
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఆగ్రహం వ్యక్తం చేసింది. శంషాబాద్ ఘటనలో మృతి చెందిన ప్రియాంకరెడ్డి తల్లిదండ్రులు కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు చేసేందుకు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు వస్తే పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని పేర్కొంది. తమ పరిధి కాదని నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కనీసం మానవీయ కోణంలో కూడా స్పందించకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది. ప్రియాంకరెడ్డి హత్య ను సెక్షన్ 10 కింద సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్..విచారణ నిమిత్తం ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు శ్యామల ఎస్ కుందన్ శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులను పరామర్శించి వారిని ఓదార్చారు.
ఆ తర్వాత బేగంపేటలోని హరితాప్లాజాలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులు పరిధి ప్రకారం విధులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ గైడ్ చేయడంలో కూడా కీలక భూమిక పోషించాల్సి ఉందన్నారు. ప్రియాంకారెడ్డి తల్లిదండ్రుల ఫిర్యాదుపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో సమన్వయపరిస్తే సమస్య మరింత ముందుగా వెలుగులోకి వచ్చేదన్నారు. బాధితురాలి హత్య ఉదంతంపై పలు అనుమానాలున్నాయని, తమ విచారణలోనూ పోలీసులు చెప్పలేదన్నారు. పలు అంశాలకు సంబంధిం చి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. ప్రధాన రహదారి, నగరానికి అత్యంత సమీపం లో ఉన్న ప్రాంతంలో పెట్రోలింగ్ సరిగ్గా జరగలేదని, రెండ్రోజులుగా లారీ నిలిపి ఉన్నా కనీసం గుర్తించకపోవడం దారుణమన్నారు.
ఇందులో పోలీసుల వైఫల్యం కనిపిస్తుందని పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసమే సీసీటీవీలను ఏర్పాటు చేస్తారని, ఘటన జరిగిన తర్వాత ఆధారాల కోసం కాదన్నారు. సీసీటీవీ ఫుటేజీ సరిగ్గా నమోదు కాలేదని, వాటిని నిర్మించిన కాంట్రాక్టు సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, కేసు నమోదు చేయాలన్నారు. ఆర్జీఐఏ పీఎస్ అధికారులు, పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెంటనే మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ కమిషన్ ఉంటే కేసు విచారణ మరింత సులభతరమయ్యేదన్నారు. ఆపద సమయంలో 100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేయాలని, ప్రతి పేరెంట్ పిల్లలకు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.
విలువైన సమయాన్ని వృథా చేశారు: రేఖాశర్మ
పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్య కేసులో పోలీసులు విలువైన సమయాన్ని వృథా చేశారని, ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు సత్వరం స్పందించి ఉంటే ప్రి యాంకారెడ్డి ప్రాణాలతో మనకు దొరికి ఉండేదని జాతీయ మహిళా కమిషన్ చైర్‌ప ర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం పూర్తిగా ఉందని ఆరోపిం చారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లినప్పుడు ఎవరితోనో వెళ్లుంటుందిలే అన్న పోలీసు వ్యాఖ్యలపై కూడా ఆమె విరుచుకుపడ్డారు. సున్నితమైన ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ బాధ్యతగా వ్యాఖ్యలు చేయాల్సిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment