ఆర్టీసీ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’ | 'Dynamic Pricing' in RTC Online Ticket Booking | Sakshi

ఆర్టీసీ ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’

Published Fri, Mar 24 2023 3:43 AM | Last Updated on Fri, Mar 24 2023 3:43 AM

'Dynamic Pricing' in RTC Online Ticket Booking - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటీ పోటీని తట్టుకునేలా, సంస్థను లాభాలబాట పట్టించేలా ఆర్టీసీ కొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు అనువైన విధానాల కోసం వెతుకుతోంది. అందులో భాగంగా ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో ‘డైనమిక్‌ ప్రైసింగ్‌’విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా బెంగళూరు మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది.

గురువారం ఇక్కడి బస్‌భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్విసుల్లో ఈ నెల 27 నుంచి డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. విమానాలు, హోటళ్లు, ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్ల బుకింగ్‌లో ఇప్పటికే అమల్లో ఉన్న డైనమిక్‌ ప్రైసింగ్‌ను త్వరలోనే ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సదుపాయమున్న సర్విస్‌లన్నింటిలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.

సర్విస్‌ ప్రారంభమయ్యే గంటముందు వరకు ఆన్‌లైన్‌ టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. రద్దీ తక్కువగా ఉన్నరోజుల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం 60 రోజుల వరకు కల్పిస్తున్నామని గుర్తుచేశారు.

సంస్థ అధికారిక వెబ్‌సైట్‌  www. tsrtconline. in లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని సూచించారు. ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతోనే డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు గోవర్దన్, సజ్జనార్‌ తెలిపారు.  

 డైనమిక్‌ ప్రైసింగ్‌ అంటే... 
ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్‌ ధరల్లో హెచ్చుతగ్గులు జరగడమే డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానం. రద్దీ తక్కువగా ఉంటే సాధారణచార్జీ కంటే తక్కువగా ఈ విధానంలో టికెట్‌ ధర ఉంటుంది. డిమాండ్‌ ఎక్కువగా ఉంటే ఆ మేరకు చార్జీలుంటాయి. డైనమిక్‌ ప్రైసింగ్‌ విధానంలో అడ్వాన్స్‌డ్‌ డేటా అనాలసిస్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్‌ మార్కెట్‌లోని డిమాండ్‌ను బట్టి చార్జీలను నిర్ణయిస్తాయి.

ప్రైవేట్‌ ఆపరేటర్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల బుకింగ్‌లతో పోల్చి టికెట్‌ ధరను వెల్లడిస్తాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన సీటును బుక్‌ చేసుకోవచ్చు. ఈ విధానంవల్ల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు సాధారణచార్జీ కన్నా 20 నుంచి 30 శాతం వరకు టికెట్‌ ధర తక్కువగా ఉంటుంది. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే సాధారణ చార్జీ కన్నా డిమాండ్‌ బట్టి 25 శాతం వరకు ఎక్కువగా టికెట్‌ ధర ఉంటుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement