సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలను ప్రశ్నిస్తారనే అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
అసలు నేషనల్ హెరాల్డ్ కేసులో వీరికేం సంబంధమన్న చర్చ జరుగుతోంది. ఈ కేసులో ఇంతకుముందే కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు ఇచ్చి విచారించింది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్య కంపెనీ యంగ్ ఇండియన్‌కు తాము ఇచ్చిన విరాళాలపై ఈడీ ప్రశ్నించినట్టు ఆయన వెల్లడించారు కూడా.
మొదట నలుగురికి!
రాష్ట్ర కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కోశాధికారి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, పార్టీ పొలిటికల్ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీలకు ఈడీ నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నా యి. ఈ ప్రచారం పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన రేపుతోంది. అయితే ఈ నేతలు ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్తున్నారు.
మరోవైపు ఈ నలుగురితోపాటు కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మరికొందరికి కూడా హెరాల్డ్ కేసులో నోటీసులిచ్చే అవకాశాలు ఉన్నట్టు ఈడీ వర్గాల ద్వారా తెలిసింది.
ముందు కొందరు.. తర్వాత మరికొందరు..
వచ్చే నెల 10వ తేదీన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఆ తర్వాతిరోజు షబ్బీర్ అలీ ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. ఆ తర్వాతి దశలో మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌లను ఈడీ విచారించాలని భావిస్తున్నట్టు తెలిసింది. మనీ ల్యాండరింగ్ యాక్ట్ 2005 అండర్ సెక్షన్ 50 కింద నోటీసులు ఇస్తున్నట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
నోటీసులు రాలేదు.. వస్తే గర్వంగా వెళ్తాం: అంజన్‌కుమార్
తమకు ఇప్పటివరకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ చెప్పారు. తాను నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం రూ.20 లక్షలు విరాళం చెక్ రూపంలో ఇచ్చానని తెలిపారు. ఆ డబ్బుకు ట్యాక్స్ కూడా కట్టానని, ఈడీ పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఏమాత్రం భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అయినా ఈ కేసులో తనను ఈడీ పిలిస్తే గర్వపడతానని.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన కేసులో తనను కూడా పిలవడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.
దర్జాగా ప్రెస్‌మీట్ పెట్టి చెప్తా: సుదర్శన్‌రెడ్డి
నేషనల్ హెరాల్డ్‌కు నాలుగు నెలల క్రితం రూ.15 లక్షల విరాళం ఇచ్చానని, అది పన్ను కట్టిన డబ్బేనని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి చెప్పారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, వస్తే దర్జాగా ప్రెస్‌మీట్ పెట్టి మీడియాకు చెప్తానని పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు ఎలాంటి భయం లేదన్నారు.
ఎప్పుడు పిలిచినా వెళ్తా..: గీతారెడ్డి
తాను నేషనల్ హెరాల్డ్‌కు కొంత మేర చెక్ రూపంలో విరాళం ఇచ్చానని.. ఈ కేసులో ఈడీ పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి గీతారెడ్డి చెప్పారు. పార్టీలో చాలా పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీని విడిచి వెళ్లిన వాళ్లకు సిగ్గు వచ్చేలా ధైర్యంగా వెళ్లి విచారణ ఎదుర్కొంటానని తెలిపారు. తాను ఇచ్చిన డబ్బుకు లెక్కాపత్రం అన్నీ ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment