సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలిచామనే ఆనందంలో కొందరు.. ఓడిపోయిన నిస్పృహలో మరికొందరు.. తెలిసి కొందరు.. తెలియక ఇంకొందరు.. నిర్లక్ష్యంతోనో మరో కారణం చేతనో చేసిన పని ఇప్పుడు వారిపాలిట శాపంగా మారింది. ఎన్నికల వ్యయం వివరాలు సమర్పించనందకు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా దాదాపు 40వేల మందిపై అనర్హత వేటు పడింది. ఇందులో కొందరు పదవులు సైతం కోల్పోయి లబోదిబోమంటున్నారు.. ఇదండీ 2019 స్థానిక సంస్థల్లో పోటీ చేసి ఎన్నికల వివరాలు ఈసీకి సమర్పించని వారి సంగతి.
అసలేం జరిగిందంటే..
రాష్ట్రంలో 2019 జనవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులందరూ తమ ఖర్చు వివరాలు మొత్తం ఈసీకి వెల్లడించాలి. దీనికి గెలుపోటములతో సంబంధం లేదు. ప్రతి ఒక్క అభ్యర్థీ తమ వ్యవ వివరాలు ఫలితాలు వెలువడిన 45 రోజులలోపు అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా వివరాలు సమర్పించకపోతే ఈసీ చర్యలు తీసుకుంటుంది. ఫలితంగా గెలిచినవారు పదవిని కోల్పోతారు. ఓడినవారు మూడేళ్ల పాటు పోటీకి అనర్హులవుతారు. ఇదే కోవలోనే 2019లో రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వార్డు సభ్యులు మొదలుకొని జడ్పీటీసీల వరకు పోటీచేసిన వారిలో 39,499 మంది అనర్హతకు గురయ్యారు.
ఇందులో ఆ ఎన్నికల్లో ఓడిన వేలాది మందితోపాటు గెలిచి సర్పంచ్‌లు అయిన 17 మంది, వార్డు సభ్యులు 3,499 మంది, ఎంపీటీసీలు ఆరుగురు ఉన్నారు. దీంతో గెలిచి అనర్హత వేటుకు గురయినవారి స్థానాలతోపాటు, వివిధ కారణాలతో ఏర్పడిన ఖాళీలకు త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొదట వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌తోపాట, కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి, తదనంతంర గ్రామీణ స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
ఈ రెండు గ్రామాల్లో వార్డు స్థానాలన్నీ ఖాళీ
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జియాపల్లి, జియాపల్లి తండా గ్రామ పంచాయతీల్లోని వార్డు సభ్యులంతా అనర్హత వేటుకు గురయ్యారు. ఈ రెండు పంచాయతీల్లో ప్రస్తుతం ఇద్దరు సర్పంచ్‌లు మాత్రమే ఉనికిలో ఉండగా, వార్డు సభ్యులు లేకుండా పోయారు. 2019 పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వీరంతా సకాలంలో ఎన్నికల ఖర్చు వివరాలను సంబంధిత అధికారులకు సమర్పించకపోవడం వల్లనే అనర్హత వేటు పడింది.
నిబంధనలు ఇలా..
ఐదు వేలకుపైగా జనా భా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50లక్షలు, వార్డు మెంబర్ అభ్యర్థి రూ.50వేలు మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే ఐదు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.50లక్షలు, వార్డు అభ్యర్థి రూ.30వేలు దాటకుండా ఖర్చు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment