్యేక దళాలుగా చూస్తారు. ఆయా సందర్భాల్లో బాంబులను కనిపెట్టడం, హంతకుల ఆనవాళ్లను పసిగట్టడం, పలు ఆధారాలు, నిందితులను పట్టివ్వడంలో స్నిఫర్ డాగ్స్ (జాగిలాలు) కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు గరుడదళం చేరికతో పోలీసు శాఖ భద్రతాచర్యలు మరింత పటిష్టమవుతాయని సీనియర్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రెయినింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో శిక్షణకు కావాల్సిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
దేశంలోనే తొలిసారిగా..!
వాస్తవానికి టెక్నాలజీ పెరిగే నాటికి డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలతో నిఘా సులభతరంగా మారింది. అదే సమయంలో ఇలాంటి సాంకేతికత శత్రువు వద్ద కూడా ఉండే అవకాశాలు పుష్కలం. ఇప్పటికే మావోయిస్టు యాక్షన్ దళాల వద్ద శాటిలైట్ ఫోన్లు, డ్రోన్ కెమెరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూంబింగ్ సమయాల్లో పోలీసులపై మావోలు నిఘా ఉంచుతుండటం గమనార్హం. అందుకే, పోలీసుల అనుమతి లేకుండా ఎగిరే ప్రతి డ్రోన్‌ను పట్టుకునేందుకు పోలీసులు గరుడదళాలను రంగంలోకి దింపనున్నారు. నిఘా కోసం గరుడదళాన్ని వినియోగించడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక యూరోప్‌లో వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. అది ప్రముఖులకు సమస్యగా మారింది.
నెదర్లాండ్ పోలీసులే స్ఫూర్తి...
లండన్‌లోని బకింగ్çహామ్ ప్యాలెస్ చుట్టూ పలుమార్లు డ్రోన్లు ఎగిరాయి. ఇవి భద్రతాపరంగా పలువురికి తలనొప్పిగా మారాయి. ఇలాంటి సమస్యలు పెరగడంతో నెదర్లాండ్స్ పోలీసులు తొలిసారిగా డ్రోన్లను పట్టుకోవడంలో డేగ, గద్దలకు శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా ఈ స్ఫూర్తితోనే మావోల ఆట కట్టించేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగే పలు ఉత్సవాలు, మేడారంలో జరిగే జాతరలు, భారీ రాజకీయ సభల సమయంలో ఈ గరుడదళం ఇకపై తన ప్రత్యేకత చాటుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment